Tuesday, November 28, 2017

ఆణిముత్యాలు కావాలి......2


"......వడ్లూ, మట్టి బెడ్డలూ....." -- (-1)(బియ్యంలో వడ్లూ, మట్టిబెడ్డలూ అంటే......ఈ కాలం వాళ్లకి చాలామందికి తెలియదు! అందుకే ఈ "నేపథ్య" వివరణ. నా వివరణలో ఏమైనా లోపాలు వున్నా, సవరణలు వున్నా, పెద్దలు ఎవరైనా సూచిస్తే సంతోషిస్తాను)గోదావరి మీద ఆనకట్ట కట్టాక, స్వాతంత్ర్యం వచ్చేనాటికి, గోదావరి జిల్లాల్లో భూములు మాగాణులయ్యేనాటికి "అక్కుళ్లు" అనే రకం బియ్యం పండించేవారు. సామాన్యంగా అందరూ వాటినే వండుకు తినేవారు. కొంచెం ధనవంతులు "కృష్ణకాటుకులు" అనే రకం బియ్యం తినేవారు. అవి అక్కడక్కడా పండేవి. ఇంక, లక్షాధికారులు మాత్రం, "బంగారు తీగెలు" అనే రకం బియ్యం వండించుకు తినేవారు. ఈ రకం ఎక్కడ పండేవో.....లేదా దిగుమతి చేసుకునేవారో నాకు తెలియదు.

 ఆ రోజుల్లో, ఎకరానికి 7 బస్తాలు పండితే చాలా గొప్ప!
60 లలో అనుకుంటా--సస్య విప్లవంలో భాగంగా, ఐ ఆర్ 8 అనే రకం వచ్చాయి. ఎకరానికి దిగుబడి 18 నుంచి 20 బస్తాలదాకా పెరిగింది. తరువాత క్రమంగా హంస లాంటి రకాలు, తరువాత మసూరి వచ్చాయి. అప్పటికి అంటే 1980 నాటికి మా జిల్లాల్లో, ఎకరం ఖరీదు ఒక లక్ష. అదే శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో, ఎకరం పదివేలు!

ఇంతకీ, అప్పటివరకూ ధాన్యాన్ని పొలాల్లోనే కళ్లాల్లో నూర్చి, ధాన్యాన్ని అమ్మేవారు. అందుకే బియ్యం ఆడినా, వాటిలో కొన్ని వడ్లు నలగకుండా మిగిలిపోయేవి, కొన్ని మట్టి బెడ్డలూ కలిసిపోయేవి.
గృహిణులు, బస్తా బియ్యం తెచ్చుకుంటే, రోజూ మధ్యాహ్నం వేళ ఓ కుంచెడో ఎన్నో, చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం కూడా!

90 ల నాటికి, చిన్న పట్టణాల్లో కూడా మినీ సూపర్ బజార్లు వచ్చాయి. వాళ్లే అన్నీ శుభ్రం చేయించి, పేకెట్లలో సీలు చేసి, కొంచెం ఎక్కువ ధరకి అమ్మసాగారు. ఇప్పటికీ అదే జరుగుతోంది కాబట్టి ఈ కాలం వాళ్లకి వడ్లూ బెడ్డల సంగతి తెలియదు.

అన్నట్టు, 1970 ల్లో, కావాలని కొందరు వ్యాపారస్తులు బియ్యంలో రాళ్లు కలపడం అనే మోసానికి పాల్పడేవారు. అప్పుడే ".....కొలిచారు రాళ్లు నాయాళ్లు...." లాంటి పాటలు వచ్చాయి.

ఇంకా చెప్పాలంటే, 1962 లో బియ్యానికి రేషన్ పెట్టారు......చైనా యుధ్ధం వచ్చినప్పుడు. అదే మనదేశంలో రేషన్లకి ప్రారంభం. ఆ తరువాత కూడా, బియ్యం అమ్మడానికి ప్రత్యేకంగా లైసెన్‌స్ వుండేది. తరువాత్తరువాత ఆ లైసెన్‌స్ ఎత్తివేసి, అందరూ బియ్యం అమ్మచ్చు అన్నారు. అక్కణ్నించీ మొదలయ్యాయి బియ్యం కష్టాలు. రకరకాల బియ్యం, కల్తీలు, ఒక్కోచోటా ఒక్కో రేటు........ఇలా.

దీనికి కారణం మాత్రం ఖచ్చితంగా "కాంగీ" యే!

(మరో సారి)  

Monday, November 27, 2017

ఆణి ముత్యాలు కావాలి....

"......వడ్లూ, మట్టి బెడ్డలూ....." -- 1

అన్నం వండాలంటే, బియ్యం లోంచి వీటిని ఏరి పారెయ్యాలి! అలాగే మన వ్యవస్థ లోంచీ....!

ఎందుకు చెప్పొచ్చానంటే, ఇన్నేళ్లనుంచీ రైళ్లలో, విమానాల్లో ప్రయాణిస్తున్నానుగానీ, మనం భోజనం ఆర్డర్ ఇచ్చాక, ఆ ట్రే మన మొఖాన్న పారేసి పోతారు.....తిన్నా, తినక పోయినా మీ ఇష్టం అంటూ! పెట్టింది ఎలా వుంది, ఇంకేమైనా కావాలా అని అడిగిన పాపాన పోయినవాడు ఎవడూ లేడు. నిజంగా ఎవరైనా అలా అడిగితే ఎంత బాగుంటుంది?! నాకైతే, అలా అడిగినవాళ్లని కౌగిలించుకోవాలనిపిస్తుంది. 

మొన్న రాజధానీ ఎక్‌స్ప్రెస్ లో, ఐ ఆర్ సీ టీ సీ కేటరింగ్ అబ్బాయి డిన్నర్ ట్రే లు మామూలుగానే పంచిపెట్టాడు. దాదాపు పూర్తిగా తినే లోగానే, మళ్లీ వచ్చి, అందరినీ అడిగాడు....."సార్! ఇంకేమైనా కావాలా....రొట్టెలుగానీ, అన్నం గానీ...." అంటూ!

అతని పేరు "హరి ఓమ్"! దిగే ముందు అతనికి విషయం చెప్పి, షేక్ హాండ్ ఇచ్చి, తగినంత టిప్ కూడా ఇచ్చాను.

వడ్లూ, బెడ్డలూ ఏరి పారేసిన తరువాత మిగిలే నిఖార్సైన బియ్యం గింజలలో ఒకడు అతను.

అలాంటివాళ్లే కావాలి దేశానికి!

Monday, July 24, 2017

అవినీతీ......

"ద్రోహులు......ఊలిపికట్టెలు.....కాంగీలు......"


అసలు ఆ పరప్పన్న ఎవరో, ఆయనకి ఏ రాజుగారు అగ్రహారం ఇచ్చాడో, అందులో అంత పెద్ద భవనం ఎందుకు కట్టారో, దాన్ని జైలు గా ఎందుకు మార్చారో.....నాకు తెలీదు గానీ, అది తరచూ వార్తల్లో ఉంటుంది!

మొన్న దక్షిణభారత అవినీతి మహారాఙ్ఞి గారి నెచ్చెలి కి, ఆ జైల్లో ఓ అంతస్తు మొత్తం, అందులో 5 గదులూ, సకల సౌకర్యాలూ--2 కోట్లు మాత్రమే తీసుకొని మరీ, ఒకాయన కేటాయించారని ఓ జైళ్ల ఉన్నతాధికారిణి పై అధికారికి ఫిర్యాదు చేస్తే, ముఖ్య మంత్రి గారు "క్రమశిక్షణ ఉల్లంఘించావు" అంటూ ఆమెనే బదిలీ చేసి పారేశారు.

పైగా, ఆ జైళ్ల పై అధికారి, జైలుకి వెళ్లి, ఖైదీలతో ఆ అధికారిణికి వ్యతిరేకంగా "ఆందోళన" చేయించారట!

అసలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న--ముఖ్యమంత్రులకీ, ఆ జైళ్ల పై అధికారులకీ, 2 కోట్ల అధికారికీ శిక్షలు ఏమిటో......ఎప్పుడో......?

అయినా, ఆ రాణిగారిదీ, ఆవిడ నెచ్చెలిదీ తప్పేముందిలెండి! ధనాన్ని సంపాదించడమే కాదు, దాన్ని అనుభవించాలి, ఇంకొందరికి పంచాలి--అని ప్రవచనకారులు చెప్పే మాటలని తు చ తప్పకుండా ఆచరించడమేగా వాళ్లు చేసింది, చేస్తున్నది!

Thursday, January 19, 2017

పిచ్చి లెఖ్ఖలూ....

"సో కాల్డ్ 'నిపుణులు'....!"

(ఇది 30-12-2016 న ఫేస్ బుక్ లో ప్రచురించినదే......తరువాయి వ్రాయడానికి ముందు ఇక్కడ ప్రచురిస్తున్నాను).

బి కామ్ లో మేథ్స్, ఫిజిక్స్ చదువుకున్న ఎం ఎల్ ఏ నో, మంత్రో, ఏదో వాగితే నవ్వుకుంటాము. కానీ, నిజంగా కామర్స్ లో ఉన్నత విద్యని అభ్యసించిన వారూ, బ్యాంకుల్లో ఉన్నత పదవుల్లో ఉండి, విశ్రామ్తులైన వాళ్లు, ఎం బీ ఏ లు చేసినవాళ్లు కూడా, పిచ్చి లేఖ్ఖలు మాట్లాడితే??!!
అవునయ్యా.... ఓ 500 నోటు పదివేల చేతులు మారినా, ఏ రుసుములూ ఉండవు! నగదు రహితం తో, పదివేల చేతుల్లో, దాదాపు, నీ లెక్కల ప్రకారమే, ఓ లక్ష రూపాయలు సంపాదించుకుంటాడు ఆ బ్యాంకు వాడో, పేటిఎమ్ లాంటి వాడో. (*99# వాడితే, అది లావాదేవీకి 50 పైసలు మాత్రమే... అదీ భవిష్యత్తులో ఎప్పుడో!)
కానీ, గత 70 ఏళ్ళనుంచీ, బిల్లులు లేకుండా వ్యాపారం చేస్తూ, నల్లధనాన్ని పోగేసుకుంటున్న వాళ్ళ లావాదేవీల "పారదర్శకత" తో, దేశానికీ, మనకీ ఎంత మేలు?!
ఉదాహరణకి, అప్పట్లో.... ఓ పదివేలలోపు జనాభా ఉన్న ఊరికి, ఓ మార్వాడీ కొంత సొమ్ముతో వచ్చి, ఓ పెంకుటి షాపు అద్దెకు తీసుకొని, తాకట్టు వ్యాపారం మొదలెట్టాడు. బంగారం వస్తువులు తాకట్టు పెట్టుకొని, ఇచ్చే అప్పు మీద, 100కి, నెలకి, ఒక కానీ మాత్రమే (అప్పట్లో 3 పాత పైసలు) వడ్డీ!
(మరో సారి!)

Thursday, January 12, 2017

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......6


సరైన ప్రత్యామ్నాయాలు చూపించకుండా......!

(మొన్నటి టపా తరువాయి)అసలు "సరైన ప్రత్యామ్నాయం" అంటే ఏమిటి? అది దేనికి అవసరం? ఈ విషయాన్ని ఏ నిపుణుడూ వివరించలేదు!

వాళ్ల ఉద్దేశ్యం......రద్దు చేసిన పెద్ద నోట్ల స్థానం లో మళ్లీ అవే నోట్లు ప్రవేశ పెట్టాలి అనా? లేదా, పాత నోట్లు మార్చుకోవలసిన అవసరం లేకుండా, కొత్త నోట్లు ప్రవేశ పెట్టవలసింది అనా? ముందు, ఏటీఎం లు అన్నింటిలోనూ కొత్త నోట్లు నింపేసి, అప్పుడు పాతనొట్లు రద్దు చెయ్యవలసింది అనా? మరేమైనానా? ఏమనుకోవాలి మనం వీళ్ల "నిపుణత"ని?

పైన చెప్పినవాటిలొ ఏది చేసినా, రహస్యం వెల్లడి అయ్యేది! నల్లధనం మొత్తం మాయం అయ్యేది.....మరిన్ని రూపాల్లో! అందుకే హఠాత్తుగా ప్రకటించడం.

1978 లో, 10 వేలు, 5000 నోట్ల రద్దు చేసినప్పుడు--ప్రత్యామ్నాయాలు అసలు లేవు! మార్పిడి అనుమతించబడలేదు! ఏటీఎం లు లేవు! కొత్తగా మరిన్ని చిన్న నోట్లు విరివిగా జారీ చెయ్యడం......లేదు! కేవలం ఆ నోట్లని, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమే.....రద్దు నుంచి రక్షణ....అదీ, పూర్తి వివరాలు ధృవీకరణ పత్రం లో వ్రాసి, సంతకాలు చేశాక!

మరి ఈ సారి అలా ఎందుకు చెయ్యలేదు.....అంటే, అప్పట్లో చెలామణీ లో ఉన్న నోట్లే, తక్కువ. వాటిలో 10000 నోట్లు , 5000 నోట్ల కంటే చాలా, చాలా తక్కువ! అందుకే, 10 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్నారు. 5 వేల నోట్లు పెద్ద సంఖ్యలోనే డిపాజిట్ చేసుకున్నారు. మిగిలినవాటిని, వివరాలు చెప్పలేనివాటిని, సిగరెట్లూ, కుంపట్లూ వెలిగించడానికి ఉపయోగించుకున్నారు!

ఇప్పుడు, అప్పటి కన్నా కొన్ని వేల రెట్లు నోట్లు చెలామణీ లో ఉన్నాయి. అందుకే, మార్పిడి! ఆ మాత్రానికి సంతోషించాలి అందరూ.

(ఇప్పుడు, అన్ని చోట్లా, ఏటీఎం ల ముందు క్యూలు లేవు, బ్యాంకుల్లో పరిమితికి లోబడి, అందరికీ కోరినంత నగదు అందుతూంది! డిజిటల్ లావాదేవిలు పెరిగాయి! ఆ టీవీల, నిపుణుల నోళ్లు మూతపడ్డాయి!)

(......మరోసారి)

Monday, December 26, 2016

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......5

ఆర్బీఐ పారదర్శకత.....

(మొన్నటి టపా తరువాయి)

మొన్న ఓ పెద్దాయన--అదే....నిపుణుడు, టీవీలో, "బ్యాంకులవాళ్లని ఏటీఎం లలో ఎందుకు నగదు ఉంచటం లేదు? అని అడిగితే, ఏటీఎం లలో పెడితే, అన్ని బ్యాంకుల ఖాతదారులూ తీసుకుంటారు, మా శాఖ అయితే, మా ఖాతాదారులకే ఇవ్వచ్చు. మాకు ఆ బాధ్యత ఉంటుంది కదా? అన్నారు" అని చెప్పాడు. మరి అలాంటి ఆదేశాలు ఎవరు ఇచ్చారు? అని ఆయన అడగాలేదు, వాళ్లు చెప్పాలేదు....అని ఓ దురభిప్రాయం కలగాలి చూసేవాళ్లకి!

ఇప్పుడు కావలసింది, వీలైనంత ఎక్కువ నగదు చెలామణీ లోకి రావాలి. పరిమిత మొత్తాల్లో, ఎక్కువమంది ద్వారా నగదు చెలామణీ లోకి రావాలి అంటే, ఏటీఎం ల వల్లే సాధ్యం.....అనే చిన్న నిజాన్ని ఎందుకు మరిచిపోతున్నారు? అలా ఎందుకు ఒప్పుకోరు?

20-12-2016 నాటికి పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఉన్నతాధికారుల్లో ఎవరికి ఙ్ఞానోదయమయ్యిందో గానీ, ఆంధ్రా బ్యాంకు లో వారానికి 24,000 చొప్పున, అంతకు లోబడి, అడిగినవారికి అడిగినంత వితరణ చేశారు! ఏటీఎం లో కూడా నగదు వుంచారు.....2 గంటల్లో ఖాళీ అయ్యింది. 

పూర్వం నేను పనిచేసిన శాఖలో ఆ రోజు, ఒక 60 మంది రూ.24,000/-; దాదాపు 200 మంది అంతకు లోపు నగదు తీసుకోగలిగారు! 

స్టేట్ బ్యాంకులో ఆ రోజుకూడా నగదు లేకపోయినా, ఊళ్లో నగదుకొరత లేకుండా పూర్తిగా చెలామణీ జరిగింది!

21 వ తేదీ నుంచి, దాదాపు మా ఊళ్లో అన్ని బ్యాంకుల్లోనూ, అధిక శాతం ఏటీఎం లలోనూ నగదు వితరణ బాగానే జరుగుతోంది!

"50 రోజులు" కన్నా ముందే, ఎవరు ఎంత అరిచిగీపెట్టినా, నగదు కష్టాలు తీరిపోతున్నట్టే! 

ఇంక, ఆర్బీఐ పారదర్శకత.....సంగతి.....!

ఆర్బీఐ గత 90 యేళ్లనుంచీ చేస్తున్న పనే--నగదు ముద్రణా, పంపిణీ--ఇప్పుడూ చేస్తోంది! ఆ విషయం మన సోకాల్డ్ నిపుణులు వారికి నేర్పఖ్ఖర్లేదు.....సలహాలు ఇవ్వ వలసిన అవసరం లేదు. 

ఆర్బీఐ కి ఈ విషయం లో "పారదర్శకత" (అంటే, మీడియావాళ్లకి ప్రతిరోజూ బులెటిన్లు విడుదల చేయడం) పాటించవలసిన అవసరం లేదు!

స్థూలంగా, గత వారాల్లోనూ, నెలల్లోనూ ఏ బ్యాంకు నుంచి ఎంత నగదు చెలామణిలోకి వచ్చింది, ప్రస్తుతం ఎంత అవసరం వుంటుంది అనే లెఖ్ఖల మీద ఆథారపడి, బ్యాంకులకి నగదు పంపిణీ జరుగుతుంది. (ముఖ్యంగా....యే రాష్ట్రానికి ఎంత? అనే ప్రశ్నే రాదు! ఆ బాధ్యత ఆ బ్యాంకు యాజమాన్యాలదే! యూపీ ఎలక్షన్లొస్తున్నాయి కాబట్టి, అక్కడ ఎక్కువ నగదు పంపిణీ చేస్తున్నారు.....లాంటి ఆరోపణలు పూర్తిగా హాస్యాస్పదం!)

ఇప్పుడు, ఇదివరకు కన్నా చాలా వేగంగా ఆర్బీఐ నుంచి బ్యాంకులకి నగదు వితరణ జరుగుతూంది. కొన్ని నిబంధనలు కూడా సడలించి మరీ చేస్తున్నారు. 

(వివరంగా వ్రాయమంటే ఇంకోసారి వ్రాస్తాను.)

ఇలాంటి పరిస్థితుల్లో, ఆర్బీఐ మీద ఆరోపణలు చేస్తున్నవాళ్లు......మూర్ఖులు!

4) సరైన ప్రత్యామ్నాయాలు చూపించకుండా......!

(......మరోసారి)

Sunday, December 18, 2016

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......4

నగదు వితరణ సమస్య.....

(మొన్నటి టపా తరువాయి)

రాష్ట్ర ప్రభుత్వం వారు, 9000 కోట్లు వస్తున్నాయి అనీ, అందులో సింహభాగం 500 నోట్లూ, చిన్న నోట్లే అనీ, క్రితం శనివారం (10-12-2016) నాటికి అన్ని బ్యాంకులకీ చేరుతాయి అనీ ప్రకటించారు. పించన్లు బ్యాంకులలో జమచేయడం పొరపాటే అనీ, బ్యాంకుల్లో జమ కాని వారికి, పాత పధ్ధతిలో, ఇంటి వద్దే చెల్లిస్తాము అని కూడా ప్రకటించారు.

ఆర్బీఐ వారు, ప్రతిరోజూ ఉదయం 9-00 కల్లా బ్యాంకుల శాఖలలో నగదు అందజేయవలసిందే--అని నగదు భాండాగారాలు నిర్వహిస్తున్న బ్యాంకులని ఆదేశించారు!

అయినా, ఈ టపా వ్రాస్తున్న రోజు--19-12-2016 వరకూ--పరిస్థితి లో మార్పు లేదు! మొన్న శనివారం అయితే, మా వూళ్లో అన్ని బ్యాంకులలోనూ, నగదు వితరణ అసలు జరగలేదు.....నగదు లేదు అనే బోర్డులనే ప్రదర్శించారు.....అంటున్నారు!

మరి......బాధ్యులు ఎవరు?

బ్యాంకుల సిబ్బంది, సెలవులు వాడుకోకుండా, రోజూ దాదాపు 10 గంటలకి పైగా పనిచేస్తున్నారు......! అని చెప్పడం--అతిశయోక్తి మాత్రమే. 

సెలవు రోజులు నవంబర్ 12, 13 న మాత్రమే పనిచేశారు. తరువాత ఆర్బీఐ గానీ, ప్రభుత్వం గానీ, సెలవుల్లో పనిచేయమని చెప్పలేదు.....నగదు సరఫరా పరిస్థితుల వల్ల. సిబ్బంది, సెలవు రోజులు పాటిస్తూనే ఉన్నారు, ఒత్తిడి ఎక్కువ అని భావించిన వాళ్లు, పనిదినాల్లో కూడా సెలవులు పెట్టుకుంటూనే ఉన్నారు!

శాఖలలో సిబ్బంది, ఏమి చెయ్యాలో తోచక, నగదు కోసం ఎదురు చూడడం, తెచ్చుకోవడం, 'అందరికీ' ఎంతో కొంత సరిపెట్టడం, ఆ రోజుకి మూసెయ్యడం తప్ప ఇంకేమి చేశారు?

మరి ఉన్నతాధికారులు ఏమి చేస్తున్నారు? శాఖల నియంత్రణాధికారం ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో ఉండే ఉన్నతాధికారులు.....'సమీక్ష ' ల తోనే గడుపుతున్నారు!

ఎవరైనా, శాఖల్లో "నగదు నిల్వల పరిమితి" ని దాటి ఉంచుకుంటున్నారా? నిల్వల్లో పాత 100 అంతకన్నా తక్కువ విలువగల నోట్లు ఎన్ని ఉన్నాయి? అని ఆరా తీశారా? (శాఖల్లో, కొత్తనోట్లు వచ్చినవి వచ్చినట్లు వితరణ మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే, అవి లెఖ్ఖపెట్టవలసిన అవసరం లేకుండా, నెంబర్లు చూసి వితరణ చేసెయ్యవచ్చు! పాతనోట్లు అయితే, లెఖ్ఖపెట్టి ఇవ్వాలి, ఎక్కువ తక్కువలు వస్తే, భరించాలి!)

అసలు, వచ్చిన నగదులో ఏటీఎం లలో పట్టగలిగినన్ని 100 నోట్లు (2000 నోట్లు స్వీకరించని మిషన్లలో) పెట్టండి, అనీ, వారానికి 24000 కు లోబడి, అడిగినంత నగదు వితరణ చేయండి.....అని ఎందుకు ఆదేశించరు?

నా ప్రశ్న ఒకటే.....ఉన్నతాధికారులు, "నగదు లేదు అని బోర్డులు పెట్టెయ్యండి" అని శాఖలకి చెప్పవచ్చా? రేపు, "మేమే ఆ ఆదేశాలు ఇచ్చాము" అని నిజాయితీగా ఒప్పుకునేవాళ్లు ఎంతమంది?

(ఇప్పుడు నిబంధనలు పాటించలేదు అనే ఆరోపణలపై చర్యలని ఎదుర్కుంటున్నవాళ్లు చాలా మంది ఉన్నతాధికారులే!)

ఇంక, 3. ఆర్బీఐ పారదర్శకత పాటించడం లేదు--అన్నది చర్చల్లో పాల్గొంటున్న "నిపుణులు" చెప్తున్నది.

(......మరోసారి)