Wednesday, March 30, 2016

"చిన్నారుల" భారతం.....6


                                  .........నడుస్తున్న భాగోతం

"ఆరోజు" కార్యక్రమం తాలూకు విడియోలు బయటపడ్డాయి. "చిన్నారి" కన్నయ్య కుమార్ ని అరెస్టు చేశారు ఇంకొంతమంది తో సహా. దేశద్రోహం కేసు పెట్టారట.

ఆ వీడియోల లో ఆడియో యే మాత్రం వినిపించేలా లేదు. కారణం.....అతను మాట్లాడుతున్నంత సేపూ, ఆడియో రికార్డరు ఎదురుగా డప్పుల మోతలూ, ఇతరుల "ఓ...." అని అరుపులూ.

కొన్ని టీవీ ఛానెళ్ల వాళ్లు "తరువాత" తయారు చేసిన వీడియోలు ప్రసారం చేశారట.....వాటిలో దేశ వ్యతిరేక నినాదాలు కన్నయ్యే చేస్తున్నట్టు.

కోర్టులో ప్రదర్శించిన విడియోలు--నాయిస్ ఫిల్టర్లు ఉపయోగించి, ఆడియో మెరుగు పరచి, వినిపించినవి. (వాటిని కొందరు "డాక్టర్డ్" వీడియోలు అని కొట్టిపారేస్తున్నారు. కానీ, వాళ్లు గుండెలకి హత్తుకున్నవాళ్ల ఫోటోలని మార్చలేరుకదా? సందర్భాన్ని బట్టి, వాళ్లు ఆ ఫోటోల్లో ఉన్నవాళ్లని ఉరితీయాలి అనో, పాకిస్తాన్ తీవ్రవాదులని శిక్షించాలి అనో నినాదాలు చేస్తున్నారు అని అనుకోలేం కదా?)

కోర్టులో హాజరు పరుస్తుంటే, మళ్లీ హై డ్రామాలు...కొంతమంది లాయర్లు చేయి చేసుకున్నారు అనీ, పోలీసులు ఏమీ చెయ్యలేదు అనీ ఆరోపణలు....అవన్నీ టెలికాస్టులూ.....!

కస్టడీలు అయ్యాక, బెయిల్ ఇచ్చారు న్యాయ మూర్తి. వెంటనే, వాడు బయటికి వచ్చి, విజయోత్సవ మీటింగులూ, ర్యాలీలూ. కాంగీ, కమ్మీ మేథావులు "వాక్ స్వాతంత్ర్యం నిలిచింది" లాంటి స్టేట్మెంట్లూ, "దేశద్రోహ ఆరోపణ వాపసు తీసుకునే సూచనలు" అంటూ ఊహాగానాలూ....!

న్యాయమూర్తి యేమి చెప్పారు?

"విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో, స్వేఛ్ఛాయుత వాతావరణం లో, (కాబట్టి) ఆ వ్యక్తులు అలాంటి నినాదాలు చేయగలుగుతున్నారు. '......ఊపిరిసైతం సరిగ్గా అందని పరిస్తితుల్లో మన వీర జవానులు దేశ సరిహద్దుల్ని అనుక్షణం కాపాడు తున్నందువల్లే' తాము అలాంటి సురక్షిత వాతావరణం లో ఉన్నామని వారు గ్రహించలేకపోతున్నారు. ఆ ఫోటోలూ తగిలించుకొని, నినాదాలు చేసినవాళ్లు, సరిహద్దుల్లో....ఒక్క గంటైనా వుండలేరు. .....ఏది పడితే అది మాట్లాడుతూ, అదే భావ ప్రకటన స్వేఛ్ఛ అనీ, అదేదో తమకు ఉన్న మౌలిక హక్కు అనీ వారు వాదిస్తే కుదరదు. .......ఇన్‌ఫెక్షన్ మరీ ముదిరిపోయి పుండుపడితే, సంబంధిత అంగాన్నే తొలగించాల్సి వస్తుంది. ఆ సమస్యకు అదే చికిత్స."

అని స్పష్టంగా చెప్పారు.

మళ్లీ మామూలుగానే, కుహనా వాదులు--'ఉత్తర్వులు ఇమ్మంటే, ఆవిడ ధర్మోపదేశాలు చెయ్యడం ఏమిటి' --అంటూ, ఆ న్యాయమూర్తిని కించ పరిచేందుకు వెనుకాడలేదు.

అసలు "జాతి వ్యతిరేకత అనేది ఏమీ 'క్రిమినల్ నేరం ' కాదు" అంటాడో న్యాయ కోవిదుడు. అంటే, కొద్ది మంది జాతి వ్యతిరేకులతో కొన్ని కోట్లమంది సహజీవనం చెయ్యవలసిందేనన్నమాట! అంతేకానీ, వాళ్లనేమీ అనకూడదు....వాళ్లని బలపడనివ్వాలి....జాతి యేమైపోయినా, కాంగీ, "కమ్మీలు" ఎలాగైనా అధికారం సంపాదించుకోవాలి!

ఇంకొంతమంది "కమ్మీలు"--వ్యవస్థ కి (తుపాకులూ, బాంబులూ, మందుపాతరలూ వగైరాలతో) శస్త్ర చికిత్స చేస్తాం" అన్నందుకే కదా "మావిస్టులనీ" వాళ్లనీ తీవ్రవాదులు అంటున్నాం? మరి ఆ న్యాయమూర్తి కూడా తీవ్రవాదేనా? అంటూ ఓ వితండవాదం మొదలెట్టారు....!!

(......మరోసారి)

Sunday, March 27, 2016

"చిన్నారుల" భారతం.....5


.........నడుస్తున్న భాగోతం

(2వ భాగం చివర....."ఇంకో "చిన్నారి" ఇంకో సంచలనం సృష్టించకపోతే......!"--తరువాయి).....

రోహిత్ గొడవలో పండగ చేసుకుంటూండగానే, మీడియా వాళ్లకీ, కాంగీ కమ్మీలకీ ఇంకో కొబ్బరికాయ అందించాడు ఇంకో "చిన్నారి".....కన్నయ్య కుమార్--ఢిల్లీ జేఎన్యూ లో 2016 ఫిబ్రవరి 9 న "వామపక్ష డెమొక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్"--డీ ఎస్ యూ--తరఫున అఫ్జల్ గురు ని ఉరితీయడం పై నిరసన ప్రదర్శన నిర్వహించడం ద్వారా!

ఆ రోజు (09-02-2016) న, ఓ పదిమంది డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్ మాజీ సభ్యులు, ఓ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించుకుంటాం అని యూనివర్సిటీ అధికారులని అనుమతి అడిగి, కేంపస్ అంతటా పోస్టర్లు అంటించారట......ఇక్కడ ఒక కళా/ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించబడుతుంది....'కాశ్మీర్ ఆక్రమణ చరిత్ర ' పై, ఇంకా దానికి వ్యతిరేకంగా 'అక్కడి ప్రజల పోరాటం గురించీ'.....అని, అఫ్జల్ గురు; మక్బూల్ భట్ మొదలైనవాళ్ల ఫోటోలతో!

నిజంగా వాళ్లు ఉద్దేశించింది.....మూడేళ్ల క్రితం అదే తారీఖున ఉరితీయబడ్డ అఫ్జల్ గురు స్మారక సభ జరపాలని! ఆ సందర్భాన్ని, అఫ్జల్ గురు, మక్బూల్ భట్ ల "న్యాయపూర్వక హత్య" లని నిరసించడం, కాశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికారం అనే ప్రజాస్వామిక హక్కు కోసం వాళ్లు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించడం.....అని వాళ్లే చెప్పుకున్నారని, ఆ సంఘటనలతో సంబంధంలేని విద్యార్థులు చెపుతున్నారు. 

దాంతో, ఏబీవీపీ వాళ్లు ఫిర్యాదు చేయగా, యూనివర్సిటీ అధికారులు అనుమతి ఉపసం హరించారట. 

అయినా, ఆ సంస్మరణ సభ జరగనే జరిగింది. 

అక్కడ చేరిన కొంతమంది కాశ్మీరీ విద్యార్థులు, "ఈ కాశ్మీర్ మాది....పూర్తిగా మాదే", "ప్రతీ ఇంటి నుంచీ ఓ అఫ్జల్ గురు పుడతాడు", "భారత్ నాశనం అయ్యేవరకూ యుధ్ధం జరుగుతుంది....యుధ్ధం జరుగుతుంది" లాంటి నినాదాలు ఇచ్చారు. 

మీటింగ్ నిర్వాహకులు...."మనకేం కావాలి? .....స్వాతంత్ర్యం", "తీసుకు తీరుతాం ....స్వాతంత్ర్యం" లాంటి నినాదాలు ఇచ్చారు. (వీళ్లలో "చిన్నారి" కన్నయ్య కుమార్ ముఖ్యుడు). కానీ.....కన్నయ్య కాశ్మీరు విద్యార్థులు ఇచ్చిన నినాదాలు ఇవ్వలేదుట!

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఆ కాశ్మీర్ విద్యార్థులు అసలు జే ఎన్ యూ విద్యార్థులే కాదట. 

ఈ విషయాలన్నీ చెపుతున్నవాళ్లు.....ఆ సంఘటనలతో సంబంధం లేని విద్యార్థులే!

(......మరో సారి)

Friday, March 18, 2016

"చిన్నారుల" భారతం.....4


.........నడుస్తున్న భాగోతం

అసలు రోహిత్ ఆత్మహత్య లేఖలో....."నా పుట్టుకే ఓ ప్రమాదం" వంటి మాటలలో, నిరాశా వాదం, పలాయన వాదం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, చాలామందికి, ఓ "చిన్నారి" లోని "భావుకత్వం" కనిపించిందట! అదేమిటోమరి.....

తను వ్రాసి కొట్టేసేడని చెప్పబడుతున్న మాటలు చూడండి.....

“The Ambedkar Students Association, the Students Federation of India, anything and everything exist for their own sake. Seldom the interest of a person and an organisation matches. To get power, to become famous or to be important in between boundaries and to think we are up to changing the system, very often we overestimate the acts and find solace in traits. Of course I must give credit to both these groups for making, introducing me to wonderful literature and people.”
ఒకే అడ్డగీతతో తొలగించబడింది ఈ క్రింది అసంపూర్తి వాక్యం :

"There are some bad waters in us bels."

తనేదో దస్తావేజుల లేఖరి లా, యేదో లీగల్ డాక్యుమెంట్ వ్రాస్తున్నట్టు.....5 వ వరుస లో రెండు హంసపాదులు; 11 నుంచి 15 వ వరుస వరకూ తుడుపులు; 22 వ వరుస కొట్టివేత.....ఇలా పేజీ చివర వ్రాసి, లేఖరి సంతకం చేసినట్టు.....వ్రాశాడంటారా? మరైతే, ఆ లైన్లు అక్షరాలు కనపడకుండా వుండేలా తుడుపులు పెట్టడం యెందుకు? చివర్లో ఓ లైన్, అడ్డగీత తో మాత్రమే కొట్టెయ్యడం యెందుకు? ఆ "లీగల్ బ్రెయిన్" అక్కడ పని చేయ లేదా?

ఆ లేఖని ఫోరెన్సిక్ పరిశోధనకి పంపించారన్నారు.....యెవరు కొట్టేశారో పరిశీలించమని. మరి ఫలితం యేమిటో ప్రకటితం కాలేదు!

"చిన్నారి" రాహుల్ మాత్రం ఓ అర్థరాత్రి తో సహా, రెండు మూడుసార్లు వచ్చి--'న్యాయం జరిగేదాకా పోరాడుదాం; మీకు అండగా నేనుంటాను'--వగైరా హామీలు ఇవ్వడం, సీతారాం యేచూరి లాంటి కమ్మీలు తందాన తాన అనడం చూస్తే, శ్రీ శ్రీ వ్రాసిన--ఘూకం కేకా, భేకం బాకా--గుర్తు రావడం లేదూ?

ఇవన్నీ.....వేరో చిన్నారి వాళ్లకి ఇంకో అవకాశం కల్పించడంతో ప్రక్కన పెట్టేశారు!

ఇంకా చిత్రం యేమిటి అంటే, "చాతుర్ వర్ణ్యం మయా సృష్టం" అని శ్రీ కృష్ణుడు చెప్పింది "కులాల" గురించి కాదు.....ఆ "వర్ణాలు" వేరు.....లాంటి నీతులు చెప్పే మేథావులు సైతం, అక్కడ "కులవివక్ష" వల్లే ఓ "చిన్నారి" హత్య జరిగిపోయింది.....అంటూ మొసలి కన్నీళ్లు కార్చి, దానికి బాధ్యులు.......కాషాయ సేన, వాళ్ల ప్రభుత్వం అని నిర్ధారించేయడం!

(....మరో సారి)

Thursday, March 17, 2016

"చిన్నారుల" భారతం.....3


.........నడుస్తున్న భాగోతం

అసలు రోహిత్ వ్యవహారం మొదలయ్యింది 2015 ఆగస్ట్ 3 న......తను, ఇంకో నలుగురు ఆంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులూ కలిసి, "యాకూబ్ మెమొన్" కి ఉరిశిక్ష విధించడంపై, ఇంకా "ముజఫర్ నగర్ బాకీ హై" అనే డాక్యుమెంటరీ ప్రదర్శిస్తుంటే, ఏబీవీపీ వాళ్లు దాడి చేసినందుకూ! (ఆ ఐదుగురికీ కేంపస్ హీరోలు అయిపోవాలని కోరిక యెందుకు పుట్టిందో ఎవరైనా చెప్పగలరా?)

తరువాత సుశీల్ కుమర్--వాళ్లని ఫేస్ బుక్ లో "గూన్‌స్" అన్నాడని అతని మీద దాడి చేశారు రోహిత్ గాంగ్.

ఏబీవీపీ వాళ్లు ఇచ్చిన ఫిర్యాదు పై దర్యాప్తు చేసి, వైస్ ఛాన్సెలర్ రోహిత్ నీ, నలుగురు ఇతరులనీ సస్పెండ్ చేసి, హాస్టలు ఖాళీ చెయ్యమన్నారు. తరువాత కూడా అనేక విధాల చర్చలూ, దర్యాప్తులూ జరిగాక, జనవరి 2016 లో మళ్లీ శిక్ష నిర్ధారించినందుకు.....ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆరోపణ.....మీడియా వాళ్లదీ, కాంగీ కమ్మీలదీ.

అసలు విషయాలని ప్రక్కదారి పట్టిస్తూ, కొంతమంది మీడియావాళ్లూ, రాజకీయులూ.....వాడసలు దళితుడేకాదు అనీ, వడ్డెర కులస్తుడు అనీ, అయినా తల్లిదండ్రుల్లో యెవరి కులం కావాలో నిర్ధారించుకునే హక్కు వాడికే వుంది అనీ......అసలు ఏబీవీపీ వాళ్లు చేసిన "యూనివర్సిటీ లో రాజకీయ, కుల సంబంధ, జాతి వ్యతిరేక ఉద్యమాలు నడుస్తున్నాయి" అనే ఫిర్యాదు పై దత్తాత్రేయ చర్యతీసుకోమని మంత్రిత్వ శాఖ కి రాసినందుకూ, ఆ మంత్రి యూనివర్సిటీ వాళ్లకి తగిన చర్య తీసుకోమని రాసినందుకూ (ఆ లేఖల్లో రోహిత్ పేరూ, ఏ ఎస్ ఏ పేరూ ఎక్కడా లేకపోయినా) మాత్రమే ఆత్మహత్య జరిగింది అనీ, అది అగ్రకులాలు చేసిన హత్య అనీ.....ఇలా ఆకాశంలో దీపావళి చేసుకున్నారు!

అసలు రోహిత్ ఆత్మహత్య లేఖలో..... 

(....మరో సారి)

Thursday, March 10, 2016

"చిన్నారుల" భారతం.....2.........నడుస్తున్న భాగోతం

తరవాత, ఇంకొన్నాళ్లకి, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లో, ఓ "చిన్నారి".....ఆత్మహత్య చేసుకున్నాడు.....తన ఆత్మహత్యకి యెవరూ కారణం కాదు అని చీటీ వ్రాసి పెట్టి!

ఇంకేముందీ.....ప్రపంచంలోనే "చిన్నారి" రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ వాలి పోయాడు....అక్కడ అసహనం పెరిగిపోయింది, దళిత చిన్నారిని హత్య చేశారు, విద్యార్థులకి న్యాయం జరగాలి, అప్పటిదాకా విశ్రమించం అంటూ!

వాడి వెనకాలే, కమ్యూనిస్టు "చిన్నారి" తొత్తులందరూ క్యూ కట్టేశారు. అపర మేథావులందరూ పేపర్లకీ, రోడ్లకీ యెక్కేశారు. 

తరవాత వాడి వీడియోలూ వగైరా బయటికి వచ్చాయి. వాడి కులం ప్రసక్తి వచ్చింది. ఇంకా అనేకం వచ్చాయి. 

నిజాలు సమాధి అయిపోయి, మసిపూసిన మారేడు కాయ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది.

అసలు ఆ "చిన్నారి".....రోజూ బాగా తాగేసి, ఇతర విద్యార్థులతో గొడవపడేవాడు. ముఖ్యంగా ఏబీవీపీ వాళ్లతో. వాళ్ల బేనర్లు చింపేసేవాడు. వాళ్లు అడిగితే, నేను దళితుణ్ణి కాబట్టి నన్ను అడుగుతున్నారు అని  దెబ్బలాడేవాడు. ఏబీవీపీ లో కూడా దళితులున్నారు. 

వాళ్లు మేమూ దళితులమే, మీ అంబేద్కర్ యూనియన్ బ్యానర్లు మేము చింపేశామా? అని అడిగితే, నాకు మీ బేనర్లు కనపడ్డాయి చింపేశాను. మా బేనర్లు మీకు కనపడలేదేమో.....! అని డబాయించేవాడు.

కేంపస్ లో వాళ్ల యూనియన్ తరఫున "ఉరిశిక్ష" కి వ్యతిరేకంగా సభ చేసుకుంటాము అని అనుమతి తీసుకుని, సభలో అఫ్జల్ గురు ని ఉరితీయడం అన్యయం. ఇది మనువదం. దీనికి వ్యతిరేకం. అఫ్జల్ గురు జిందాబాద్. వాడి హంతకులు నశించాలి అంటూ నినదాలు ఇచ్చాడు.

ఈ విషయాలు రిపోర్టు చేసినందుకూ, వాళ్లమీద చర్య తీసుకోమన్నందుకూ కక్షగట్టి,ఓ పాతిక ముఫై మంది వెళ్లి ఏబీవీపీ నాయకుణ్ని చితక బాదేశారు. వాడు సెక్యూరిటీ గార్డుల అడ్డా దగ్గరకి వెళ్తే, వాళ్లని కూడా కొట్టారు.

తరవాత ఏమయిందో, విచక్షణ నశించి, "నన్ను రాజకీయ నాయకులు వాడుకోడానికి చూస్తున్నారు. అదినాకు ఇష్టం లేదు" అని వ్రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.

తరువాత ఆ రాజకీయ నాయకులే ఆ చిన్నారికి న్యాయం జరగాలి అనీ, ఓ 5 కోట్లో యెంతో పరిహారం ఇవ్వాలి అనీ ఆందోళనలు సాగించారు. 

ఇంకెన్నాళ్లు సాగించేవారో.....ఇంకో చిన్నారి ఇంకో సంచలనం సృష్టించకపోతే......!

(.......మళ్లీ ఇంకోసారి)

Monday, March 7, 2016

"చిన్నారుల" భారతం.....1........నడుస్తున్న భాగోతం

మొన్నామధ్యన ఓ పదహారేళ్ల "చిన్నారి", ఇంకొంతమంది పెద్ద చిన్నారులతో కలిసి, ఓ చిన్నారి "అమ్మాయిని" బస్సులో రేప్ చేసి, చంపేశాడు. దాన్నే "నిర్భయ" కేసు అన్నారు.

ఆ "చిన్నారి"ని, చట్టం ప్రకారం శిక్ష పొడిగించలేము అంటూ కోర్టు విడుదల చేసేసింది.

ప్రభుత్వమేమో, వాడికి ఓ షాపూ, కుట్టు మిషనూ, కొంత డబ్బూ ఇచ్చి, జీవన సౌలభ్యం కల్పించిందట. ("లేడీస్ స్పెషల్ టైలర్" అని బోర్డు పెట్టాడేమో నాకు తెలీదు!)

ఆ చిన్నారిని ఇనుప రాడ్ తో పేగులు బయటికి వచ్చేలా గాయపరిచిందీ, బస్సులోంచి తోసెయ్యమని సలహా ఇచ్చి తోయించేసినదీ--ఈ "చిన్నారే"(ట).

విడుదలయ్యాక వాడేమన్నాడు?

"మాకు కొంచెం సహకరించి వుంటే, మేము అలా చేసి వుండేవాళ్లం కాదు కదా? అది ఆమె తప్పు" అని!

అదీ ఆ చిన్నారి కథ.

(ఇంకొందరు చిన్నారుల కథలు.....వరుసగా.....త్వరలో....)