haaram logo

Sunday, November 11, 2012

మనదేశం……



………కంప్యూటర్లూ

“సర్కారీ పెద్దలకి కావలసిన పెద్ద మనిషొకడు వచ్చి, ‘అయ్యా….బ్రతకడానికో దారి చూపండి‘ అంటూ ప్రాధేయపడితే, ‘సరే! ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలని కంప్యూటరీకరిస్తూ బ్రతుకు’ అన్నాడటా సర్కారీ పెద్ద. 2008 నుంచీ ‘అలా బ్రతికేస్తున్నాడు‘ వాడు! ఇప్పుడు కోట్లాది రూపాయల కుంభకోణాలు బయట పడుతున్నాయి. అయినా కంప్యూటరీకరణ యెక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్టుంది.”—ఇదీ ఓ ప్రముఖ వార్త!

అంతకు ముందెప్పుడో చంద్రబాబు చేసిన తప్పేమిటయ్యా అంటే, విజన్ 2020 పేరుతో, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కంప్యూటరైజ్ చెయ్యాలనుకోవడం. (అప్పట్లో ఆయన అందజేసిన కంప్యూటర్లని ‘కర్మచారులు‘ గొడ్డళ్లతో నరికేశారు—పని చెయ్యాల్సొస్తుందనీ, చేస్తే తమ గుట్లు బయటపడతాయనీ!) అదే ‘అయాచిత వరం‘ అయ్యింది తరవాతవాళ్లకి.

రెవెన్యూ ఆఫీసుల మధ్య అనుసంధానం, రిజిస్ట్రేషన్ ఆఫీసుల అనుసంధానం, వాటికీ వీటికీ అనుసంధానం, వీటన్నింటినీ హైదరాబాదుతో అనుసంధానం, మళ్లీ అన్నీ ‘మీ సేవ‘ కేంద్రాలతో అనుసంధానం……ఇలా నిరంతరం కొనసాగుతూ వస్తోంది. (యెవరికీ ఒక్క పైసా ప్రయోజనం లేదింతవరకూ. పైగా అనేక కష్టాల పాలవుతున్నారు సామాన్య ప్రజలు. దానికి తోడు వరదలూ గట్రా వచ్చి, కార్యాలయాలు నీట మునిగితే, మళ్లీ కంప్యూటరు వాళ్ల పంట పండినట్లే!)

ఇక, కేంద్రంలో అయితే—ఆథార్ కోసం, జనాభా రిజిస్టర్ కోసం, ప్రభుత్వ పథకాల కోసం, ‘పైలట్ ప్రాజెక్టుల‘ కోసం, వాటి అనుసంధానం కోసం—ఇలా కొనసాగుతూనే వున్నాయి. 

ఇప్పుడు తాజాగా ‘నగదు బదిలీలు!’.

నేనిదివరకే వ్రాశాను—కంప్యూటర్లు మనదేశానికి వచ్చినప్పటినుంచీ మనదేశం లో వాటిపేరుతో యెంత ఖర్చుపెట్టారో, దానిలో యెంత వృధా అయ్యిందో దర్యాప్తు చేస్తే, అది మన జనాలు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్ల ధనం కన్నా, మన కరెంటు ఖాతా లోటు కన్నా, మన ప్రభుత్వాలు ‘ఆమ్ అద్మీ’ కి ఇస్తున్న సబ్సిడీలకన్నా—కొన్నిరెట్లు వుంటుందని.

అసలు వీళ్లని సబ్సిడీలెవరు ఇవ్వమన్నారు?

దేశంలో మొదటిసారిగా 1962 లో చైనా యుధ్ధం మొదలైనప్పుడు ‘రేషన్ విధానం‘ పుట్టుకొచ్చింది—సైన్యావసరాలకి పోను మిగతా ఆహార పదార్థాలూ, కిరొసిన్ వంటి వాటిని ప్రజలకి కొద్ది నియంత్రణతో మాత్రమే అందించాలనే వుద్దేశ్యంతో. (ఆ కాలంలోనే వ్యాపారులు అక్రమ నిల్వలు చెయ్యడం, బ్లాక్ మార్కెట్ అనే వ్యవస్థా పుట్టాయి. నెహ్రూగారు ‘బ్లాక్ మర్కెట్ చేసేవాళ్లని దగ్గరలోని దీపస్థంభానికి వురితీయాలి‘ అని అక్రోశించిందప్పుడే).

తరవాత 1965 పాకిస్థాన్ యుధ్ధం సమయంలో మళ్లీ రేషన్ విధించాల్సిన అవసరం వచ్చింది. ఇదేకాకుండా, లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రజలందరూ ‘వారానికి ఒక పూట భోజనం మానేసి, దానికయ్యే ఖర్చు దేశ రక్షణ నిధికి ఇవ్వండి‘ అని విజ్ఞప్తి చేశారు! (అప్పటికే దేవుళ్లపేరుతో—ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి శనివారాలు ఒంటిపూట భోజనాలు చేస్తున్నవాళ్లు కూడా ఇంకో పూట దేశంకోసం మానేశారు!)

మరి ఈ పచ్చ కార్డులూ, గులాబీ కార్డులూ, తెల్ల కార్డులూ, పసుపు కార్డులూ, గొడవా యెప్పుడు మొదలయ్యింది?

…….(మరోసారి)