Friday, October 7, 2011

నాయకులూ.............పేదరికం

"గాంధీ" అనే మాట చెవిని పడగానే, "ఓ! ఆ అర్థనగ్న ఫకీరోడా!" అంటూ, తన చుట్టకాల్చిన శ్లేష్మంసహిత దగ్గుతో...."హె హె హ్హె!" అన్నాడట ఓ మ్లేఛ్ఛుడు. (మ్లేఛ్ఛుడు అంటే అర్థం యేమిటో......బ్రౌణ్యం నో, పాణినీయం నో, సూర్యారాయాంధ్రం నో శరణుకోరండి) 

"వాణ్ణి ఫకీరుగా వుంచడానికి రోజుకి ఓ 30 రూపాయలుపైగా ఖర్చు అవుతున్నాయి మాకు" అని వాపోయిందొకావిడ..... ఆవిడే--నైటింగేల్ ఆఫ్ ఇండియా--సరోజినీనాయుడు! 

(సరోజిని మాతృభాష తెలుగు. ఆవిడ ఆంగ్లంలో కవితలు కూడా వ్రాసింది. ఆంగ్లంలో 'హీ, షీ, ఇట్, దే' లకి తెలుగులో అతడు లేక వాడు, ఆమె లేక అది, అది, వారు అనే అనువదించింది. కొంతమంది అన్నోన్ వెధవలు--అన్నోన్లందరూ వెధవలు కారు, వెధవలందరూ అన్నోన్లు కారు--ఈ సూక్ష్మాలు తెలుసుకుంటే యెంతబాగుండునో!)   

యెందుకంటే, ఆయనకి యెక్కడో దూ....రం నుంచి, మేకపాలూ, బాదం పప్పులూ, వేరుశెనగపప్పులూ వగైరాలూ, కిరసనాయిలూ (ఆయన రాత్రిపూట దోమలు తనని కుట్టకుండా వొళ్లంతా కిరసనాయిలు పూసుకొనేవాడట!) తేవలసి వస్తూంది! అందట ఆవిడ. 

(ఆ యుధ్ధం రోజుల్లో, మొట్టమొదట రేషన్ విధించింది 'కిరసనాయిలుకే'నట. తరవాతే తిండిగింజలూ వగైరాలు!) 

ఆ రోజుల్లో (ఓ 70 యేళ్ల క్రితం) మహాత్ముడికి రోజుకి 30 రూపాయల ఖర్చంటే, ఈరోజుల్లో ఓ మూడువేలన్నమాట. మరి మన ప్రణాళికా సంఘంవాళ్లు ఈరోజుల్లో "తలా" ఒకరికీ 32 రూపాయిలో యెంతో అంటే, అప్పటికి దారిద్ర్యరేఖ క్రిందనున్న మహాత్ముడి తో సమానంగా మీరు వున్నారు అని చెప్పడమే కదా? 

మరి చెట్టుపేరుచెప్పుకొని కాయలమ్ముకుంటున్న కాంగీలు యేమి సాధించినట్టు? 

సరే! "ఆవిడకి 6 కోట్ల కారా?" అని యెద్దేవా చేశాడట--రాష్ట్రపతినుద్దేశించి--ఫిరోజ్ వరుణ్ గాంధీ. (వాడికీ జడ్ కేటగరీ భద్రతా అవీ వున్నాయనుకుంటా! తనకి ఓ 60 లక్షలో యెంతో పెట్టి, ఓ బులెట్ ప్రూఫ్ కారు కొనివ్వలేదని వాడి బాధేమో!)

వందకోట్లో ఇంకా యెక్కువో వున్న భారతీయులందరికీ రాజ్యాంగబధ్ధ నాయకురాలు కి ఆ మాత్రం భద్రత అవసరం లేదా?

అమెరికా ప్రెసిడెంట్ భద్రతకి కొన్ని బిలియన్ డాలర్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. "ఎయిర్ ఫోర్స్-1" మెయింటెనెన్స్ కీ, సిబ్బందికీ, దాని ప్రత్యేక రక్షకదళానికీ, 24 గంటలూ దాన్ని సంసిధ్ధంగా వుంచడానికీ, ఒకవేళ దాన్ని వాడడంలో యేదైనా ఇబ్బంది యెదురైతే వాడడానికి మళ్లీ ఇంకో "ఎయిర్ ఫోర్స్-1" ని "స్టాండ్ బై" గా అదే సంసిధ్ధతతో వుంచడానికీ--అన్ని బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు అని తెలుసా?

మనకంత సీనులేకపోవచ్చుగానీ, మరీ కారుకూడా వద్దంటే యెలాగ?

నా బ్లాగు లోకం


సింహావలోకనం

ఇదే శీర్షికతో నా "ఓ ప్రపంచపౌరుడు" బ్లాగ్ ప్రారంభించాను కొన్నేళ్ల క్రితం.

తరవాత మరికొన్ని బ్లాగులు నిర్వహిస్తూ, ఈనాటికి, నాకూ బ్లాగ్ లోకంలో ఓ "సముచిత" స్థానం వుంది అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను.

ఈ సందర్భంలో, చాలామంది మెచ్చినవీ, చాలామందికి నచ్చనివీ అనే ఓ "లిట్మస్" టెస్టులో నిలబడిన కొన్ని బ్లాగులని మత్రమే వుంచి, మిగిలినవాటిని "విత్ డ్రా" చేస్తున్నాను.

(యేమో! మళ్లీ యెప్పుడో నా బ్లాగుసోదరులకి ఇష్టం అయితే, వాటిని పునరుధ్ధరించవచ్చేమో!)

ఆ ప్రక్రియలో భాగంగా, నా "కృష్ణశ్రీ" బ్లాగుని, "కృష్ణశ్రీ స్వగతాలు" అని మారుస్తున్నాను. (నా జ్ఞాపకాలూ, హనీమూన్ లూ వగైరాలు దాంట్లో వుంటాయి.)

ఇంకో "కృష్ణశ్రీ" బ్లాగుని నా "ఫ్లాగ్ షిప్" గా ప్రారంభిస్తున్నాను. అదే ఈ "కృష్ణశ్రీ"--విసుర్లు.

దీంతో కొంత సంఘసేవ, సమాజ పరివర్తనం, ఇంకేవేవో చెయ్యాలని ఆశ!

ఆశీర్వదించండి!