haaram logo

Tuesday, October 16, 2012

శబ్దకాలుష్యం..........



.........ప్రవచనాలూ

"వినదగునెవ్వరు చెప్పిన......" అన్నారు. అది ఇక్కడ సరిపోదుగానీ, ప్రవచనాలు మాత్రం నిజంగా అందరూ వినవలసిందే.......వంటపట్టించుకోవలసిందే. 

నిజంగా ఈ ప్రవచనాలు చెప్పేవాళ్లు "పుంభావ సరస్వతులు". వాళ్లకి నా నమోవాకాలు.

మొదట చెప్పుకోవలసింది "ధారణా రాక్షసుడు" అని బిరుదు పొందిన మాష్టారి గురించి. అలవోకగా పురాణాల్లోంచీ, ఇతిహాసాల్లోంచీ, ప్రసిధ్ధ కవులనుంచీ, అవధానాల నుంచీ సమర్థనలు ఇస్తూ, మధ్యలో చక్కని జోకులూ, కొండొకచో చురకలూ వేస్తూ గంటలతరబడి చెప్పేస్తూ వుంటారు. టీవీ ఛానెళ్లలో కూడా సుమారు గత పదేళ్లుగా తరచూ వినిపిస్తూంటుంది ఈయన గొంతు. చెప్పుకోవలసిందేమిటంటే, స్పుటమైన స్వరంతో, తక్కువ శబ్దంతో విన్నా, స్పష్టంగా అర్థమౌతాయి ఈయన ప్రవచనాలు.

మొన్నీమధ్య అమెరికాలో సభలకి వెళ్లినప్పుడు, ఆయనకి అందరూ ఇచ్చిన పంచెలూ, శాలువాలూ (ఆయన మరిచిపోయారనుకుని) ఓ ప్యాకెట్ తయారుచేసి, పార్థ రామరాజుగారు అనే ఆయన ఎయిర్ పోర్టుకి తెచ్చి ఆయనకి ఇవ్వబోయారట. నిజానికి ఆయన అవన్నీ వదిలెయ్యాలనే వదిలేసి వచ్చారట. (ఈ విషయం బలభద్రపాత్రుని రమణి కౌముదిలో వ్రాశారు.) 

సన్మానాలు పేరుచెప్పి, ఓ బొకే ఇచ్చి, ఓ మాల (కొండొకచో గజమాల) వేసి, ఓ శాలువా కప్పి, ఓ జ్ఞాపిక అందించడం, ఫోటోలూ, వీడియోలూ తీయించుకోడం, పేపర్లలోనూ, టీవీల్లోనూ అవి వచ్చేలా చూసుకోవడం! నిజంగా "సన్మానితుడికి" వాటివల్ల వుపయోగం యేమైనా వుందా? నిజంగా ఆయన్ని వాటితో గౌరవించినట్టేనా? అని యెవరూ ఆలోచించరు. 

మొన్నీమధ్య మావూళ్లో గురు సహస్రావధానిగారికి సన్మానం చేస్తే, ఒకే రోజున 29 శాలువాలు కప్పారు! (ఆయన అవన్నీ యేమిచేసుకొన్నాడో?)

మొన్న "పబ్లిసిటీ ఈశ్వర్" కి "నంది" బహుమతి వస్తే, ఆయనకొచ్చిన జ్ఞాపికలన్ని ఓ గోడలా పేర్చి, ముందు ఆయన్ని కూర్చోపెట్టి, ఫోటో తీసి పేపర్లలో వేశారు. (ఇన్నాళ్లూ ఆయన ఒక్కసారైనా ఆ జ్ఞాపికలన్నీ చూసుకొని, యేది యెప్పుడు వచ్చిందో తలుచుకొని, ఆనందించాడనుకోను.)

సరే......ఇవన్నీ అలా వుంటే, ఇంకో పెద్దాయన సుమారు ఓ మూడునాలుగేళ్లుగా--పురాణేతిహాసాలనుంచి - విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం వరకూ, సాయిబాబా నుంచి - పుంతలో ముసలమ్మ వరకూ--అనర్గళంగా ప్రవచనాలు చెపుతున్నారు. ఉదయం నుంచీ అర్థరాత్రివరకూ యేదో ఓ టీవీ ఛానెల్లో ఈయన ప్రవచనాలు వినిపిస్తూనే వుంటున్నాయి.

అసలే ఆయనది "ఉచ్చైస్వరం". మైకూ స్పీకర్లూ లేకపోయినా చివరకూర్చున్నవాళ్లక్కూడా వినిపిస్తుంది ఆయన గొంతు. కానీ టీవీల్లో, ఆయన అసలే చాలా వేగంగా మాట్లాడడంతో, స్పష్టతలోపించి, కాస్త యెక్కువ సౌండ్ పెడితేగానీ సరిగ్గా అర్థం అవదనుకుంటా. ఉదయం, సాయంత్రం "వాకింగు" కి వెళుతూండేవాళ్లకి వీధులోకి గట్టిగా ప్రతీ ఇంట్లోంచీ ఆయన గొంతు వినిపిస్తూనే వుంటుంది.

పాపం ఆయన యేవిధమైన ప్రతిఫలం పుచ్చుకోరట. తన స్వంత వాహనంలో, స్వంత ఖర్చులతోనే వెళ్లి ప్రవచిస్తారట. 

అంతవరకూ బాగానే వుంది. ఇప్పుడు ఆయన ప్రవచనాలని సీడీల్లో, డీవీడీల్లో రికార్డు చేసి, వీధి గుళ్లలో వుదయం, సాయంత్రం వాయించేస్తున్నారు! మరి దానికి ఆయన అనుమతి యేమైనా వుంటుందని నేననుకోను.

అదృష్టవశాత్తూ, మనకన్నీ "పవిత్రమైన" మాసాలూ, "పవిత్రమైన" రోజులూ వుండడంతో ఆ గుళ్లలో ప్రతీరోజూ రెండు పూటలా ఘంటసాల భగవద్గీతో, ఎం ఎస్ రామారావు సుందరకాండో, పాత ఘంటసాల సినిమా భక్తి పాటలో, తరవాత అన్నమయ్యా, రామదాసూ, రామరాజ్యం సినిమా పాటలో వాయిస్తూ వుండేవారు. ఇప్పుడు లేటెస్ట్ ఈ ప్రవచనాలు.

ఆ చుట్టుప్రక్కల ఇళ్లలో వయో వృధ్ధులూ, బీపీ, హార్ట్ పేషెంట్లూ వుంటే వాళ్ల తాలూకువాళ్లు వెళ్లి కాస్త సౌండ్ తగ్గించమని వేడుకొంటే, వెంటనే తగ్గిస్తారు గుడివారు. కానీ మరో ఐదునిమిషాల్లోనే యెవరో "భక్తుడు" వాళ్లని తిట్టేస్తాడు.......వెంటనే సౌండ్ పెంచేస్తాడు!

మరి ఈ శబ్దకాలుష్యాన్ని అరికట్టేది యెవరో? జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్నీ కాపాడేది యెలాగో? యెవరైనా ఆలోచిస్తున్నారా?

శుభం భూయాత్.