haaram logo

Sunday, February 23, 2014

మన బ్యాంకులూ........2


.........నిరర్ధక ఆస్తులూ

బ్యాంకు ఉద్యోగుల యూనియాన్లు మొదటినుంచీ ఆ విధానాలని వ్యతిరేకిస్తున్నాయి. కోట్లాది రూపాయలు బకాయి పడ్డవాళ్లని ఒదిలేసి, ప్రభుత్వమే వివిధ పథకాల క్రింద ఇప్పించిన చిన్న చిన్న ఋణాలమీద ప్రతాపం చూపించమనడం, వాళ్ల మీద చర్యలు తీసుకోవడం ఏమిటి అని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. విత్త మంత్రిగారేమో బ్యాంకుల లాభాలన్నీ ఉద్యోగుల జీతాలకే పోవాలా అంటున్నాడు. పెద్ద మొత్తాలలో ప్రభుత్వం వాటా డివిడెండ్ చెల్లించాలని బ్యాంకులని ఒత్తిడి చెయ్యడం, బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లని మసిపూసి మారేడు కాయ చెయ్య్డడం , మళ్లీ వాటి కేపిటల్ కోసం పెద్ద యెత్తున నిధులు విడుదల చేస్తున్నామని చెప్పుకోవడం--ఇదంతా ఓ పెద్ద విష వలయం.

ఫినకిల్ సాఫ్ట్ వేర్ లో లోపాలు ఉన్నాయని యునైటెడ్ బ్యాంకు చేసిన ఆరోపణలని వెనక్కి తీసుకున్నారని చదివాము. బహుశా ఇన్‌ఫోసిస్ వాళ్లు అదేమీ లేదు అని చెప్పారు కాబట్టీ, అన్ని బ్యాంకులూ అదే సాఫ్ట్ వేర్ వాడుతున్నారు కాబట్టీ కావచ్చు. కానీ, ఆ సిస్టమ్ లో నిరర్ధక ఆస్తుల గుర్తింపు కోసం అనేక పరామితులు (పెరామీటర్స్) నిర్దేశించడంతో ఆ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఉదాహరణకి రాబోయే కాలం లో NPA లుగామారే ఆస్కారం వున్న ఖాతాలని చూపించమంటే, ఆ Potential NPA రిపోర్టు (PNPA అంటారు) తయారవడానికే కొన్ని గంటల సమయం పడుతుంది. ప్రింటు పేజీలతరబడి వస్తూనేవుంటుంది. ఆ బ్రాంచి (ఫినకిల్ లో సోల్--Service Outlet) లో ఉన్న అన్ని ఋణ ఖాతాలనీ చూపిస్తుంది. ఆ రిపోర్టు ఆథారంగా యే ఖాతా యెందుకు NPA గా మారుతుందో తెలుసుకొని, తగిన చర్య తీసుకోవడం యే మానవ మాత్రుడికీ సాధ్యం కాదు. కనీస యేఖాతాలో యెంత వసూలు చేస్తే ప్రమాదం తప్పుతుందో కూడా చూపించదు. ఓ ఖాతాలో 10 కోట్లు బాకీ వుంటే, అంతా చూపిస్తుంది. కనీసం యేతేదీ నుంచి అది NPAగా మారుతుందో చూపించదు. ఇంకా ఋణ ఖాతాల వైవిధ్యం ప్రకారం అయినా (టెర్మ్ లోన్లు వేరే, గోల్డ్ లోన్లు వేరే.....ఇలా) చూపిస్తే, చాలా వెసులుబాటుగా వుంటుంది. (ఇప్పుడు ఇవి యేమైనా మార్చారో లేదో నాకు తెలియదు కానీ, మేనేజర్లు తమ కష్టం యేమీ తగ్గక పోగా పెరుగుతోంది అని వాపోతున్నారు).

మళ్లీ కొత్త బ్యాంకులు స్థాపిస్తామంటారు. ముత్తూట్ వగైరాలు కూడా వైట్ లేబెల్ ఏటీఎం లు ప్రారంభిస్తామంటారు. ఓ పక్క యెక్కువ లావాదేవీలు జరగని ఏటీఎం లని మూసేస్తామంటున్నాయి బ్యాంకులు. (వాటికి కూడా పనిచేయు వేళలు అని బోర్డులు తగిలిస్తారనుకొంటా!) ప్రభుత్వమేమో ఆథార్ కోసం మరిన్ని చోట్ల మరిన్ని ఏటీఎం లు తెరవాలి అంటుంది. ఇదంతా ప్రగతి లో భాగమేనేమో!

దానికన్నా బ్యాంకులని డీ నేషనలైజ్ చేస్తే యెలా వుంటుదో ఆలోచించాలి మేధావులు.


2 comments:

  1. మనమెటుపోతున్నామో మనకే తెలియని స్థితిలో ఉన్నాం !భగవంతుడే మనల్ని కాపాడాలి !!

    ReplyDelete
  2. డియర్ శాస్త్రిగారూ!

    భగవంతుడి దాకా అఖ్ఖర్లేకుండా వచ్చే ప్రభుత్వం యేమైనా చేస్తుందేమో చూద్దాం. ఆలాగే ఆశిద్దాం.

    ధన్యవాదాలు.

    ReplyDelete