haaram logo

Monday, September 28, 2015

శ్రవణ హింస-5


"భ్రష్ట భయంకర" సంగీతం-5

.......ఇంక ముగింపు.....

సామాన్యులకి ఈ హింస నుంచి విముక్తి యెలా?

1. అవేవో "అల్ట్రా సౌండ్" పరికరాలంటారు.....సినిమా పాటలని (ఆ మాటకొస్తే, యే సంగీతం, పాటలూ, ఉపన్యసాలూ, చివరికి యెలక్షన్ సమయం లో ప్రచారాలూ కూడా) అలా రికార్డు చేసి, అవి వినాలనుకునే వాళ్లకి ప్రత్యేక ఇయర్ ఫోన్ల ద్వారా మాత్రమే వినేలా యేర్పాటు చెయ్యాలి.

......ఇది జరిగే పని కాదు.

2. సినీ పాటల రచయితలు.....ముఖ్యంగా అనంత శ్రీరాం లాంటి యువకులైన  వాళ్లు.....ఇంగ్లీషు పదాలని పాటల్లో, పల్లవుల్లో చొప్పించడం మానెయ్యాలి. ర్యాప్ అవసరమనుకొంటే, అదీ తెలుగు లోనే వ్రాయాలి. చాలా మంది, యేదేదో అర్థం లేని మాటలు వరుసలకోసం వ్రాసేసి, ఇంత బాగా వ్రాశాం, అంత బాగా వ్రాశాం, అంటూ డబ్బా కొట్టుకొంటారు. అలాంటివి మానెయ్యాలి.

......ఇదీ సాధ్యం కాదు. "జనాలు అడిగే విధంగానే వ్రాస్తున్నాం"....అంటారు!

3. సంగీత దర్శకులు.....ఆ వూళలనీ, డప్పులనీ అంతంత యెక్కువ శబ్దంతో రికార్డు చేయడం మానెయ్యాలి. ఆ కేకలు మానెయ్యాలి.

......ఇదీ పై సూచన లాగే..... "జనాలు అడిగే....." అనే అంటారు!

4. ఇంక ప్రభుత్వాలు......వీటి చేతుల్లో అంతా వుంటుంది కానీ, యేమీ లేదు అన్నట్టే వుంటాయి.

యే పండుగ అయినా, ఇంకో ఫంక్షన్ అయినా, స్పీకర్లకి అనుమతులు ఇవ్వకూడదు. ఆ ఆవరణలో వున్నవాళ్లకు వినపడడానికి మాత్రమే సరిపోయే అంత సౌండ్ పెట్టుకోడానికే అనుమతులు ఇవ్వాలి. అదికూడా, నిర్ణీత సమయాలకే పరిమితం చేయాలి. 

ఇలాంటి వాటికి ప్రభుత్వం భద్రత పేరుతో ప్రజల ధనాన్ని ఇలా దుబారా చెయ్యడం మానెయ్యాలి.

అనుమతుల షరతులని ఉల్లంఘించేవాళ్లని నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి.

అందుకని, మనం చెయ్యవలసిందేమిటీ?

వచ్చే యే యెలక్షన్ లోనైనా, నిలబడే వాళ్లని, ఇలాంటి హామీ ఇవ్వాలి అనీ, వాటిని అమలు చెయ్యాలి అనీ, నిలదీసి, అలాంటివాళ్లకే వోట్లు వెయ్యాలి.

ఈ విషయాల్లో, యే మతానికీ, యే కులానికీ, యే వర్గానికీ మినహాయింపు వుండకూడదు!
అలా వాగ్దానం చేసేవాళ్లని, అన్ని మతాల, కులాల, వర్గాల వాళ్లూ అంగీకరించి, వాళ్లకే ఓట్లూ వేసేలాగ కృషి చేస్తాము అని హామీ ఇవ్వాలి మనం!

అలాగే, మీడియా పాత్ర చాలా ముఖ్యం.....పోటీలు పడి పేపర్లలోనూ, టీవీల్లోనూ, ఇలాంటివాటిని ప్రచురించడం మానెయ్యాలి. కనీసం వార్తల ఛానెళ్లలోనైనా, "వార్తలకి మాత్రమే" పరిమితమైతే అందరికీ మంచిది!
 అదీ పరిష్కారం.....ఇలాంటి జాడ్యాలన్నింటికీ!

(ఇప్పటికి ఇంతే)

Sunday, September 27, 2015

శ్రవణ హింస-4


"భ్రష్ట భయంకర" సంగీతం-4

ఇవాళతో, హైదరాబాదులో (ఇంకా అవుతున్నాయి) నూ, దేశం లో ఇతర చోట్లా నిమజ్జనాలు ముగిశాయి. 
సంతోషం. 

మిత్రులు శివ గారు, శబ్దకాలుష్యం విషయం లో, బాగా వినపడ్డానికి చెవిటి మిషన్లు వున్నట్టే, అసలు వినపడకుండా చేసే మిషన్లు కనిపెడితే బాగుండును అనే అర్థం వచ్చేలా అన్నారు. నిజమే!

దీపావళికి, బాంబు శబ్దాలవల్ల భయపడక్కుండా, బాధపడకుండా, చిన్న పిల్లలకీ, వృధ్ధులకీ, చెవుల్లో దూది పెట్టుకుంటారు. విమానాల్లో ప్రయాణించేవాళ్లకి, చెవుల్లో ఆగకుండా వినిపించే ఝంకారం లాంటి శబ్దాన్ని నిరోధించడానికి ఇయర్ ప్లగ్స్ అమ్ముతారు. అలాంటివి పెట్టుకున్నా, ఈ శబ్దాలు వినపడడం మానడం లేదు. నిజంగా యెవరైనా ఇలాంటి పరిశోధన చేస్తే బాగుండును!

శివగారే, "యే శాస్త్రం లో....." అన్నదానికి, "రౌడీ శాస్త్రం" లోంచి....అన్నారు. మరి అలా వ్యవహరిస్తున్న, నిర్దేశిస్తున్న వాళ్లని యేమనాలి?

ఇంకో మిత్రులు విన్నకోట వారు, "కోస్తా కి కూడా ఈ జాడ్యం వ్యాపించిందా?" అని ఆశ్చర్య పడి, ప్రస్తుత లడ్డూలూ, వేలాలూ గురించీ, వాటి ఖర్చు గురించీ.....నేనిదివరకు వ్రాసిన "జాతీయ దుబారా...." తో యేకీభవించారు.

మన సినిమా సంగీతం గురించి మాత్రం యెవరూ యేమీ అనలేదు......బహుశా, అనడానికేమీ లేదు అని అందరి అభిప్రాయమేమో!

నా వ్యాసాలలో భావాలతో యేకీభవించిన ఇతర మిత్రులందరికీ ధన్యవాదాలు.

ఇంక ముగింపు.....

(......మరోసారి)

Thursday, September 24, 2015

శ్రవణ హింస-3

"భ్రష్ట భయంకర" సంగీతం-3

ఈ చవితి పందిళ్లకి అనుమతులు ఇచ్చేవాళ్లూ, తీసుకునే వాళ్లూ ఒకలాగే వున్నారు. 

స్కూళ్లకి సెలవలు ఇచ్చిన రోజుల్లో పగలూ రాత్రీ కూడా ఈ గోల తప్పలేదు. స్కూళ్లు తెరిచాక కూడా, మా వీధి పందిట్లో అంత సౌండ్ తోనూ పాటలు వేస్తూంటే, ఓ పోలీసాయన వచ్చాడు. వాళ్లు పాటలు ఆపేసి, "పూజలు ప్రారంభం అవబోతున్నాయి" అంటూ అనౌన్స్ చేశారు! ఆ పోలీసు, పెర్మిషన్ చెక్ చేసినట్టున్నాడు....."పూజలకి  మైక్ వాడొచ్చు" అని వుందేమో.....వెళ్లిపోయాడు. 

మరి మంత్రాలు అంత గట్టిగా వినిపించినా, స్కూళ్లకి యేమీ ఫరవాలేదు అని వాళ్ల భావమేమో! ఇంకా విచిత్రమేమిటంటే, పూజ అయిపోయాక మళ్లీ వెకిలిపాటల ప్రారంభం! స్కూళ్ల దారి స్కూళ్లదే.....!

ఇదివరకు ఇళ్లలో పూజ చేసుకునేవాళ్లు, ఆ సాయంత్రమే ఉద్వాసన చెప్పేసేవారు. పందిళ్లలో, నవరాత్రులూ అయ్యాక చేశేవారు. నిమజ్జనాలు లేవు. 

ఇప్పుడు యే శాస్త్రం లోంచి పట్టుకొచ్చారోగానీ, 11 రోజులు వుంచి, ఆ తరువాత నిమజ్జనం ట!

మా వీధి వాళ్లకి చందాలు తగ్గాయో, కాళ్లు చల్లబడ్డాయో గానీ, నాలుగో రోజునే నిమజ్జనం చేసేశారు. 

దాంతో బయటపడ్డాం......ఈ శ్రవణ హింస నుంచి!

జై జై వినాయక!
 
(.....మరో సారి)  

Wednesday, September 23, 2015

శ్రవణ హింస

"భ్రష్ట భయంకర" సంగీతం-2

ఇప్పుడు ఆడవాళ్లూ మగవాళ్లూ కూడా, పాడడమే "గొంతుచించుకొని" మరీ పాడుతున్నారు. దానికి తగ్గట్టు, వెనకాలే "కొట్టు", "దంచు", "వెయ్యి", లాంటి కేకలతో విపరీతంగా మాదిగ డప్పుల దరువులూ! వాటితో, పెద్ద పెద్ద నల్ల పెట్టెల ద్వారా పూర్తి సౌండ్ తో వినిపిస్తూంటే, ఓ వంద గజాల పరిధిలో రోడ్లు అదిరిపోవడమే కాడు, ఇళ్లల్లో వున్నవాళ్ల గుండెలు అదిరి పోతున్నాయి.

ఇంక పాటలో దీర్ఘాలు వచ్చినప్పుడు....ఉదాహరణకి "పా....ప" అంటూంటే, మధ్యలో అదిఒక "వూళ" లా మారిపోయేలా రికార్డు అవుతోంది! మొదట్లో మగగొంతులకే ఇలా చేస్తే, తరువాత తరువాత ఆడ గొంతులకీ ఈ వెర్రి పాకింది!

ఇంక ఆడ గాయనుల పాటలైతే, "బాలూ" అన్నట్టు....విపరీతంగా నోరు తెరిచీ, మూసీ...."యెవ....డే"....అంటూ పాడుతున్నారు.

ఈ వెర్రితలలు ఇలా వుంటే, నేను ఈ మధ్య ఓ పాట విన్నాను....పల్లవి వింటూ....ఇదేదో బాగున్నట్టుందే....అనుకున్నంత సేపు పట్టలేదు....ర్యాప్ లో దిగిపోయింది! యెంతో ప్రశాంతతకీ, దేశభక్తికీ ప్రతీకలైన "శాంతినికేతన్", "సబర్మతీ" లాంటి మాటలని కూడా.....పాట వినే వాళ్లని అసలు ప్రశాంతతకే దూరం చేసేలా పాడడమే కాదు.....సరళీ స్వరాలైన "సరిగమ" ల తో......వికృతంగా, భయంకరంగా యెలా కేకలు కూడా వెయ్యొచ్చో....నిరూపించారు. 

ఆ పాట సృష్టించిన వాళ్లందరికీ.....నుదుటితో పాదాభివందనాలు చేస్తూ విఙ్ఞప్తి చేస్తున్నాను......ఇలాంటి వాటితో సంగీతాన్ని ఖూనీ చేయొద్దు....అని!
 
(.....మరో సారి)  

Tuesday, September 22, 2015

శ్రవణ హింస

"భ్రష్ట భయంకర" సంగీతం-1

ఓ యాభై యేళ్ల క్రితం, పాటల కోసం "కూడా" సినిమాలు చూసేవారు. 

తరువాత పదేళ్లకి పాట రాగానే, బయటికి వెళ్లి సిగరెట్లు కాల్చుకు వచ్చేవారు. తరువాత స్టెప్పుల డాన్సుల పాటలు వచ్చాయి. నాగేశ్వర రావు వేస్తున్న స్టెప్పులు జనానికి నచ్చుతున్నాయని, ఇతరుల చేత కూడా అలాంటి స్టెప్పులు వేయించడానికి ప్రయత్నించి, భలే హాస్యం పుట్టించేవారు. (కళా తపస్వి కూడా, "స్టెప్పుల" కి తనవంతు దోహదం చేశాడు--విమర్శ ముసుగులో).

ఆ తరువాత, అనేక మంది కొత్త సంగీత దర్శకులు వచ్చి, "కొన్నైనా" చక్కటి మెలోడీ పాటలు ఇచ్చారు. 

ఇంక తరువాత వస్తున్నది పైన శీర్షిక లో పేర్కొన్న లాంటి సంగీతమే!

మా యింట్లో, రేడియోల, టేప్ రికార్డర్ల కాలంలో యెంచుకున్న సంగీతం ఇష్టంగా వినేవాళ్లం. తరువాత వీసీపీ లు వచ్చాక, పాట రాగానే ఫాస్ట్ ఫార్వార్డ్ నొక్కేసేవాళ్లం. టీవీలు వచ్చాక, వెంటనే ఛానల్ మార్చేయడం, అక్కడా పాటలు వస్తూంటే, మ్యూట్ చేసెయ్యడం! ఇలాంటి ట్రిక్కుల ద్వారా, యేడాది పాటు సంగీతం బారి నుంచి తప్పించుకుంటున్నాం. కానీ......ఈ 

వినాయక చవితి రోజుల్లో మాత్రం, భయంకరంగా హింస అనుభవిస్తున్నాం.....ఆ పాటలు వినక తప్పక.....!

దీనికి పరిష్కారం యేమిటో మరి?!

(.....మరో సారి)