Tuesday, December 27, 2011

యాత్రానుభవాలూ.........


........క్షేత్రానుభవాలూ

తిరిగే కాలూ, తిట్టే నోరూ ఊరికే వుండవుట.
ఈ మధ్య ఓ పెద్దాయన, అమెరికాలో పిల్లలదగ్గర సెటిల్ అవుదామని వెళ్లినవాడు, తూర్పుకి తిరిగి ఓ దణ్ణం పెట్టేసి, ఇండియా వచ్చేసి, తన పెరట్లో మొక్కలు పెంచుకోడం అనే హాబీ తీర్చుకోడం మొదలెట్టాడు.
ఆయన చెప్పిన కారణం అదే! అమెరికాలో ఆ రెండూ బంద్ అయిపోతే, యెంత సేపు గదిలో బందీగా పడివుండగలం? అని.
అలా, మేముకూడా వూళ్లు తిరగడం కొనసాగిస్తున్నాము. ఇప్పుడు చెన్నైలో!
మహామల్లపురం అనే మామల్లపురం అనబడిన మహాబలిపురం వగైరాలూ, అరవిందుడి సమాధీ, వాటిని వెనక్కి తోసి వృధ్ధి చెందిన గణేశాలయం, బీచీ వగైరాలు చూసి, యేలగిరి వెళ్లి, బోటింగూ వగైరాలు చేసి, మురుగన్ నీ, పెరుమాళ్ నీ చూసి, అక్కడ రాత్రి బసచేసి, ప్రొద్దున స్వామిమలై వెళదామని, అంతదూరం నడిచి కొండ యెక్కలేక వెనుదిరిగి, జలపాతాలు చూసి, కొంచెం తడిసి, చెన్నై తిరుగు ప్రయాణంలో, పనిలోపని అని శ్రీపురంలో ఓ బంగారు గుడి వుందని అది చూసేద్దామని వెళ్లాము.
ఆ గుడి గురించి జనాలు చెప్పుకొంటున్నది వింతగా అనిపించింది. ఒకాయన తన వ్యాపారాల్లో భాగంగా అనేక అక్రమాలు, హత్యలు చేయడం చేయించడంతో సహా చేసి, బాగా డబ్బుచేశాక, ఓ గురువుగారి ఉపదేశం పొంది, సంపాదించిన డబ్బంతా వినియోగించి పూర్తిగా (కొన్ని క్వింటాళ్ల) బంగారంతో ఓ అమ్మవారి గుడి కట్టించాడట. ఇప్పుడది తిరుపతీ, శబరిమల లెవెల్లో, మరికాస్త సంపాదించి పెడుతోందట ఆయనకి! ఆయన్ని "శ్రీ శక్తి అమ్మ" (మగ దేవత) అంటున్నారు!
మామూలుగా, క్యూలైన్ లో వెళితే, దర్శనం 3 గంటలు పడుతుందని బోర్డు పెట్టారు. ఒక్కోప్పుడు ఇంకా చాలా తక్కువ సమయం పట్టిన దాఖలాలున్నాయట.
అదేమిటో, మేము వెళ్లినరోజు మాత్రం, బస్సులకొద్దీ జనం—ముఖ్యంగా ఆడవాళ్లు—యెర్రరంగు చీరలు పసుపురంగు పూలతో వున్నవీ, పసుపురంగు అంచుమీద వేపాకుల మండలు డిజైన్ గా కలవీ ధరించి, మగాళ్లు యెర్ర పంచే/పేంటూ, యెర్ర చొక్కాలూ ధరించీ క్యూలూ, కంపార్ట్ మెంటులూ నిండిపోయారు…..ఇంకా వస్తూనే వున్నారు!
మేము ఓ కంపార్ట్ మెంట్ దాకా ప్రవేశించి అప్పటికే ఓ రెండు గంటలు కాగా, ఇంకో నాలుగైదు గంటలు పట్టచ్చు అంటే, వోపికలు నశించి, సెక్యూరిటీ వాడినడిగి, బయటికి వచ్చేశాము.
బయట రోడ్డు మీదనుంచి మూసేసిన ద్వారంలోంచి కనిపిస్తున్న ఆ బంగారు గుడిని చూసేసి, చక్కావచ్చాము.
ఈ సందర్భంలో, నాకు కొన్ని అవిడియాలు మెరిశాయి. అవి మీతో పంచుకోవాలని……ఇలా.
మొన్న త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి అననే అన్నాడు—తిరుమలకి వెళ్లేవాళ్లు ఓ క్లబ్బుకి వెళ్లినట్టు వెళుతున్నారు. అందుకే అక్కడ భక్తి భావం లోపిస్తోంది—అని.
అసలు కిటుకు అక్కడే వుంది.
ఈ మధ్య, స్వామి అయ్యప్ప పుణ్యమా అని, భక్తి మాటెలా వున్నా, ప్రతీ దేవుడికీ, దేవతకీ, కుల మత ప్రసక్తి లేకుండా, విచక్షణ లేకుండా, “దీక్షలు” పట్టడం, దీక్ష విరమణకి ఫలానా కొండకో, పుణ్యక్షేత్రానికో వెళ్లడం బాగా యెక్కువైపోయింది.
అందుకని, ఇలాంటి దీక్షలు పట్టేవాళ్లకి నామినల్ గా ఓ 100 రూపాయల టిక్కెట్టు పెట్టేస్తే సరి.
వృధ్ధులూ, వికలాంగులూ వగైరాలు, మళ్లీ రాగలమో లేదో, వచ్చినా యెప్పటికి మళ్లీ వస్తామో అనుకుంటూ వస్తారు. కాబట్టి, వారికి “ఫ్రీ” దర్శనాలకి వేరే క్యూ పెట్టాలి.
క్రొత్తగా పెళ్లయినవాళ్లూ, మ్రొక్కులు తీర్చుకోడానికి వచ్చేవాళ్లూ అనేక ఆశలతో వస్తారు కాబట్టి, వాళ్లకి నామినల్ గా ఓ రూ. 200 టిక్కెట్టు పెట్టొచ్చు.
ఇంక, పర్యాటకం కోసం వచ్చి, పనిలో పనిగా దేవుణ్నో, దేవతనో చూసేద్దామనుకొనేవాళ్లకి నామినల్ గా ఓ రూ.500 టిక్కెట్టు పెట్టొచ్చు.
ఆలాగే, దర్శనం ముఖ్యం కాకపోయినా, ఫలానా గుడినీ, ప్రాంతాన్నీ చూసి వచ్చాము అని చెప్పుకోవాలనుకొనే వాళ్లక్కూడా అదే టిక్కెట్టు పెట్టొచ్చు.
ఇంక, రానాలకీ, వీఐపీలకీ, వీవీఐపీలకీ, వాళ్ల హోదాలని బట్టి, ఒక లక్షనుంచి, పది లక్షల వరకూ టిక్కెట్లు పెట్టి, వాళ్ల తైనాతీలకి కూడా ఓ పది నుంచి ఇరవైమందికి ప్రత్యేక దర్శనాలు ప్రవేశపెట్టొచ్చు.
ఇంకా, గర్భగుళ్లో తోచినంతసేపు ధ్యానం చేసుకొంటామనే కాంట్రాక్టర్లూ, లిక్కర్ మహరాజులూ వగైరాలకి ఓ కోటి రూపాయలు నించి పది కోట్లవరకూ టిక్కెట్టు పెట్టొచ్చు.
మొదటి ప్రింటు సమర్పించే సినీ నిర్మాతలకీ, సినిమా హిట్ అవ్వాలనో, హిట్ అయ్యిందనో, దర్శనాలకి వచ్చే సినిమా వాళ్లకి మధ్యేమార్గంగా, ఓ 50 వేలో యెంతో టిక్కెట్టు పెట్టొచ్చు.
ఇలా చేస్తే, యే గుళ్లోనూ, యే క్షేత్రంలోనూ కూడా తొడతొక్కిడి లేకుండా, అందరూ కొన్ని నిమిషాల్లోనే దర్శనాలూ, పూజలూ చేయించేసుకోవచ్చు.
(నేను చెప్పిన రేట్లన్నీ కోటీశ్వర దేవుళ్లూ దేవతల ఆలయాలకి మాత్రమే. చిన్న చిన్న ఆలయాలకి అనుపాతంగా తగ్గించుకోవచ్చు. ఇంకా ఇలాంటి “దర్శనాల” అవిడియాలు యెవరికైనా వస్తే వ్రాయండి).
బుఱ్ఱపెట్టి ఆలోచించేవాళ్లెవరైనా అవి అమలు చేస్తారేమో చూద్దాము.