haaram logo

Monday, March 3, 2014

విసుర్లు........


............తగిలేనా?!

మొన్నో రోజు పేపర్లో, ఒకాయన ఆధ్యాత్మిక వ్యాసం వ్రాస్తూ, రామకృష్ణ పరమహంస గా ప్రసిధ్ధి చెందినాయన, కాళికాలయం లో పూజారిగా పనిచేస్తూ, ఓ రోజున ఓ యోగి ఆకాశ మార్గాన ప్రయాణించడం, అయన వెనకే ఓ హంస యెగురుతూ వెళ్లడం చూసి, తాను కూడా అలా యెగిరి వెళ్లిపోతే బాగుంటుందనుకున్నాడట అనీ, తరువాత ఓ రోజు, కాళికామాత పాదాల దగ్గర ఆ హంసని చూసి ఆశ్చర్య పోయాడనీ, అక్కణ్నించి "పరమ హంస" అనే పేరు "తనకి తానే" పెట్టుకున్నాడనీ సెలవిచ్చారు. (నిజానిజాలేమిటో నాకు తెలీదు కానీ, ఆయన ఆధ్యాత్మిక పాండిత్యానికి అందరూ సంతోషించాలి.) 

ఇంతకు ముందు, ఓ సారి, విష్ణుచిత్తుడికి ఓ పాప దొరికితే, "శూడిక్కుడుత్త నాచ్చియర్" అని పేరు పెట్టుకొని పెంచాడని వ్రాసిందీ ఈ మహాను భావుడే. 

పత్రికవాళ్లు వీటిని ప్రచురించడం మాత్రం అత్యంత ముదావహం. 

ముదావహం అంటే గుర్తొచ్చింది..........

మా మునిసిపల్ ఛైర్మన్‌ ఒకాయన వుండేవారు. ఆయన ఉపన్యాసాలలో పదాలని వాడడం లో నిరంకుశుడు. (నిరంకుశాః కవయః అన్నారు).

ఘంటసాల కి సన్మానం చేస్తూ, ఆ సభాధ్యక్షుడిగా ఈయన "ఈయనెవరనుకున్నారు? మన సినిమాల్లో నాగేశ్వర్రావూ, రామారావూ పాటలు బలే పాడేస్తున్నారని మీరనుకుంటారు. కానీ వాళ్లతోపాటు యస్వీ రంగారావుకీ, సావిత్రీ వాళ్లక్కూడా పాటలు పాడేది ఈయనే!" అనెయ్యగానే, తరువాత మాట్లాడినాయన, "నిజమే, మాయాబజార్ లో సావిత్రిక్కూడా పాడారు" అని సమర్థించవలసి వచ్చింది. హాస్యం మాత్రం బాగా పండిందనుకోండి. 

ఆయనే పోలీసుకాల్పుల్లో ఓ వ్యక్తి మరణించినప్పుడు ఆవేశంగా 'తుపాకీ' వారి 'సీ ఆర్ పీ గుళ్లకి' నా ప్రజలు ఇలా బలై పోవడం చాలా 'ముదావహం'.......ఇలాంటి ముదావహాలు ఇకముందు జరిగితే యేమాత్రం సహించడానికి 'సంకోచించం' అంటూ, "పావుగంటలో 16 ముదావహాలు వేశాడు" అన్నాడు మా కృష్ణమాచారి. (ఈ కృష్ణమాచారి కృష్ణం రాజు సినిమా కృష్ణవేణి లో ఓ మంచి పాత్ర వేసి, డ్యాన్‌సుల్లో కూడా పాల్గొన్నాడు). 

అలా వుంటాయి.

మా భాషా, సాహిత్య, చరిత్ర నిపుణుడైన  మిత్రుడికి యే విషయమైనా మూలాల్లోకి వెళ్లి శోధించి, దాని వ్యుత్పత్తి యెలా జరిగిందో కనిపెట్టి, అందరికీ చెప్పడం ఓ సరదా. (ఈ విషయం లో మోడీ కన్నా తనకి కొంచెం యెక్కువే తెలుసు అని చెప్పుకుంటున్నాడీ మధ్య).

ప్రపంచ ప్రఖ్యాత రష్యన్‌ నాయకుడు లెనిన్‌ పూర్తి పేరు, అసలు పేరు, దాని అర్థం యేమిటో తెలుసా అని ప్రశ్నించి, యెవరూ సాహసం చెయ్యకపోవడంతో తనే చెప్పాడిలా--పూర్తి పేరు వ్లాడిమిర్ ఇల్ ఇచ్ లెనిన్‌. అసలు పేరు వ్లాడిమిర్ ఇల్ ఇచ్ ఉల్యనోవ్. అంటే అర్థం--వాళ్ల భాషలో వ్లాడ్ అంటే గోక్కోవడం. వ్లాడి అంటే గోక్కోవలసిన. మిర్ అంటే బాగా. వ్లాడిమిర్ అంటే బాగా గోక్కోవలసిన. ఇల్ అంటే చెడ్డదైన ఇచ్ అంటే దురద. ఉల్యనోవ్  అంటే ఉద్దీపింప చేసేవాడు అని. అంటే పూర్తిగా, బాగా గోక్కోవలసిన చెడ్డ  దురదని ఉద్దీపింప చేసేవాడు. అంటే, బాగా పెంచేవాడు. లేదా విజృంభింప చేసేవాడు అని. 

చూశారా యెంత చక్కటి పాండిత్యమో!