Saturday, December 17, 2016

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......3

"....క్యూలలో సామాన్యులు కష్టాలు పడుతున్నారు!"

(నిన్నటి టపా తరువాయి)

అదికూడా బ్యాంకు పై అధికారుల తప్పిదమే. వాళ్లు జవాబు చెప్పాల్సి వస్తుంది.

తరువాత, బ్యాంకులకి 2000 నోట్లు వచ్చినా, వాటిని నోట్ల బదిలీ కి మాత్రమే వాడుకున్నారు ....నాలుగైదు రోజులదాకా. 100 నోట్లు రాగానే, కొన్ని బ్యాంకులు ఏటీఎం లలో పెట్టాయి. కానీ, అందరూ....2000 నోట్లకి చిల్లర దొరకడం లేదు అంటూ, 1900 చొప్పున తీసుకోవడం మొదలెట్టారు. చాలా తక్కువ సమయం లోనే, అవన్నీ ఖాళీ!

తరువాత, మళ్లీ కొత్త నోట్లు వచ్చినా, బ్యాంకుల వద్ద క్యూలు తగ్గలేదు. 

బ్యాంకు అధికారులు, స్వంత నిర్ణయాలు తీసుకొని, "వారానికి ఒక్కొక్కళ్లూ 24 వేలు తీసుకోవచ్చు" అన్నా, 'అందరికీ సమానంగా పంచుతాం' అంటూ, ఒక్కొక్కళ్లకీ 6000 చొప్పునో, 4000 చొప్పునో, 2000 చొప్పునో సరిపెట్టడం మొదలెట్టారు. అలా కాకుండా, ఖాతా లోంచి నగదు ఉపసంహరించే వాళ్లు  ఒక్కొక్కళ్లకీ 24 వేల వరకూ, వాళ్లు అడిగినంత ఇచ్చేసి ఉంటే, ఎక్కువ నగదు--తక్కువ సమయంలో చెలామణీ లోకి వచ్చేది! 

నగదు లేదు కాబట్టి, క్యూలు ఉండేవి కాదు! అదీ తప్పిదం.

19 వ తేదీ నాటికి అదీ పరిస్థితి. 

అప్పటికి కూడా, అదే పధ్ధతి అనుసరిస్తూ, క్యూలలో ఉన్నవాళ్లకి ఒక్కొక్క 2000 నోటు ఇస్తుంటే, కుటుంబం లో అందరూ క్యూలలో నుచొని, ఒక్కొక్కళ్లూ రెండేసి వేలు తీసుకొని, ఇంట్లో దాచుకోవడం మొదలెట్టారు!

20 న సెలవు తరవాత, 21 నుంచి ఇంకా క్యూలు పెరిగాయి! 

కొన్నిచోట్ల బ్యాంకుల వాళ్లతో గొడవ పెట్టుకోవడం మొదలయ్యింది. అయినా, అధికారులు.....అదే పధ్ధతి లో వచ్చిన కొత్తనోట్లు పంచిపెట్టేసి, "నగదు లేదు" అని బోర్డులు పెట్టెయ్యమని "ఆదేశాలు" ఇచ్చారు. 

ఓ జిల్లాలో బ్యాంకు శాఖలన్నింటికీ అధికారి (జోనల్ మేనేజరు)..... "నగదు లేదు అని బోర్డులు పెట్టెయ్యండి. బందోబస్తు అవసరమైతే, నాకు ఫోను చెయ్యండి. నేను డీ ఎస్ పీ తో మాట్లాడి, పోలీసులని ఏర్పాటు చేస్తాను" అని శాఖాధికారులకి చెప్పాడంటే, అది సబబేనా?

కొన్ని బ్యాంకుల ఏటీఎం లు 2000 నోట్లు వితరణ చేసేలా మార్చబడ్డాయి. వాటిలో, వచ్చిన నగదులోనే కొంత పెట్టగానే, అక్కడ క్యూలు ఏర్పడి, నగదు ఖాళీ అవగానే, ఇంకో ఏటీఎం వెతుక్కునేవాళ్లు వెళ్లిపోతే, ఇంకొంతమంది, మళ్లీ పెట్టకపోతారా అనే ఆశతో అక్కడే క్యూల్లో నిలబడేవారు! 

25 వ తేదీ వరకూ అదే పరిస్థితి.....బ్యాంకులముందు క్యూలు, ఏటీఎం ల ముందు క్యూలు. (కొన్ని బ్యాంకులనుంచి--ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులలోంచి, పెద్ద సంఖ్యలో 2000 నోట్లు ప్రక్కదారి పట్టడం మొదలయ్యింది.)

26, 27 సెలవులు రాగానే, "అలసిన బ్యాంకు సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్నారు" అని ప్రకటించేశాయి పత్రికలూ, టీవీలూ. 

28 న మళ్లీ నగదు వచ్చినా, బ్యాంకుల్లో 4 వేలు చొప్పునో, 2 వేలు చొప్పునో సరిపెట్టడం మానలేదు! మళ్లీ క్యూలు. 

1వ తేదీకి, అల్లకల్లోలం మొదలయ్యింది. అటు జీతాలూ, ఇటు పించన్లూ, మామూలుగా బ్యాంకుల్లో ఇస్తున్నవి కాకుండా, సామాజిక పించన్లు కూడా బ్యాంకుల్లో వేయించారు! నగదు సరఫరా యేమీ పెరగలేదు.

ఈ సామాజిక పించన్లు అసలు వచ్చాయో లేదో అనీ, వస్తే ఏ బ్యాంకులో జమయ్యాయో అనీ, ఎప్పుడు-ఎంత ఇస్తారు అనీ, వృధ్ధులూ, వికలాంగులూ సైతం ఎండల్లో, ఉదయం నుంచీ సాయంత్రం వరకూ అష్టకష్టాలు పడినా, చాలామందికి నిరాశే ఎదురయ్యింది. 

మళ్లీ బ్యాంకులు "పించన్ దారులకి 6 వేలు మాత్రమే ఇస్తాము" అని బోర్డులు పెట్టారు. అలా చెయ్యకుండా, ఉన్న నగదుని, 24 వేల లోపు, అడిగినవాళ్లకి అడిగినంత ఇచ్చేసి చేతులు దులుపుకుంటే, మళ్లీ చెలామణి లో నగదు పెరిగేది!

(......మరోసారి)

(మిత్రుల ఆదేశం పై నా టపాలు బ్లాగ్ లో కూడా ప్రచురిస్తున్నాను. ఇంతకు ముందు వ్రాసిన 2 భాగాలు ఈ క్రింది లింకు లో చదవచ్చు) 

https://www.facebook.com/groups/1311091748908538/


4 comments:

 1. ఫేస్ బుక్కు మొహం చూడనివాళ్ళు, చూడాలన్న ఉత్సాహం లేనివాళ్ళం చాలామందే ఉన్నామండి! :)

  ReplyDelete
  Replies
  1. బ్లాగుల్ని చదివేవాళ్లు పూర్తిగా మానెయ్యలేదు అని నిర్ధారణ అయ్యింది. చాలా సంతోషం శర్మగారూ!

   Delete
 2. థాంక్స్ కృష్ణ శాస్త్రి గారూ బ్లాగులో కూడా ప్రచురించినందుకు మా విన్నపంపై (మీరన్నట్లు "ఆదేశం" ఎంతమాత్రం కాదు).

  ReplyDelete
  Replies
  1. మీ విన్నపాలనే, ఆదేశాలుగా శిరసావహించాను.....అని నా భావన!
   ధన్యవాదాలు!

   Delete