haaram logo

Monday, September 28, 2015

శ్రవణ హింస-5


"భ్రష్ట భయంకర" సంగీతం-5

.......ఇంక ముగింపు.....

సామాన్యులకి ఈ హింస నుంచి విముక్తి యెలా?

1. అవేవో "అల్ట్రా సౌండ్" పరికరాలంటారు.....సినిమా పాటలని (ఆ మాటకొస్తే, యే సంగీతం, పాటలూ, ఉపన్యసాలూ, చివరికి యెలక్షన్ సమయం లో ప్రచారాలూ కూడా) అలా రికార్డు చేసి, అవి వినాలనుకునే వాళ్లకి ప్రత్యేక ఇయర్ ఫోన్ల ద్వారా మాత్రమే వినేలా యేర్పాటు చెయ్యాలి.

......ఇది జరిగే పని కాదు.

2. సినీ పాటల రచయితలు.....ముఖ్యంగా అనంత శ్రీరాం లాంటి యువకులైన  వాళ్లు.....ఇంగ్లీషు పదాలని పాటల్లో, పల్లవుల్లో చొప్పించడం మానెయ్యాలి. ర్యాప్ అవసరమనుకొంటే, అదీ తెలుగు లోనే వ్రాయాలి. చాలా మంది, యేదేదో అర్థం లేని మాటలు వరుసలకోసం వ్రాసేసి, ఇంత బాగా వ్రాశాం, అంత బాగా వ్రాశాం, అంటూ డబ్బా కొట్టుకొంటారు. అలాంటివి మానెయ్యాలి.

......ఇదీ సాధ్యం కాదు. "జనాలు అడిగే విధంగానే వ్రాస్తున్నాం"....అంటారు!

3. సంగీత దర్శకులు.....ఆ వూళలనీ, డప్పులనీ అంతంత యెక్కువ శబ్దంతో రికార్డు చేయడం మానెయ్యాలి. ఆ కేకలు మానెయ్యాలి.

......ఇదీ పై సూచన లాగే..... "జనాలు అడిగే....." అనే అంటారు!

4. ఇంక ప్రభుత్వాలు......వీటి చేతుల్లో అంతా వుంటుంది కానీ, యేమీ లేదు అన్నట్టే వుంటాయి.

యే పండుగ అయినా, ఇంకో ఫంక్షన్ అయినా, స్పీకర్లకి అనుమతులు ఇవ్వకూడదు. ఆ ఆవరణలో వున్నవాళ్లకు వినపడడానికి మాత్రమే సరిపోయే అంత సౌండ్ పెట్టుకోడానికే అనుమతులు ఇవ్వాలి. అదికూడా, నిర్ణీత సమయాలకే పరిమితం చేయాలి. 

ఇలాంటి వాటికి ప్రభుత్వం భద్రత పేరుతో ప్రజల ధనాన్ని ఇలా దుబారా చెయ్యడం మానెయ్యాలి.

అనుమతుల షరతులని ఉల్లంఘించేవాళ్లని నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి.

అందుకని, మనం చెయ్యవలసిందేమిటీ?

వచ్చే యే యెలక్షన్ లోనైనా, నిలబడే వాళ్లని, ఇలాంటి హామీ ఇవ్వాలి అనీ, వాటిని అమలు చెయ్యాలి అనీ, నిలదీసి, అలాంటివాళ్లకే వోట్లు వెయ్యాలి.

ఈ విషయాల్లో, యే మతానికీ, యే కులానికీ, యే వర్గానికీ మినహాయింపు వుండకూడదు!
అలా వాగ్దానం చేసేవాళ్లని, అన్ని మతాల, కులాల, వర్గాల వాళ్లూ అంగీకరించి, వాళ్లకే ఓట్లూ వేసేలాగ కృషి చేస్తాము అని హామీ ఇవ్వాలి మనం!

అలాగే, మీడియా పాత్ర చాలా ముఖ్యం.....పోటీలు పడి పేపర్లలోనూ, టీవీల్లోనూ, ఇలాంటివాటిని ప్రచురించడం మానెయ్యాలి. కనీసం వార్తల ఛానెళ్లలోనైనా, "వార్తలకి మాత్రమే" పరిమితమైతే అందరికీ మంచిది!
 అదీ పరిష్కారం.....ఇలాంటి జాడ్యాలన్నింటికీ!

(ఇప్పటికి ఇంతే)

7 comments:

  1. '...మీడియా పాత్ర చాలా ముఖ్యం......' బాగున్నది మీ "ఆశ". ఆయనే ఉంటే అన్న చందాన, మీడియాకి బుద్ధి అనేది ఉంటుంది అన్న విషయం అవగతం అవ్వాలికదా. వాళ్ళ మామూలు కార్యక్రమాలు ఒక సౌండ్ లో, వ్యాపార ప్రకటనలు ఎక్కువ సౌండ్ లో ప్రసారం చేసే మీడియా, ఈ శబ్ద కాలుష్యం గురించి పట్టించుకుంటుందా. నేను హైదరాబాదు అశోక నగర్లో ఉన్నప్పుడు ఒక కమ్యూనిస్టు పత్రిక ఆఫీసు మా ఖర్మకాలి మా పక్క ఇంట్లోకి అద్దెకి దిగారు. కరెంటు పోయినప్పుడల్లా వాళ్ళు జెనరేటర్ ఆన్ చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నిద్ర పాడిచేసేవారు. చివరకునేను పోలీసు కంప్లైంట్ ఇవ్వవలసి వచ్చింది, కాని ఆ పత్రిక వాళ్ళు ఎంతో "సివిక్ సెన్స్" తో పోలీసులను మానేజి చేసి శబ్ద కాలుష్యం కొనసాగించారు.

    ReplyDelete
  2. శివ గారూ.....నిజాలు చెప్పారు. చాలా సంతోషం.

    ReplyDelete
  3. శ్రవణేంద్రియాల మీద మరో దాడికి గురవ్వడానికి సిద్ధపడాలి కదా - దసరా మొదలయిందిగా :(
    ఒకప్పుడు సినిమాహాలు దగ్గర సాయంత్రం ఫస్ట్ షో సమయానికి మాత్రమే మైకులో పాటలు పెట్టేవారు. ఇప్పుడు సమయం సందర్భం ఏదయినా పాటలే పాటలు.

    శాస్త్రి గారూ, మీరు సూచించిన పరిష్కారాలు 1,2,3 పనిచెయ్యవని మీరే ఒప్పుకున్నారు. ఇక నాలుగోది "ఆయనే ఉంటే ......" అనే సామెతకి సరిపోతుందేమో? అలాగే రాజకీయ నాయకుల ఎన్నికల వాగ్దానాలు నీటిమీద వ్రాతలే కదా. కోర్టుని ఆశ్రయించడమే దిక్కులా తోస్తోంది. కోర్ట్ ఉత్తర్వులని కూడా పెద్దగా ఖాతరు చెయ్యవు మన ప్రభుత్వ శాఖలు.

    శ్రవణహింస పలురకాలు, మీకు తెలుసు కదా. మీరు చెప్పిన వాటితో బాటు మరొకటి కూడా ఉంది(బహుశా మన వైపులకి కూడా ప్రాకిందేమో). అదే ఆటోల వాళ్ళు బిగ్గరగా పాటలు పెట్టడం. వాళ్ళు ఆటో ఆపుకుని కూర్చున్నా, ఖాళీగా రోడ్డు మీద పోతున్నా ఈ భయంకరమయిన శబ్దకాలుష్యం చేస్తూనే ఉంటారు, తల బద్దలవాల్సిందే. ట్రాఫిక్ పోలీస్ ద్వారా దీన్ని నివారించమని పోలీస్ కమీషనర్ గారికి నేను ఈమెయిల్ పంపించాను - కనీసం acknowledgement కూడా రాలేదు. న్యూస్ పేపర్కి "లెటర్స్ టు ది ఎడిటర్" కి వ్రాశాను - ప్రచురించలేదు.
    అలాగే బస్సుల్లో (రైళ్ళల్లో మరీ ఎక్కువ) సెల్ ఫోనులో పాటలు గట్టిగా పెట్టే ప్రయాణీకులు. ఈ మధ్యకాలంలో ఈ వేలంవెర్రి (న్యూసెన్స్ అనాలి) బాగా పెరిగిపోయింది. దీన్ని అరికట్టడానికి - ఇయర్ ఫోన్స్ పెట్టుకోమని, అవి లేకపోతే పాటలు ఆపు జేసెయ్యమని పట్టుబట్టేటందుకు - కండక్టర్లకి అధికారికంగా బాధ్యత ఇవ్వమని RTC వారికి వ్రాసాను. ఉహూ, స్పందన లేదు.
    < "ఇప్పుడు ఆడవాళ్లూ మగవాళ్లూ కూడా, పాడడమే "గొంతుచించుకొని" మరీ పాడుతున్నారు" అని మీరు అచ్చెరువొందారు (" "భ్రష్ట భయంకర" సంగీతం-2 " టపాలో). దాన్ని "ఎనర్జీ లెవెల్స్" అంటారట - మన ప్రసిద్ధ గాయనీ గాయకులు టీవీ పాటల పోటీల్లో జడ్జిలు గా కూర్చున్నప్పుడు తరచూ చేసే వ్యాఖల్లో ఇది ప్రముఖమయినది. గొంతు చించుకుని పాడినవారికి "ఎనర్జీ లెవెల్" బాగా ఉన్నట్లు లెక్క(ట).
    అదే టపాలో < "బాగున్నట్టుందే....అనుకున్నంత సేపు పట్టలేదు....ర్యాప్ లో దిగిపోయింది! యెంతో ప్రశాంతతకీ, దేశభక్తికీ ప్రతీకలైన "శాంతినికేతన్", "సబర్మతీ" లాంటి మాటలని కూడా..... " అని కూడా మీరు బాధపడ్డారు. అయ్యా శాస్త్రుల వారూ, గాయత్రీమంత్రాన్నే ర్యాప్ లాగా పాడుతున్నారు, ఇక మీరు చెప్పినవి వాళ్ళకో లెక్కా?
    ఇక బోర్ వెల్ వేసేవాళ్ళ హింస చెప్పక్కరలేదు. ఆ పని రాత్రి పది గంటల తర్వాతే మొదలుపెడతాడు సాధారణంగా, అదేవిటో! పోలీసులకి చెప్తే "పాపం నీళ్ళ కోసం బోర్ తవ్వించుకుంటున్నాడు కదా, కొంచెం "అడ్జస్ట్" చేసుకోండి" అని సలహా!
    కస్టమర్లని ఆకర్షించడానికి దుకాణాల వాళ్ళు కూడా మైకులు పెట్టి పెద్దగా పాటలు పెట్టడం కూడా కామన్ అయిపోయింది.

    విచ్చలవిడితనం పెచ్చుమీరిపోయి, ఎదుటివాడంటే లెక్కలేక, ఇష్టారాజ్యంగా గూండారాజ్యంగా తయారయిన సమాజంలో / కాలంలో బ్రతుకుతున్నాం. భరించక తప్పడం లేదు. కానీ మనకు తెలియకుండానే మన ఆరోగ్యం మీద దెబ్బ తీస్తున్నాయి ఈ ధ్వనులు.
    (మీ "శ్రవణ హింస" టపాల సీరీస్ చదివినప్పుడు అనుకున్నాను నా అభిప్రాయంతో వ్యాఖ్య వ్రాయాలని. ఇప్పటికి కుదిరింది.)

    ReplyDelete
  4. చాలా సంతోషం విన్నకోటవారూ! ఇప్పుడే ఫేస్ బుక్ లో మీ వ్యాఖ పోస్ట్ చేశాను.....ఇతరుల స్పందన కూడా కోరుతూ....అఫ్ కోర్స్, మీకు అభ్యంతరం వుండదనే నమ్మకం తోనే....

    ReplyDelete
    Replies
    1. "నాట్ ది స్లైటెస్ట్ అబ్జక్షన్, అనగా యంతమాత్రం అభ్యంతరంలేదు."
      మంచి పని చేశారు, థాంక్స్ (నేను ఫేస్ బుక్ ఖాతాదారుడిని కాదులెండి).

      Delete
  5. మాస్టారూ, మీ బ్లాగ్ పోస్టులు, వాటికి వచ్చిన కామెంట్లు ఎక్కువగా "బ్లాగిల్లు" ద్వారా తెలిసేవి. ఇప్పుడు unfortunately "బ్లాగిల్లు" మూతపడినట్లే ఉంది. కావున మీ బ్లాగ్ విశేషాలు తెలుసుకోవడానికి పాఠకులకి కాస్త సౌకర్యంగా ఉండేందుకు మీరు మీ బ్లాగుని, దాంట్లోకి వచ్చే కామెంట్లని "మాలిక" లాంటి సంకలినికి అనుసంధానం చేస్తే బాగుంటుంది కదా? ఇది ఓ suggestion మాత్రమే, ఆలోచించండి. Thanks.

    ReplyDelete
  6. ఏం శాస్త్రుల వారూ, దాదాపు రెండు నెలలై పోయింది మీ "విసుర్లు" చూసి. అంతా కుశలమే అని ఆశిస్తాను.

    ReplyDelete