haaram logo

Tuesday, September 22, 2015

శ్రవణ హింస

"భ్రష్ట భయంకర" సంగీతం-1

ఓ యాభై యేళ్ల క్రితం, పాటల కోసం "కూడా" సినిమాలు చూసేవారు. 

తరువాత పదేళ్లకి పాట రాగానే, బయటికి వెళ్లి సిగరెట్లు కాల్చుకు వచ్చేవారు. తరువాత స్టెప్పుల డాన్సుల పాటలు వచ్చాయి. నాగేశ్వర రావు వేస్తున్న స్టెప్పులు జనానికి నచ్చుతున్నాయని, ఇతరుల చేత కూడా అలాంటి స్టెప్పులు వేయించడానికి ప్రయత్నించి, భలే హాస్యం పుట్టించేవారు. (కళా తపస్వి కూడా, "స్టెప్పుల" కి తనవంతు దోహదం చేశాడు--విమర్శ ముసుగులో).

ఆ తరువాత, అనేక మంది కొత్త సంగీత దర్శకులు వచ్చి, "కొన్నైనా" చక్కటి మెలోడీ పాటలు ఇచ్చారు. 

ఇంక తరువాత వస్తున్నది పైన శీర్షిక లో పేర్కొన్న లాంటి సంగీతమే!

మా యింట్లో, రేడియోల, టేప్ రికార్డర్ల కాలంలో యెంచుకున్న సంగీతం ఇష్టంగా వినేవాళ్లం. తరువాత వీసీపీ లు వచ్చాక, పాట రాగానే ఫాస్ట్ ఫార్వార్డ్ నొక్కేసేవాళ్లం. టీవీలు వచ్చాక, వెంటనే ఛానల్ మార్చేయడం, అక్కడా పాటలు వస్తూంటే, మ్యూట్ చేసెయ్యడం! ఇలాంటి ట్రిక్కుల ద్వారా, యేడాది పాటు సంగీతం బారి నుంచి తప్పించుకుంటున్నాం. కానీ......ఈ 

వినాయక చవితి రోజుల్లో మాత్రం, భయంకరంగా హింస అనుభవిస్తున్నాం.....ఆ పాటలు వినక తప్పక.....!

దీనికి పరిష్కారం యేమిటో మరి?!

(.....మరో సారి)

Tuesday, August 4, 2015

న్యాయ ద్రోహులు

"లయ్యర్లూ", 'అ' న్యాయమూర్తులూ......2

అసలు ఇలాంటి కేసులన్నీ ఆ 'కొందరే' యెందుకు "గుత్తకు" తీసుకొంటూ వుంటారు? అలా ఇంకెన్నాళ్లు తీసుకుంటారు? వాళ్ల తరవాత తరం వాళ్లూ, వాళ్లకన్నా ఇంకా జూనియర్లూ మరెప్పుడు వాళ్ల ప్రతిభ ని వెలికి తీసుకు రాగలరు? వాళ్లకి రిటైర్మెంటు లేదా? 

జడ్జీలుగా రిటైర్ అయినవాళ్లు కూడా మళ్లీ గౌన్లు తగిలించుకుని, కేసులు వాదించొచ్చు! (ఇలాంటి వాటి వల్లే "నాట్ బిఫోర్" లు యెక్కువైపోతున్నాయి). కోర్టుల్లో కొన్ని లక్షల కేసులు పెండింగులో వుంటున్నాయి. నెలకి కనీసం ఓ 50 "పిల్" లో, "సువో మోటో" లో స్వీకరిస్తున్నారు. 

క్రింది కోర్టు స్టే ఇవ్వడమో, బెయిల్ ఇవ్వడమో, నిరాకరించడమో జరగ్గానే, వెంటనే పై కోర్టుల్లో అప్పీళ్లు దాఖలూ.....వాటి పై విచారణలూ, అదలా వుండగానే, ఇంకొకళ్లు హై కోర్టుకీ, ఇంకొకళ్లు సుప్రీం కీ......!

అవి చాలవన్నట్టు, ప్రతీ చిన్న విషయానికీ, సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలనేవాడే ప్రతీ వె.ధ.వ కూడా! ఇంకా అనేక కమిషన్లకీ, సంఘాలకీ......రిటైర్డ్ సీనియర్ న్యాయమూర్తులే! ఇంకా కొన్ని కార్పొరేషన్ల లాంటి వాటికీ, వాళ్లనే నియామకం!

పోనీ జూనియర్లకి ప్రతిభ తక్కువా? వీళ్లకి యెన్నో విధాలుగా కష్టపడి సమాచారాన్నీ, ఇతర ముఖ్యమైన పాయింట్లనీ తయారు చేసి ఇచ్చేది ఈ జూనియర్లే! ఈ జూనియర్లేమైనా బాగా సంపాదించుకుంటున్నారా? యే కోర్టులోనైనా, వేళ్లమీద లెఖ్ఖ పెట్టదగ్గవాళ్లు తప్ప, మిగిలిన వాళ్లందరూ చెట్టు క్రిందే......! కొత్తగా ఎన్ రోల్ అవుతున్నవాళ్లు అవుతూనే వున్నారు!

మరి యెంతకాలం ఇలా సాగాలీ? పరిష్కారాలు యేమైనా వున్నాయా? సంస్కరణలు యేమైనా వీలవుతాయా?

చూద్దాం! 

(.......మరోసారి)

Monday, August 3, 2015

న్యాయ ద్రోహులు

"లయ్యర్లూ", 'అ 'న్యాయమూర్తులూ......

మన పెద్దవాళ్లెప్పుడో చెప్పారు.....లాయర్లు అంటే లయ్యర్లు అని. ఇంకా, ఓడినవాడు కోర్టులోనే యేడిస్తే, గెలిచినవాడు ఇంటికెళ్లి యేడిచాడు అనీ, ఇంకా.....తెల్ల కోటునీ, నల్లకోటునీ ఒక సారి ఆశ్రయిస్తే జీవితాంతం వదలరు అనీ......ఇలా బోళ్లు ఛలోక్తులు!

(ఇలాంటి వాళ్లకి, గాంధీజీ, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి అతి కొద్ది మందే మినహాయింపు.) 

ఇప్పటి వ్యవహారాలు చూస్తే, అవన్నీ నిజం అనిపించడం లేదూ?

ఒకప్పుడు చిన్నారుల్ని చిదిమేసిన "బిల్లా, రంగా" కేసు నుంచీ, అమ్మాయిని "తందూరీ" లో దహనం కేసు నుంచీ, పెళ్లాన్ని చంపేసిన ఓ "మంత్రి" కేసు నుంచీ, మొన్నటి "నిర్భయ" కేసు నుంచీ, "సంజయ్ దత్", "సల్మాన్" కేసులనుంచీ, "గాలి" జనర్దన రెడ్డి కేసుల నుంచి, "జగన్" కేసుల నుంచి, "జయలలిథా" ఆస్థుల కేసుల నుంచి, నిన్నటి "యాకూబ్ మెమెన్" కేసుల వరకూ మనకి కనిపిస్తున్నదేమిటి?

ఆ నేరస్థుల కి శిక్ష పడకుండా చేయాలని, పడినా యెలాగోలాగ తప్పించాలని, ఉరి శిక్ష పడ్డా, దాన్ని కొన్ని సంవత్సరాలో, నెలలో, వారాలో, రోజులో వాయిదా యేయించాలనీ, కోర్టుల్లోనూ, బయటా, నానా విన్యాసాలూ చేసి, నానా గడ్డీ కరిచి, కరిపించి, తమ కండూతి తీర్చుకుంటున్న "రామ్ జేఠ్మలానీ" లాంటి వాళ్లు అనేకమంది వున్నారు, కర్నాటక స్పెషల్ కోర్టు న్యాయమూర్తిలాంటి వాళ్లు వున్నారు......అని కాదూ?

వాళ్లకి అంత కండూతి యెందుకు? అంటే రెండే కారణాలు.....1. కోట్లలో డబ్బు ముడుతూంది, 2. కావలసినంత ప్రచారం జరిగి, అలాంటి కేసులన్నీ వాళ్లకే వెళుతున్నాయి!

మరి న్యాయం యెక్కడున్నట్టు? A I R (న్యాయాలయాల తీర్పులన్నీ ప్రచురించే పుస్తకాలు) లలో!

వాటి మీదే ఈ పరాన్న భుక్కుల జీవనం మరి!

(.......మరోసారి)

Saturday, August 1, 2015

తీవ్రవాదులు....తీవ్ర "వాదులు"

ద్రోహులూ......శిక్షా.....

".....ఎందుకింత రక్తదాహం....?" అంటూ ప్రశ్నించాడట--ప్రశాంతి భూషణ్!!!!!!

(వాణ్ని పార్టీలోంచి తన్ని తగిలేయడంలో మంచిపనే చేశాడు కేజ్రీవాల్ అనిపించింది. కానీ తరవాత, మెమెన్ కి ఉరిశిక్ష రద్దు చెయ్యాలని పిటిషన్ సంతకం చేసిన 40 మందిలో కేజ్రీ కూడా వున్నాడు అని తెలిసాక, వాణ్ని యెప్పుడు తన్ని తగిలేస్తారో అనిపించింది.)

వాడంటున్న రక్త దాహం యెవరికో వాడు స్పష్టంగా చెప్పలేదు. మరి యెవరికనుకోవాలి మనం? రాష్ట్ర గవర్నరుకా? రాష్ట్రపతికా? విభేదించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం లోని న్యాయ మూర్తులకా? తరువాత శిక్ష ఖరారు చేసిన త్రిసభ్య ధర్మాసనానికా? న్యాయప్రక్రియ పూర్తిగా నెరవేరాలనే వుద్దేశ్యంతో చరిత్రాత్మకంగా, తెల్లవారు జామున కోర్టు తలుపులు తెరిపించి మరీ అప్పీలు విని, వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన న్యాయ మూర్తులకా? యెవరికి రక్తదాహం?

257 మందిని చంపినవాడికి, ఇంకో 758 మందిని చంపాలనిచూసి, గాయపరచి వదిలినవాడికీ ఉన్నది రక్తదాహం కాదేమో మరి వీడి దృష్టిలో!

నన్నడిగితే, ఆ సంతకాలు చేసిన 40 మంది కన్నా దేశద్రోహులు, తీవ్రవాదులూ యెవరు? వాళ్లకి, అవసరమైతే ప్రత్యేక రాజ్యాంగ సవరణ చేసైనా, దేశ బహిష్కరణ శిక్ష విధించాలి. అప్పుడుగానీ వాక్ స్వాతంత్ర్యానికి వున్న సరైన విలువ తెలియదు వాళ్లకి.

యేమంటారు?

Wednesday, December 24, 2014

"అప్పనంగా" 28,000 కోట్లు......!

.......మరో కుంభకోణం....?!

దేశం లోని 9 జాతీయ రహదారుల్లో, జాతీయ రహదారుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌ హెచ్ ఏ ఐ), యెక్కువ "టోల్ సుంకం" వసూళ్ల ద్వారా, 28,000 కోట్లు రిలయన్‌స్ ఇన్‌ఫ్రా, ఎల్ అండ్ టీ, ఐ ఆర్ బీ వంటి సంస్థలకి అక్రమ లాభం కట్టబెట్టింది అని కాగ్ ప్రకటించిందట! 6 లేన్ల ప్రాజెక్టులు మూడింటిలో, ఇంకా ప్రాజెక్టు మొదలు కాకముందే, వసూళ్లు మొదలు పెట్టి, 902.98 కోట్లు వాళ్లకి కట్టబెడితే, రిలయన్‌స్ వాళ్ల వసూళ్లని తమ సొంత మ్యూచువల్ ఫండ్ కి బదిలీ చేసిందట!

అసలు ఇలాంటి పీ పీ పీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్‌) క్రింద, బీ ఓ టీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్‌స్‌ఫర్) ప్రాతిపదిక మీద అభివృధ్ధి చేయడం అనే పధ్ధతిని, వాజపేయీ ప్రారంభించాడు. స్వర్ణ చతుర్భుజి పథకం అలా సాకారమయ్యిందే! (ఇందుకు ఆయన్ని విమర్శించినవాళ్లూ, ఇప్పటి అక్రమాలకి ఆయనే కారణం అనే వాళ్లూ వున్నారు). 

అప్పట్లో ప్రాజెక్ట్ వ్యయాన్నీ, దాంట్లో ప్రభుత్వ వ్యయాన్నీ, గుత్తేదారు పెట్టుబడినీ, వాళ్ల లాభాన్నీ, రాబోయే ఆదాయాన్నీ ఖచ్చితంగా అంచనా వేసి, యెన్నేళ్లు టోల్ సుంకం వసూలు చేసుకోవచ్చో నిర్ణయించేవారు. అప్పట్లో ఇన్ని లక్షల ప్రైవేటు వాహనాలు కూడా లేవు. తరువాత కొన్ని లక్షల సంఖ్యలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి అన్నిరకాల వాహనాలూ. (టోల్ గేట్ల ముందు నిరీక్షించే వాళ్లందరికీ తెలుసు ఆ సంగతి.......సుంకం యెంత వసూలు అవుతుందో వేచి చూస్తున్న కార్ల, ఇతర వాహనాల ని బట్టి ఊహించి ఆశ్చర్యపోతూ వుంటారు చాలా మంది).

మరి, ఇప్పుడు ఆ రహదార్ల విస్తరణా, ఇతర రహదార్ల నిర్మాణం వగైరాలకి విపరీతమైన అంచనాలు రూపొందించి, టోల్ వసూలు హక్కు (ఇదివరకు 25 యేళ్లకి మించి యెక్కడా లేదు) 33 యేళ్లకీ, 50 యేళ్లకీ, ఇంకా యెక్కువకీ పెంచేస్తున్నారు! పైగా, టోల్ వసూలు మొదలు పెట్టిన కొన్ని సమ్‌వత్సరాల వరకూ ప్రాజెక్టు పూర్తి కావడం లేదు! 

మరి ఇదంతా అక్రమం కాదూ?

ఈ కుంభకోణం లో యే పెద్ద తలకాయలు రాల్తాయో? 

ప్రభుత్వం సత్వర చర్య తీసుకోవాలి!

Monday, April 21, 2014

సమాచార హక్కు


సిగ్గులేని నాయకత్వం 

మన రాష్ట్రం లో స హ చట్టం ప్రకారం దరఖాస్తులకి తెలుగులోనే సమాధానం ఇవ్వాలి.....సమాచారం ఆంగ్లం లో వుంటే అనువదించి మరీ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం తీర్పు.

కానీ, రాయలసీమ విశ్వవిద్యాలయానికి సంబంధించి దరఖాస్తు చేస్తే, సమాచారం 70 వేల పేజీలు వుంది అనీ, పేజీ కి రూ. 2/- చొ.న. ఓ లక్షా నలభైవేలూ, అనువాదానికి ఖర్చులుగా రూ. 2 లక్షల పది వేలూ, వెరసి మూడున్నర లక్షలిస్తే సమాధానం ఇస్తామన్నారట అధికారులు.

నడివీధిలో కొరడాదెబ్బలు కొట్టాలని శిక్ష వేయద్దూ వాళ్లకి?

పార్లమెంటు లో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయా శాఖల మంత్రులు, చర్య తీసుకుంటామని ఇచ్చిన హామీలని నిర్దిష్ట గదువులోగా నెరవేర్చాలి. అవి నెరవేరేలా చూడ్దానికి ఓ సభాసంఘం వుంటుంది. కానీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం అలాంటి హామీలు 2,812 బుట్టదాఖలు చేశారట. ఇంకో 299 మాటలను వెనక్కి తీసుకున్నారట!

ఈ ప్రభుత్వ పార్టీ యేమో, 2004, 2009 యెన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ కాకపోయినా, అత్యధికం నెరవేర్చాం అంటు సిగ్గులేకుండా డబ్బా కొట్టుకొంటోంది!

సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ప్రమేయం వుందనే ఆరోపణలున్న ఓ భూకుంభకోణం పై సమాచారం అడిగితే, ప్రథానమంత్రి కార్యాలయం యేకంగా గుండెలు బాదేసుకుందట--సమాచారం అడగడం చట్ట విరుధ్ధం; చట్టాన్ని దుర్వినియోగ పరచడం; చట్టాన్ని అపహాస్యం చెయ్యడం--అంటూ!

పెద్దింటి అల్లుడి గురించి అడగడం మాహా పాపం అన్నట్టు తేల్చారట.....పీ ఎం ఓ ఉపకార్యదర్శి తన 15 పేజీల లేఖలో!

సమాచార హక్కు చట్టం మేమే తెచ్చాము అన్న వెయ్యేళ్లు ధనంతో వర్థిల్లాలి అనుకొనేవాడు ముఖం యెక్కడ పెట్టుకోవాలో మరి?

మూడేళ్ల క్రితం, ఒత్తిడి పెరుగుతూండడంతో, కేంద్ర ప్రభుత్వం దేశ విదేశాల్లో మన వాళ్ల నల్లధనం యెంతో తేల్చమని మూడు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలని ఆదేశించి, 18 నెలల గడువు ఇచ్చిందట.

ఆ విషయం లో యేం జరిగింది అని స హ దరఖాస్తు చేస్తే, ఒక్క సంస్థ మాత్రమే నివేదిక ఇచ్చింది అనీ, దాన్ని పరిశీ........లించి, చర్యలు తీసుకోవాలి కాబట్టి, ఆ నివేదిక నకలు ఇవ్వలేము అనీ చెప్పారట అధికారులు. మిగిలిన రెండు సంస్థలూ ఇంకా యెన్నాళ్లు గోళ్లు కొరుక్కుంటూ వుంటాయో?

అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నది మా ప్రభుత్వం మాత్రమే అంటూ స్వకుచమర్దనం చేసుకుంటున్న వె ధ వ ..............?!

మొదణ్నించీ చెపుతున్నాను ఆథార్ పెద్ద కుంభకోణం అని.......

నందన్‌ నీలేకణి ని ఆథార్ ఛైర్మన్‌ గా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ప్రతి, ఆయన రాజీనామా పత్రం నకలు, ఆయన పదవిలో వున్నప్పుడు ప్రథానమంత్రి కార్యాలయం తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ప్రతులను అడుగుతూ సహ దరఖాస్తు చేస్తే, దాన్ని సెక్షన్‌ 6 (3) క్రింద యెన్నికల సంఘానికి బదిలీ చేశారట!

గోకులాష్టమికీ, పీరు సాయిబ్బుకీ సంబంధం యేమిటో మరి!

ఇలాంటివన్నీ బయట పెడితే, అసలు రహస్యాలు బయటపడతాయని భయపడుతున్నారు అని తేట తెల్లం అవడం లేదూ?

ఇంక స హ చట్టం తెచ్చింది మేమే అని బుకాయించడం మానేస్తారా......వె ధ వ లు?

గత పదేళ్లలో ప్రథాని 1110 సార్లు నోరు విప్పారని చెప్పారట....అంటే నెలకో పది సార్లకన్నా తక్కువే! ఆ సందర్భాలు కూడా విదేశాల్లోనో, ఇంకెక్కడో అగ్రరాజ్యాలని దేబిరించడం, తనేదో అంతరిక్ష రాజ్యానికి అధిపతినన్నట్టు....... ప్రభుత్వం ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి......అని చెప్పడానికేనమ్మా! మహగొప్ప నికమ్మా!

అదే 2009-14--ఐదేళ్లలో, స్పీకర్ మీరా కుమార్ (1977 లోఇందిరాగాంధీ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి, "సింహాసనం అదిరింది" అని ప్రకటించిన మహానుభావుడు బాబూ జగజ్జీవనరామ్ కుమార్తె ఈమె) తన తండ్రీ, తన నియోజకవర్గం బీహార్ లోని ససారమ్‌ లో కేవలం 58 రోజులు మాత్రమే గడిపారట.

దాహంతో గొంతెండిపోయే ప్రజలకి చేసిందేమీ లేదుగానీ, అదే సమయం లో 178 రోజులు విదేశాల్లో వున్నారట! (ఇవీ స హ చట్టం ప్రకారం బయటకి వచ్చినవే!)

మరి ఆ ప్రజలు మళ్లీ ఆవిడకి ఓట్లు వేస్తారంటారా?

Monday, March 3, 2014

విసుర్లు........


............తగిలేనా?!

మొన్నో రోజు పేపర్లో, ఒకాయన ఆధ్యాత్మిక వ్యాసం వ్రాస్తూ, రామకృష్ణ పరమహంస గా ప్రసిధ్ధి చెందినాయన, కాళికాలయం లో పూజారిగా పనిచేస్తూ, ఓ రోజున ఓ యోగి ఆకాశ మార్గాన ప్రయాణించడం, అయన వెనకే ఓ హంస యెగురుతూ వెళ్లడం చూసి, తాను కూడా అలా యెగిరి వెళ్లిపోతే బాగుంటుందనుకున్నాడట అనీ, తరువాత ఓ రోజు, కాళికామాత పాదాల దగ్గర ఆ హంసని చూసి ఆశ్చర్య పోయాడనీ, అక్కణ్నించి "పరమ హంస" అనే పేరు "తనకి తానే" పెట్టుకున్నాడనీ సెలవిచ్చారు. (నిజానిజాలేమిటో నాకు తెలీదు కానీ, ఆయన ఆధ్యాత్మిక పాండిత్యానికి అందరూ సంతోషించాలి.) 

ఇంతకు ముందు, ఓ సారి, విష్ణుచిత్తుడికి ఓ పాప దొరికితే, "శూడిక్కుడుత్త నాచ్చియర్" అని పేరు పెట్టుకొని పెంచాడని వ్రాసిందీ ఈ మహాను భావుడే. 

పత్రికవాళ్లు వీటిని ప్రచురించడం మాత్రం అత్యంత ముదావహం. 

ముదావహం అంటే గుర్తొచ్చింది..........

మా మునిసిపల్ ఛైర్మన్‌ ఒకాయన వుండేవారు. ఆయన ఉపన్యాసాలలో పదాలని వాడడం లో నిరంకుశుడు. (నిరంకుశాః కవయః అన్నారు).

ఘంటసాల కి సన్మానం చేస్తూ, ఆ సభాధ్యక్షుడిగా ఈయన "ఈయనెవరనుకున్నారు? మన సినిమాల్లో నాగేశ్వర్రావూ, రామారావూ పాటలు బలే పాడేస్తున్నారని మీరనుకుంటారు. కానీ వాళ్లతోపాటు యస్వీ రంగారావుకీ, సావిత్రీ వాళ్లక్కూడా పాటలు పాడేది ఈయనే!" అనెయ్యగానే, తరువాత మాట్లాడినాయన, "నిజమే, మాయాబజార్ లో సావిత్రిక్కూడా పాడారు" అని సమర్థించవలసి వచ్చింది. హాస్యం మాత్రం బాగా పండిందనుకోండి. 

ఆయనే పోలీసుకాల్పుల్లో ఓ వ్యక్తి మరణించినప్పుడు ఆవేశంగా 'తుపాకీ' వారి 'సీ ఆర్ పీ గుళ్లకి' నా ప్రజలు ఇలా బలై పోవడం చాలా 'ముదావహం'.......ఇలాంటి ముదావహాలు ఇకముందు జరిగితే యేమాత్రం సహించడానికి 'సంకోచించం' అంటూ, "పావుగంటలో 16 ముదావహాలు వేశాడు" అన్నాడు మా కృష్ణమాచారి. (ఈ కృష్ణమాచారి కృష్ణం రాజు సినిమా కృష్ణవేణి లో ఓ మంచి పాత్ర వేసి, డ్యాన్‌సుల్లో కూడా పాల్గొన్నాడు). 

అలా వుంటాయి.

మా భాషా, సాహిత్య, చరిత్ర నిపుణుడైన  మిత్రుడికి యే విషయమైనా మూలాల్లోకి వెళ్లి శోధించి, దాని వ్యుత్పత్తి యెలా జరిగిందో కనిపెట్టి, అందరికీ చెప్పడం ఓ సరదా. (ఈ విషయం లో మోడీ కన్నా తనకి కొంచెం యెక్కువే తెలుసు అని చెప్పుకుంటున్నాడీ మధ్య).

ప్రపంచ ప్రఖ్యాత రష్యన్‌ నాయకుడు లెనిన్‌ పూర్తి పేరు, అసలు పేరు, దాని అర్థం యేమిటో తెలుసా అని ప్రశ్నించి, యెవరూ సాహసం చెయ్యకపోవడంతో తనే చెప్పాడిలా--పూర్తి పేరు వ్లాడిమిర్ ఇల్ ఇచ్ లెనిన్‌. అసలు పేరు వ్లాడిమిర్ ఇల్ ఇచ్ ఉల్యనోవ్. అంటే అర్థం--వాళ్ల భాషలో వ్లాడ్ అంటే గోక్కోవడం. వ్లాడి అంటే గోక్కోవలసిన. మిర్ అంటే బాగా. వ్లాడిమిర్ అంటే బాగా గోక్కోవలసిన. ఇల్ అంటే చెడ్డదైన ఇచ్ అంటే దురద. ఉల్యనోవ్  అంటే ఉద్దీపింప చేసేవాడు అని. అంటే పూర్తిగా, బాగా గోక్కోవలసిన చెడ్డ  దురదని ఉద్దీపింప చేసేవాడు. అంటే, బాగా పెంచేవాడు. లేదా విజృంభింప చేసేవాడు అని. 

చూశారా యెంత చక్కటి పాండిత్యమో!