Monday, December 26, 2016

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......5

ఆర్బీఐ పారదర్శకత.....

(మొన్నటి టపా తరువాయి)

మొన్న ఓ పెద్దాయన--అదే....నిపుణుడు, టీవీలో, "బ్యాంకులవాళ్లని ఏటీఎం లలో ఎందుకు నగదు ఉంచటం లేదు? అని అడిగితే, ఏటీఎం లలో పెడితే, అన్ని బ్యాంకుల ఖాతదారులూ తీసుకుంటారు, మా శాఖ అయితే, మా ఖాతాదారులకే ఇవ్వచ్చు. మాకు ఆ బాధ్యత ఉంటుంది కదా? అన్నారు" అని చెప్పాడు. మరి అలాంటి ఆదేశాలు ఎవరు ఇచ్చారు? అని ఆయన అడగాలేదు, వాళ్లు చెప్పాలేదు....అని ఓ దురభిప్రాయం కలగాలి చూసేవాళ్లకి!

ఇప్పుడు కావలసింది, వీలైనంత ఎక్కువ నగదు చెలామణీ లోకి రావాలి. పరిమిత మొత్తాల్లో, ఎక్కువమంది ద్వారా నగదు చెలామణీ లోకి రావాలి అంటే, ఏటీఎం ల వల్లే సాధ్యం.....అనే చిన్న నిజాన్ని ఎందుకు మరిచిపోతున్నారు? అలా ఎందుకు ఒప్పుకోరు?

20-12-2016 నాటికి పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఉన్నతాధికారుల్లో ఎవరికి ఙ్ఞానోదయమయ్యిందో గానీ, ఆంధ్రా బ్యాంకు లో వారానికి 24,000 చొప్పున, అంతకు లోబడి, అడిగినవారికి అడిగినంత వితరణ చేశారు! ఏటీఎం లో కూడా నగదు వుంచారు.....2 గంటల్లో ఖాళీ అయ్యింది. 

పూర్వం నేను పనిచేసిన శాఖలో ఆ రోజు, ఒక 60 మంది రూ.24,000/-; దాదాపు 200 మంది అంతకు లోపు నగదు తీసుకోగలిగారు! 

స్టేట్ బ్యాంకులో ఆ రోజుకూడా నగదు లేకపోయినా, ఊళ్లో నగదుకొరత లేకుండా పూర్తిగా చెలామణీ జరిగింది!

21 వ తేదీ నుంచి, దాదాపు మా ఊళ్లో అన్ని బ్యాంకుల్లోనూ, అధిక శాతం ఏటీఎం లలోనూ నగదు వితరణ బాగానే జరుగుతోంది!

"50 రోజులు" కన్నా ముందే, ఎవరు ఎంత అరిచిగీపెట్టినా, నగదు కష్టాలు తీరిపోతున్నట్టే! 

ఇంక, ఆర్బీఐ పారదర్శకత.....సంగతి.....!

ఆర్బీఐ గత 90 యేళ్లనుంచీ చేస్తున్న పనే--నగదు ముద్రణా, పంపిణీ--ఇప్పుడూ చేస్తోంది! ఆ విషయం మన సోకాల్డ్ నిపుణులు వారికి నేర్పఖ్ఖర్లేదు.....సలహాలు ఇవ్వ వలసిన అవసరం లేదు. 

ఆర్బీఐ కి ఈ విషయం లో "పారదర్శకత" (అంటే, మీడియావాళ్లకి ప్రతిరోజూ బులెటిన్లు విడుదల చేయడం) పాటించవలసిన అవసరం లేదు!

స్థూలంగా, గత వారాల్లోనూ, నెలల్లోనూ ఏ బ్యాంకు నుంచి ఎంత నగదు చెలామణిలోకి వచ్చింది, ప్రస్తుతం ఎంత అవసరం వుంటుంది అనే లెఖ్ఖల మీద ఆథారపడి, బ్యాంకులకి నగదు పంపిణీ జరుగుతుంది. (ముఖ్యంగా....యే రాష్ట్రానికి ఎంత? అనే ప్రశ్నే రాదు! ఆ బాధ్యత ఆ బ్యాంకు యాజమాన్యాలదే! యూపీ ఎలక్షన్లొస్తున్నాయి కాబట్టి, అక్కడ ఎక్కువ నగదు పంపిణీ చేస్తున్నారు.....లాంటి ఆరోపణలు పూర్తిగా హాస్యాస్పదం!)

ఇప్పుడు, ఇదివరకు కన్నా చాలా వేగంగా ఆర్బీఐ నుంచి బ్యాంకులకి నగదు వితరణ జరుగుతూంది. కొన్ని నిబంధనలు కూడా సడలించి మరీ చేస్తున్నారు. 

(వివరంగా వ్రాయమంటే ఇంకోసారి వ్రాస్తాను.)

ఇలాంటి పరిస్థితుల్లో, ఆర్బీఐ మీద ఆరోపణలు చేస్తున్నవాళ్లు......మూర్ఖులు!

4) సరైన ప్రత్యామ్నాయాలు చూపించకుండా......!

(......మరోసారి)

Sunday, December 18, 2016

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......4

నగదు వితరణ సమస్య.....

(మొన్నటి టపా తరువాయి)

రాష్ట్ర ప్రభుత్వం వారు, 9000 కోట్లు వస్తున్నాయి అనీ, అందులో సింహభాగం 500 నోట్లూ, చిన్న నోట్లే అనీ, క్రితం శనివారం (10-12-2016) నాటికి అన్ని బ్యాంకులకీ చేరుతాయి అనీ ప్రకటించారు. పించన్లు బ్యాంకులలో జమచేయడం పొరపాటే అనీ, బ్యాంకుల్లో జమ కాని వారికి, పాత పధ్ధతిలో, ఇంటి వద్దే చెల్లిస్తాము అని కూడా ప్రకటించారు.

ఆర్బీఐ వారు, ప్రతిరోజూ ఉదయం 9-00 కల్లా బ్యాంకుల శాఖలలో నగదు అందజేయవలసిందే--అని నగదు భాండాగారాలు నిర్వహిస్తున్న బ్యాంకులని ఆదేశించారు!

అయినా, ఈ టపా వ్రాస్తున్న రోజు--19-12-2016 వరకూ--పరిస్థితి లో మార్పు లేదు! మొన్న శనివారం అయితే, మా వూళ్లో అన్ని బ్యాంకులలోనూ, నగదు వితరణ అసలు జరగలేదు.....నగదు లేదు అనే బోర్డులనే ప్రదర్శించారు.....అంటున్నారు!

మరి......బాధ్యులు ఎవరు?

బ్యాంకుల సిబ్బంది, సెలవులు వాడుకోకుండా, రోజూ దాదాపు 10 గంటలకి పైగా పనిచేస్తున్నారు......! అని చెప్పడం--అతిశయోక్తి మాత్రమే. 

సెలవు రోజులు నవంబర్ 12, 13 న మాత్రమే పనిచేశారు. తరువాత ఆర్బీఐ గానీ, ప్రభుత్వం గానీ, సెలవుల్లో పనిచేయమని చెప్పలేదు.....నగదు సరఫరా పరిస్థితుల వల్ల. సిబ్బంది, సెలవు రోజులు పాటిస్తూనే ఉన్నారు, ఒత్తిడి ఎక్కువ అని భావించిన వాళ్లు, పనిదినాల్లో కూడా సెలవులు పెట్టుకుంటూనే ఉన్నారు!

శాఖలలో సిబ్బంది, ఏమి చెయ్యాలో తోచక, నగదు కోసం ఎదురు చూడడం, తెచ్చుకోవడం, 'అందరికీ' ఎంతో కొంత సరిపెట్టడం, ఆ రోజుకి మూసెయ్యడం తప్ప ఇంకేమి చేశారు?

మరి ఉన్నతాధికారులు ఏమి చేస్తున్నారు? శాఖల నియంత్రణాధికారం ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో ఉండే ఉన్నతాధికారులు.....'సమీక్ష ' ల తోనే గడుపుతున్నారు!

ఎవరైనా, శాఖల్లో "నగదు నిల్వల పరిమితి" ని దాటి ఉంచుకుంటున్నారా? నిల్వల్లో పాత 100 అంతకన్నా తక్కువ విలువగల నోట్లు ఎన్ని ఉన్నాయి? అని ఆరా తీశారా? (శాఖల్లో, కొత్తనోట్లు వచ్చినవి వచ్చినట్లు వితరణ మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే, అవి లెఖ్ఖపెట్టవలసిన అవసరం లేకుండా, నెంబర్లు చూసి వితరణ చేసెయ్యవచ్చు! పాతనోట్లు అయితే, లెఖ్ఖపెట్టి ఇవ్వాలి, ఎక్కువ తక్కువలు వస్తే, భరించాలి!)

అసలు, వచ్చిన నగదులో ఏటీఎం లలో పట్టగలిగినన్ని 100 నోట్లు (2000 నోట్లు స్వీకరించని మిషన్లలో) పెట్టండి, అనీ, వారానికి 24000 కు లోబడి, అడిగినంత నగదు వితరణ చేయండి.....అని ఎందుకు ఆదేశించరు?

నా ప్రశ్న ఒకటే.....ఉన్నతాధికారులు, "నగదు లేదు అని బోర్డులు పెట్టెయ్యండి" అని శాఖలకి చెప్పవచ్చా? రేపు, "మేమే ఆ ఆదేశాలు ఇచ్చాము" అని నిజాయితీగా ఒప్పుకునేవాళ్లు ఎంతమంది?

(ఇప్పుడు నిబంధనలు పాటించలేదు అనే ఆరోపణలపై చర్యలని ఎదుర్కుంటున్నవాళ్లు చాలా మంది ఉన్నతాధికారులే!)

ఇంక, 3. ఆర్బీఐ పారదర్శకత పాటించడం లేదు--అన్నది చర్చల్లో పాల్గొంటున్న "నిపుణులు" చెప్తున్నది.

(......మరోసారి)

Saturday, December 17, 2016

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......3

"....క్యూలలో సామాన్యులు కష్టాలు పడుతున్నారు!"

(నిన్నటి టపా తరువాయి)

అదికూడా బ్యాంకు పై అధికారుల తప్పిదమే. వాళ్లు జవాబు చెప్పాల్సి వస్తుంది.

తరువాత, బ్యాంకులకి 2000 నోట్లు వచ్చినా, వాటిని నోట్ల బదిలీ కి మాత్రమే వాడుకున్నారు ....నాలుగైదు రోజులదాకా. 100 నోట్లు రాగానే, కొన్ని బ్యాంకులు ఏటీఎం లలో పెట్టాయి. కానీ, అందరూ....2000 నోట్లకి చిల్లర దొరకడం లేదు అంటూ, 1900 చొప్పున తీసుకోవడం మొదలెట్టారు. చాలా తక్కువ సమయం లోనే, అవన్నీ ఖాళీ!

తరువాత, మళ్లీ కొత్త నోట్లు వచ్చినా, బ్యాంకుల వద్ద క్యూలు తగ్గలేదు. 

బ్యాంకు అధికారులు, స్వంత నిర్ణయాలు తీసుకొని, "వారానికి ఒక్కొక్కళ్లూ 24 వేలు తీసుకోవచ్చు" అన్నా, 'అందరికీ సమానంగా పంచుతాం' అంటూ, ఒక్కొక్కళ్లకీ 6000 చొప్పునో, 4000 చొప్పునో, 2000 చొప్పునో సరిపెట్టడం మొదలెట్టారు. అలా కాకుండా, ఖాతా లోంచి నగదు ఉపసంహరించే వాళ్లు  ఒక్కొక్కళ్లకీ 24 వేల వరకూ, వాళ్లు అడిగినంత ఇచ్చేసి ఉంటే, ఎక్కువ నగదు--తక్కువ సమయంలో చెలామణీ లోకి వచ్చేది! 

నగదు లేదు కాబట్టి, క్యూలు ఉండేవి కాదు! అదీ తప్పిదం.

19 వ తేదీ నాటికి అదీ పరిస్థితి. 

అప్పటికి కూడా, అదే పధ్ధతి అనుసరిస్తూ, క్యూలలో ఉన్నవాళ్లకి ఒక్కొక్క 2000 నోటు ఇస్తుంటే, కుటుంబం లో అందరూ క్యూలలో నుచొని, ఒక్కొక్కళ్లూ రెండేసి వేలు తీసుకొని, ఇంట్లో దాచుకోవడం మొదలెట్టారు!

20 న సెలవు తరవాత, 21 నుంచి ఇంకా క్యూలు పెరిగాయి! 

కొన్నిచోట్ల బ్యాంకుల వాళ్లతో గొడవ పెట్టుకోవడం మొదలయ్యింది. అయినా, అధికారులు.....అదే పధ్ధతి లో వచ్చిన కొత్తనోట్లు పంచిపెట్టేసి, "నగదు లేదు" అని బోర్డులు పెట్టెయ్యమని "ఆదేశాలు" ఇచ్చారు. 

ఓ జిల్లాలో బ్యాంకు శాఖలన్నింటికీ అధికారి (జోనల్ మేనేజరు)..... "నగదు లేదు అని బోర్డులు పెట్టెయ్యండి. బందోబస్తు అవసరమైతే, నాకు ఫోను చెయ్యండి. నేను డీ ఎస్ పీ తో మాట్లాడి, పోలీసులని ఏర్పాటు చేస్తాను" అని శాఖాధికారులకి చెప్పాడంటే, అది సబబేనా?

కొన్ని బ్యాంకుల ఏటీఎం లు 2000 నోట్లు వితరణ చేసేలా మార్చబడ్డాయి. వాటిలో, వచ్చిన నగదులోనే కొంత పెట్టగానే, అక్కడ క్యూలు ఏర్పడి, నగదు ఖాళీ అవగానే, ఇంకో ఏటీఎం వెతుక్కునేవాళ్లు వెళ్లిపోతే, ఇంకొంతమంది, మళ్లీ పెట్టకపోతారా అనే ఆశతో అక్కడే క్యూల్లో నిలబడేవారు! 

25 వ తేదీ వరకూ అదే పరిస్థితి.....బ్యాంకులముందు క్యూలు, ఏటీఎం ల ముందు క్యూలు. (కొన్ని బ్యాంకులనుంచి--ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులలోంచి, పెద్ద సంఖ్యలో 2000 నోట్లు ప్రక్కదారి పట్టడం మొదలయ్యింది.)

26, 27 సెలవులు రాగానే, "అలసిన బ్యాంకు సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్నారు" అని ప్రకటించేశాయి పత్రికలూ, టీవీలూ. 

28 న మళ్లీ నగదు వచ్చినా, బ్యాంకుల్లో 4 వేలు చొప్పునో, 2 వేలు చొప్పునో సరిపెట్టడం మానలేదు! మళ్లీ క్యూలు. 

1వ తేదీకి, అల్లకల్లోలం మొదలయ్యింది. అటు జీతాలూ, ఇటు పించన్లూ, మామూలుగా బ్యాంకుల్లో ఇస్తున్నవి కాకుండా, సామాజిక పించన్లు కూడా బ్యాంకుల్లో వేయించారు! నగదు సరఫరా యేమీ పెరగలేదు.

ఈ సామాజిక పించన్లు అసలు వచ్చాయో లేదో అనీ, వస్తే ఏ బ్యాంకులో జమయ్యాయో అనీ, ఎప్పుడు-ఎంత ఇస్తారు అనీ, వృధ్ధులూ, వికలాంగులూ సైతం ఎండల్లో, ఉదయం నుంచీ సాయంత్రం వరకూ అష్టకష్టాలు పడినా, చాలామందికి నిరాశే ఎదురయ్యింది. 

మళ్లీ బ్యాంకులు "పించన్ దారులకి 6 వేలు మాత్రమే ఇస్తాము" అని బోర్డులు పెట్టారు. అలా చెయ్యకుండా, ఉన్న నగదుని, 24 వేల లోపు, అడిగినవాళ్లకి అడిగినంత ఇచ్చేసి చేతులు దులుపుకుంటే, మళ్లీ చెలామణి లో నగదు పెరిగేది!

(......మరోసారి)

(మిత్రుల ఆదేశం పై నా టపాలు బ్లాగ్ లో కూడా ప్రచురిస్తున్నాను. ఇంతకు ముందు వ్రాసిన 2 భాగాలు ఈ క్రింది లింకు లో చదవచ్చు) 

https://www.facebook.com/groups/1311091748908538/