haaram logo

Tuesday, November 28, 2017

ఆణిముత్యాలు కావాలి......2


"......వడ్లూ, మట్టి బెడ్డలూ....." -- (-1)



(బియ్యంలో వడ్లూ, మట్టిబెడ్డలూ అంటే......ఈ కాలం వాళ్లకి చాలామందికి తెలియదు! అందుకే ఈ "నేపథ్య" వివరణ. నా వివరణలో ఏమైనా లోపాలు వున్నా, సవరణలు వున్నా, పెద్దలు ఎవరైనా సూచిస్తే సంతోషిస్తాను)



గోదావరి మీద ఆనకట్ట కట్టాక, స్వాతంత్ర్యం వచ్చేనాటికి, గోదావరి జిల్లాల్లో భూములు మాగాణులయ్యేనాటికి "అక్కుళ్లు" అనే రకం బియ్యం పండించేవారు. సామాన్యంగా అందరూ వాటినే వండుకు తినేవారు. కొంచెం ధనవంతులు "కృష్ణకాటుకులు" అనే రకం బియ్యం తినేవారు. అవి అక్కడక్కడా పండేవి. ఇంక, లక్షాధికారులు మాత్రం, "బంగారు తీగెలు" అనే రకం బియ్యం వండించుకు తినేవారు. ఈ రకం ఎక్కడ పండేవో.....లేదా దిగుమతి చేసుకునేవారో నాకు తెలియదు.

 ఆ రోజుల్లో, ఎకరానికి 7 బస్తాలు పండితే చాలా గొప్ప!
60 లలో అనుకుంటా--సస్య విప్లవంలో భాగంగా, ఐ ఆర్ 8 అనే రకం వచ్చాయి. ఎకరానికి దిగుబడి 18 నుంచి 20 బస్తాలదాకా పెరిగింది. తరువాత క్రమంగా హంస లాంటి రకాలు, తరువాత మసూరి వచ్చాయి. అప్పటికి అంటే 1980 నాటికి మా జిల్లాల్లో, ఎకరం ఖరీదు ఒక లక్ష. అదే శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో, ఎకరం పదివేలు!

ఇంతకీ, అప్పటివరకూ ధాన్యాన్ని పొలాల్లోనే కళ్లాల్లో నూర్చి, ధాన్యాన్ని అమ్మేవారు. అందుకే బియ్యం ఆడినా, వాటిలో కొన్ని వడ్లు నలగకుండా మిగిలిపోయేవి, కొన్ని మట్టి బెడ్డలూ కలిసిపోయేవి.
గృహిణులు, బస్తా బియ్యం తెచ్చుకుంటే, రోజూ మధ్యాహ్నం వేళ ఓ కుంచెడో ఎన్నో, చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం కూడా!

90 ల నాటికి, చిన్న పట్టణాల్లో కూడా మినీ సూపర్ బజార్లు వచ్చాయి. వాళ్లే అన్నీ శుభ్రం చేయించి, పేకెట్లలో సీలు చేసి, కొంచెం ఎక్కువ ధరకి అమ్మసాగారు. ఇప్పటికీ అదే జరుగుతోంది కాబట్టి ఈ కాలం వాళ్లకి వడ్లూ బెడ్డల సంగతి తెలియదు.

అన్నట్టు, 1970 ల్లో, కావాలని కొందరు వ్యాపారస్తులు బియ్యంలో రాళ్లు కలపడం అనే మోసానికి పాల్పడేవారు. అప్పుడే ".....కొలిచారు రాళ్లు నాయాళ్లు...." లాంటి పాటలు వచ్చాయి.

ఇంకా చెప్పాలంటే, 1962 లో బియ్యానికి రేషన్ పెట్టారు......చైనా యుధ్ధం వచ్చినప్పుడు. అదే మనదేశంలో రేషన్లకి ప్రారంభం. ఆ తరువాత కూడా, బియ్యం అమ్మడానికి ప్రత్యేకంగా లైసెన్‌స్ వుండేది. తరువాత్తరువాత ఆ లైసెన్‌స్ ఎత్తివేసి, అందరూ బియ్యం అమ్మచ్చు అన్నారు. అక్కణ్నించీ మొదలయ్యాయి బియ్యం కష్టాలు. రకరకాల బియ్యం, కల్తీలు, ఒక్కోచోటా ఒక్కో రేటు........ఇలా.

దీనికి కారణం మాత్రం ఖచ్చితంగా "కాంగీ" యే!

(మరో సారి)  

No comments:

Post a Comment