Wednesday, February 26, 2014

మన ప్రభుత్వం.............


...........ఆర్థిక స్థితీ 

మొన్న (24-02-2014) ఈనాడులో ఎస్ ఎస్ తారాపోర్ (ఈయన ఒక రినౌన్‌డ్ బ్యాంకర్. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉన్నతపదవులు నిర్వహించిన విశ్రాంతుడు. మామూలు 'బ్యాంకింగ్ రంగ నిపుణుడు' కాదు!) వ్రాసిన కొత్త సర్కారుకు "ముందు నుయ్యి - వెనుక గొయ్యి" వ్యాసం చదివితే నేను నా బ్లాగుల్లో వ్రాస్తున్న ఆర్థిక విషయాలు (బ్యాంకులూ, ఇన్‌ఫ్లేషన్‌ వగైరాలు) యెంత నిజాలో మీకూ తెలుస్తుంది. ఈ క్రింది విషయాలు గమనించండి.

".........2013-14 కు సవరించిన అంచనాల ప్రకారం  కేంద్రానికి వివిధ ప్రభుత్వ  రంగ సంస్థల నుంచి లాభాలు, డివిడెండ్ రూపం లో వచ్చిన మొత్తం 2012-13 లో వాస్తవంగా ఇలా అందిన మొత్తం కన్నా 64 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఏమనిపిస్తోంది. ప్రభుత్వం తాను గీసుకున్న లక్ష్మణరేఖ (ద్రవ్య లోటును జీడీపీలో 4.8 శాతం లోపు ఉండేలా చూడడం) దాటాల్సిన అవసరం లేకుండా పోయింది. అర్థ్హం చేసుకుంటే ఇదంతా లెక్కల గిమ్మిక్కు మహత్యమేనని తెలియదూ!"

".........మొన్నటి మధ్యంతర బడ్జెట్లో.........ముఖ్యంగా వాహన పరిశ్రమకు ఊరట లభించింది. అయితే పెద్ద కార్ల విషయం లో గణనీయంగా తగ్గింపు ప్రకటించడం రాజకీయ ఒత్తిళ్లు ఎంతగా పనిచేశాయన్నదానికి అద్దం పడుతోంది..................సామాన్యుడికి మాత్రం ఒరిగేది ఏమీ లేదనే చెప్పుకోవాలి."  

"ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం రూపం లో రూ.11,200 కోట్లు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి...........బ్యాంకుల స్వరూప స్వభావాలు జాతీయకరణ సమయం లో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. గత 45 యేళ్లలో బ్యాంకుల చరిత్ర తిరగేస్తే.....జబ్బుపడ్డ గుర్రాలకు రక్తమార్పిడి చేయడం, స్టెరాయిడ్లు ఎక్కించడం ద్వారా వాటిని పందెం గుర్రాలుగా తీర్చిదిద్దుతున్న ప్రయత్నం కనిపిస్తుంది...........జబ్బు తిరగబెట్టి మళ్లీ మళ్లీ.......మూలధన సాయం అవసరమౌతూ........మళ్లీ చతికిలపడిపోతూ......... చివరకు......నిలదొక్కుకోలేని విధానాల తాలూకు భారాన్ని మోయవలసింది మాత్రం సగటు వ్యక్తేనన్నది తోసిపుచ్చలేని వాస్తవం."    

"............ప్రధాన పారిశ్రామిక దేశాలతోపాటు భారత్ లోనూ ద్రవ్యోల్బణ రేటు పెరుగుతూ వస్తోంది...........రూపాయి విలువ పడిపోవడం అత్యంత సహజం. కానీ, మన రాజకీయవేత్తలు ఊరుకోరుగా...అరచి గగ్గోలు చేస్తారు..........ఆర్ బీ ఐ సరైన లక్ష్యాలనే నిర్దేశించింది.........ఆర్థిక మంత్రి మరింత బలపరచడమో, లేదా కనీసం సమర్ధించడమో చేయాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ.........ప్రభుత్వా వైఖరి.....ఆర్ బీ ఐ..........కఠినతర ద్రవ్య విధానాలని వదలి వేసేటట్లుగా........ఒత్తిడిని పెంచనుంది........ప్రముఖ ఆర్థికవేత్త ఆచార్య పి.ఆర్.బ్రహ్మానందం మాటలలో చెప్పాలంటే 'ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోకపోవడం ప్రాణాలు వదలిన, తీవ్రగాయాలతో మరణానికి దగ్గరగా ఉన్న, క్షతగాత్రులైన వారిని గురించి పట్టించుకోకుండా సమరానికి వెళ్ళడం లాంటిదే'. రానున్న నెలల్లో సామాన్యుడికి మరింత వేదనే మిగలనుంది."

వచ్చే ప్రభుత్వం తప్పులని సవరించి, సామాన్యుడికి న్యాయం చేస్తుందని ఆశిద్దాం.

Sunday, February 23, 2014

మన బ్యాంకులూ........2


.........నిరర్ధక ఆస్తులూ

బ్యాంకు ఉద్యోగుల యూనియాన్లు మొదటినుంచీ ఆ విధానాలని వ్యతిరేకిస్తున్నాయి. కోట్లాది రూపాయలు బకాయి పడ్డవాళ్లని ఒదిలేసి, ప్రభుత్వమే వివిధ పథకాల క్రింద ఇప్పించిన చిన్న చిన్న ఋణాలమీద ప్రతాపం చూపించమనడం, వాళ్ల మీద చర్యలు తీసుకోవడం ఏమిటి అని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. విత్త మంత్రిగారేమో బ్యాంకుల లాభాలన్నీ ఉద్యోగుల జీతాలకే పోవాలా అంటున్నాడు. పెద్ద మొత్తాలలో ప్రభుత్వం వాటా డివిడెండ్ చెల్లించాలని బ్యాంకులని ఒత్తిడి చెయ్యడం, బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లని మసిపూసి మారేడు కాయ చెయ్య్డడం , మళ్లీ వాటి కేపిటల్ కోసం పెద్ద యెత్తున నిధులు విడుదల చేస్తున్నామని చెప్పుకోవడం--ఇదంతా ఓ పెద్ద విష వలయం.

ఫినకిల్ సాఫ్ట్ వేర్ లో లోపాలు ఉన్నాయని యునైటెడ్ బ్యాంకు చేసిన ఆరోపణలని వెనక్కి తీసుకున్నారని చదివాము. బహుశా ఇన్‌ఫోసిస్ వాళ్లు అదేమీ లేదు అని చెప్పారు కాబట్టీ, అన్ని బ్యాంకులూ అదే సాఫ్ట్ వేర్ వాడుతున్నారు కాబట్టీ కావచ్చు. కానీ, ఆ సిస్టమ్ లో నిరర్ధక ఆస్తుల గుర్తింపు కోసం అనేక పరామితులు (పెరామీటర్స్) నిర్దేశించడంతో ఆ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఉదాహరణకి రాబోయే కాలం లో NPA లుగామారే ఆస్కారం వున్న ఖాతాలని చూపించమంటే, ఆ Potential NPA రిపోర్టు (PNPA అంటారు) తయారవడానికే కొన్ని గంటల సమయం పడుతుంది. ప్రింటు పేజీలతరబడి వస్తూనేవుంటుంది. ఆ బ్రాంచి (ఫినకిల్ లో సోల్--Service Outlet) లో ఉన్న అన్ని ఋణ ఖాతాలనీ చూపిస్తుంది. ఆ రిపోర్టు ఆథారంగా యే ఖాతా యెందుకు NPA గా మారుతుందో తెలుసుకొని, తగిన చర్య తీసుకోవడం యే మానవ మాత్రుడికీ సాధ్యం కాదు. కనీస యేఖాతాలో యెంత వసూలు చేస్తే ప్రమాదం తప్పుతుందో కూడా చూపించదు. ఓ ఖాతాలో 10 కోట్లు బాకీ వుంటే, అంతా చూపిస్తుంది. కనీసం యేతేదీ నుంచి అది NPAగా మారుతుందో చూపించదు. ఇంకా ఋణ ఖాతాల వైవిధ్యం ప్రకారం అయినా (టెర్మ్ లోన్లు వేరే, గోల్డ్ లోన్లు వేరే.....ఇలా) చూపిస్తే, చాలా వెసులుబాటుగా వుంటుంది. (ఇప్పుడు ఇవి యేమైనా మార్చారో లేదో నాకు తెలియదు కానీ, మేనేజర్లు తమ కష్టం యేమీ తగ్గక పోగా పెరుగుతోంది అని వాపోతున్నారు).

మళ్లీ కొత్త బ్యాంకులు స్థాపిస్తామంటారు. ముత్తూట్ వగైరాలు కూడా వైట్ లేబెల్ ఏటీఎం లు ప్రారంభిస్తామంటారు. ఓ పక్క యెక్కువ లావాదేవీలు జరగని ఏటీఎం లని మూసేస్తామంటున్నాయి బ్యాంకులు. (వాటికి కూడా పనిచేయు వేళలు అని బోర్డులు తగిలిస్తారనుకొంటా!) ప్రభుత్వమేమో ఆథార్ కోసం మరిన్ని చోట్ల మరిన్ని ఏటీఎం లు తెరవాలి అంటుంది. ఇదంతా ప్రగతి లో భాగమేనేమో!

దానికన్నా బ్యాంకులని డీ నేషనలైజ్ చేస్తే యెలా వుంటుదో ఆలోచించాలి మేధావులు.


Saturday, February 22, 2014

మన బ్యాంకులూ........
.........నిరర్ధక ఆస్తులూ

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరర్ధక ఆస్తులు 3 నెలల్లో ఒకేసారి యెక్కువగా పెరిగినట్టు "చూపించడం" తో ఆ బ్యాంకు సీ ఎం డీ బలి కావాలసి వచ్చింది. 

అసలు ఈ నిరర్ధక ఆస్తుల గుర్తింపే ఓ గందరగోళం. పైగా వాటివల్ల యెవరికీ ఏ ఉపయోగం లేదు--బ్యాంకుల షేర్ హోల్డర్లనీ, రిజర్వ్ బ్యాంకునీ, స్టాక్ మార్కెట్ నీ మోసం చెయ్యడం తప్ప. యెందుకంటే..........

అసలు వాటి గుర్తింపు, తగిన జాగ్రతా చర్యలు తీసుకోవడం, అవి వసూలు కాకపోతే బ్యాంకు లాభ నష్టాల ఖాతాలో తగిన "ప్రావిజన్" లు పెట్టడం విషయం లో ఓ విధానమంటూ మొదలయ్యాక, దాని కోసం ప్రతీ బ్యాంకూ వాళ్లిష్టం వచ్చినట్టు వ్యవహరించడం మొదలెట్టాయి. అప్పట్లో వివిధ స్థాయిల అధికార్లకీ ఈ నిరర్ధ్హక ఆస్తులు యెంత తక్కువగా చూపిస్తే, అంత గొప్ప. దాంతో, నానా కష్టాలూ పడి, సం వత్సరాంతం లో జరిగే "ఆడిట్" కి వచ్చే ఆడిటర్లని మేనేజ్ చేసుకొని, వీలైనన్ని నిరర్ధక ఆస్తులని చాపక్రింద తోసేసేవారు. 

ఓ ఐదారు యేళ్లుగా రిజర్వ్ బ్యాంకు కొద్దిగా కళ్లెర్రజేయడంతో, వీటిని పెంచి చూపించడం మొదలెట్టారు. అదీ దశలవారీగా. కానీ యెన్నాళ్లు దాగుతాయి? 

బ్యాంకులు సంక్షోభం యెదుర్కోకుండా అందించిన అస్త్రం రీ షెడ్యూల్ మెంట్. అంటే, ఋణం ఇచ్చేటప్పుడు యెన్ని వాయిదాలలో తిరిగి చెల్లించాలి, వడ్డీ యెలాకట్టాలి, అపరాధ వడ్డీ యెంత? లాంటి నిబంధనలు విధిస్తారు కదా? అలా చెల్లించలేని ఖాతాలు నిరర్ధక ఆస్తులు అయిపోతాయి. అందుకని, నిబంధనలు మార్పు చేసి, చెల్లించవలసిన వాయిదాలని పెంచడం, మొదటి వాయిదా చెల్లింపుని వీలైనంత దూరం జరపడం, అపరాధ వడ్డీ ముదరా.....ఇలా చేసి, హమ్మయ్య! ఇది నిరర్ధక ఆస్తి కాదు అని నిట్టూర్చడం!

రికార్డుల కోసం ఋణగ్రహీతలకి నోటీసులు ఇచ్చినట్టూ, వారి అంగీకారంతోనే నిబంధనలు మార్చి, ఋణాన్ని రీ షెడ్యూలు చేసినట్టూ పుస్తకాల్లో వ్రాసేస్తారు. ఆక్కడనుంచీ, 10 వేల రూపాయల చిన్న ఋణం నుంచీ కోట్ల రూపాయల ఋణాల వరకూ (వీటిని టెరమ్ లోన్లు అంటారు) రీషెడ్యూల్ చేసేస్తారు. అలా యెన్నాళ్లు? ఆడిటర్లు ఒప్పుకొన్నన్నాళ్లూ! 

ఇంకో నిబంధన యేమిటంటే, ఓ ఋణ గ్రహీత కి అనేక లిమిట్ లు ఉండొచ్చు. (ఓపెన్ లోన్, కీలోన్, టెరమ్ లోన్, బిల్ డిస్కవుంట్ లిమిట్, లెటర్ ఆఫ్ క్రెడిట్, గోల్డ్ లోన్, గ్యారంటీలు--ఇలా) వాటిలో యే ఖాతా నిరర్ధక ఆస్తి గా మారే అవకాశం వున్నా, అప్పుడు ఆ ఆస్తిలో ఈ అన్ని లిమిట్ ఖాతాల లోనూ చెల్లించవలసిన నిలవలనీ కూడా నిరర్ధక ఆస్తులుగానే ప్రకటించాలి. 

దీనికోసం బ్యాంకులు అనుసరించే పాధ్ధ్హతి--బ్యాంకులో యే ఖాతా తెరవాలన్నా, ఖాతాదారు వివరాలతో ఓ కోడ్ ఎలాట్ అవుతుంది కంప్యూటర్లో. అందుకని, వేరే వేరా ఖాతాలకి అవే వివరాలతో వేరే వేరే కోడ్ లు సృష్టించడం. దాంతో, ఫలానా కోడ్ తో వున్న ఖాతాలు చూపించమంటే, ఒక్క ఖాతానే చూపిస్తుంది కంప్యూటర్ మరి! మరి పై నిబంధనని తుంగలో తొక్కినట్టే కదా?

కొన్నేళ్ల క్రితం కొద్దిగా మార్పు వచ్చింది. కొత్తగా వచ్చిన సీ ఎం డీ నిరర్ధక ఆస్తులని యెక్కువగా చూపించి, ఆయన హయాం లో అవి తగ్గిపోయినట్టు చెప్పి, షేర్ వాల్యూ ని పెంచుకున్నారు. ఇంకా తరవాత రిజర్వ్ బ్యాంక్ సంకేతాలతో, స్టేట్ బ్యాంక్ సీ ఎం డీ, నిరర్ధక ఆస్తులని వీలైనంతవరకూ దాపరికం లేకుండా ప్రకటించాలని ఆదేశించడంతో, అవి విపరీతంగా పెరిగాయి. (ఆయన అదృష్టం కొద్దీ బలి అవలేదు). ఇతర బ్యాంకులు కూడా కొంత మారాయి. ఇప్పుడు యునైటెడ్ బ్యాంకు పరిస్థ్హితి చూస్తే, వాళ్లు మారలేదు అని తెలుస్తోంది. ఫలితమే ఆవిడ రాజీనామా!

మిగతా మరోసారి.......