haaram logo

Thursday, January 26, 2012

వేలం వెఱ్ఱులకి పరాకాష్ట......



.........దీన్ని "కొలవెర్రి" అంటే సరిపోతుందేమో!

"వై దిస్ కొలవెరి....." పాట గురించి ప్రత్యేకంగా వ్రాయఖ్ఖర్లేదు. ఆ పాటకి సంగీత దర్శకత్వం వహించిన 18 యేళ్ల కుర్రవాడికి నచ్చింది అని చెపుతున్న, నాక్కూడా నచ్చిన ఓ పాట గురించి వ్రాస్తున్నాను.

చాలా యేళ్లుగా, మన సినిమాల్లో వస్తున్న "డోఁయ్, డోఁయ్; సోఁయ్, సోఁయ్, టియ్యాఁ, టియ్యాఁ" లాంటి స్వరాలతో, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, పంజాబీ, కొంకిణీ లాంటి మన భాషలేకాకుండా, ఫ్రెంచ్, ఇటాలియన్, అరబిక్, జపనీస్ వగైరా భాషా పదాలతో, అదేదో తంత్రీ వాయిద్యమో, నిస్తంత్రీ వాయిద్యమో పాడేవాళ్ల గొంతుల్లో నొక్కేసి, వాళ్లే పాడుతున్నట్టు భ్రమ కలిగిస్తూ రికార్డింగు చేస్తున్న పాటలు--పొరపాటున చెవినిబడి, సంగీతమంటేనే విరక్తి కలిగిన వాళ్లకి కూడా ఈ పాట నచ్చుతుందని నేననుకుంటా. 

ఆ పాట "సారొత్తారొత్తారా........"!  అమ్మాయి గొంతులో చక్కగా వినిపిస్తున్న ఆ పాటలో, సడెన్‌గా ముళ్లపంది గొంతుతో ఓ మగాడు పాడడం మాత్రం నాకు నచ్చలేదు. 

యెందుకో, ఈ పాట వింటూంటే, మా చిన్నప్పుడు విన్న అదేదో సినిమాలోని "అన్నా అన్నా విన్నావా? చిన్నీ కృష్ణుడు వచ్చాడు, వెన్నల దొంగా వచ్చాడూ, వన్నెల చెలికాడొచ్చాడు....." అనే అనుకుంటా.....సాగే పాట గుర్తొచ్చింది. అదీ ఇదీ ఒకే రాగంలో వున్నాయేమో, ఎస్పీ బాలు లాంటివాళ్లు "పాడుతా తీయగా"లో చెప్పాలి.

ఇంక, "కొలవెర్రుల" గురించి చెప్పాలంటే, మన మీడియా పుణ్యమా అని, మన పండగలూ, మన సాంప్రదాయాలూ వగైరాల పేరుతో, అమెరికాలో కూడా "గ్లేజ్డ్ టైల్స్" ఫ్లోరింగులని కూడా పేడతో అలికేసి, ముగ్గులు పెట్టేస్తున్నారట. ఇంకా కొంతమంది గంగిరెద్దులవాళ్ల, హరిదాసుల వేషాలు కూడా వేసేస్తున్నారట.

మొన్నొకాయన సింగపూరు నుంచి తిరిగి వస్తూ, రైల్లో కలిశారు. ఆయన విన్న మాట--దుమ్ము కణం కూడా యెక్కడా కనిపించని సింగపూరులో ఇలాంటి ప్రయత్నాలు చేసిన తెలుగోళ్లకి భారీ లెవెల్లో డాలర్లలో జరిమానాలు వడ్డించారట! 

సరే. బాగానే వుంది. ఇంకో కొలవెర్రి సోకాల్డ్ "దేశ భక్తి"!

నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా, అనేక చోట్ల వంద అడుగుల; వెయ్యి మీటర్ల; 3.1 కిలోమీటర్ల పొడుగున్నవీ, 400 మీటర్లూ వగైరా వైశాల్యమున్నవీ త్రివర్ణ పతాకాల ప్రదర్శనలూ, సామూహిక "జనగణమన" లూ కానిచ్చేశారు.

మా ఆకివీడులో అయితే, లయన్స్ వగైరా క్లబ్బులవాళ్లు, యథాశక్తి, 100 అడుగుల పొడుగు జండాని వూరేగించి, 14 వేలకి పైగా పిల్లలతో, 37 సార్లో యెన్నో ఆ గీతాన్ని పాడించి, "గిన్నిస్" రికార్డు సాధించారట! యెందుకు అంటే, ఆకివీడు పేరు ఆ పుస్తకంలో కనిపించాలనే తాపత్రయమేనట!

వుదయం 8-00 నుంచీ చుట్టుప్రక్కల వూళ్లనుంచి స్కూలు పిల్లలని పోగేసి, (వాళ్లని యెండలో మాడుస్తూ, ఆకలి దప్పులకి గురిచేస్తూ, కాల కృత్యాలు తీర్చుకునే వెసులుబాటు కూడా లేక వాళ్లని హింసిస్తూ), తీరిగ్గా యే 12-00 గంటలకో "ప్రజా ప్రతినిధులు" జండా యెగరేసి, గీతాలాపన మొదలెట్టి, ఓ గంటో యెంతో సాగించి, మొత్తానికి "రికార్డు"కెక్కేశారు(ట). 

ఇలాంటి వారిమీద మానవహక్కుల కమిషన్లు "సువో మోటో" గా కేసులు బనాయిస్తే బాగుండును.

(మరి ఇవాళ ఆ జండాల పరిస్థితి యేమిటి అని మీడియావాళ్లు ఆరా తీసి, మళ్లీ ఫోటోలూ, వీడియోలూ ప్రచురిస్తే ఇంకా బాగుండును).

ఇంక, ఈ సోకాల్డ్ సేవా సంస్థలు మా "సన్యాసి రావు" నుంచి నేర్చుకోవలసింది యెంతో వుంది అంటే కాదంటారా?    

ఆయనెవరో కవిగారు "కల్లు మానండోయ్, బాబూ కళ్లు తెరవండోయ్" అన్నట్టు, ఇప్పుడు "వెర్రి మానండోయ్" అని పాడాలనిపించడం లేదూ?