.......మరో కుంభకోణం....?!
దేశం లోని 9 జాతీయ రహదారుల్లో, జాతీయ రహదారుల అభివృధ్ధి సంస్థ (ఎన్ హెచ్ ఏ ఐ), యెక్కువ "టోల్ సుంకం" వసూళ్ల ద్వారా, 28,000 కోట్లు రిలయన్‌స్ ఇన్‌ఫ్రా, ఎల్ అండ్ టీ, ఐ ఆర్ బీ వంటి సంస్థలకి అక్రమ లాభం కట్టబెట్టింది అని కాగ్ ప్రకటించిందట! 6 లేన్ల ప్రాజెక్టులు మూడింటిలో, ఇంకా ప్రాజెక్టు మొదలు కాకముందే, వసూళ్లు మొదలు పెట్టి, 902.98 కోట్లు వాళ్లకి కట్టబెడితే, రిలయన్‌స్ వాళ్ల వసూళ్లని తమ సొంత మ్యూచువల్ ఫండ్ కి బదిలీ చేసిందట!
అసలు ఇలాంటి పీ పీ పీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్) క్రింద, బీ ఓ టీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్‌స్‌ఫర్) ప్రాతిపదిక మీద అభివృధ్ధి చేయడం అనే పధ్ధతిని, వాజపేయీ ప్రారంభించాడు. స్వర్ణ చతుర్భుజి పథకం అలా సాకారమయ్యిందే! (ఇందుకు ఆయన్ని విమర్శించినవాళ్లూ, ఇప్పటి అక్రమాలకి ఆయనే కారణం అనే వాళ్లూ వున్నారు).
అప్పట్లో ప్రాజెక్ట్ వ్యయాన్నీ, దాంట్లో ప్రభుత్వ వ్యయాన్నీ, గుత్తేదారు పెట్టుబడినీ, వాళ్ల లాభాన్నీ, రాబోయే ఆదాయాన్నీ ఖచ్చితంగా అంచనా వేసి, యెన్నేళ్లు టోల్ సుంకం వసూలు చేసుకోవచ్చో నిర్ణయించేవారు. అప్పట్లో ఇన్ని లక్షల ప్రైవేటు వాహనాలు కూడా లేవు. తరువాత కొన్ని లక్షల సంఖ్యలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి అన్నిరకాల వాహనాలూ. (టోల్ గేట్ల ముందు నిరీక్షించే వాళ్లందరికీ తెలుసు ఆ సంగతి.......సుంకం యెంత వసూలు అవుతుందో వేచి చూస్తున్న కార్ల, ఇతర వాహనాల ని బట్టి ఊహించి ఆశ్చర్యపోతూ వుంటారు చాలా మంది).
మరి, ఇప్పుడు ఆ రహదార్ల విస్తరణా, ఇతర రహదార్ల నిర్మాణం వగైరాలకి విపరీతమైన అంచనాలు రూపొందించి, టోల్ వసూలు హక్కు (ఇదివరకు 25 యేళ్లకి మించి యెక్కడా లేదు) 33 యేళ్లకీ, 50 యేళ్లకీ, ఇంకా యెక్కువకీ పెంచేస్తున్నారు! పైగా, టోల్ వసూలు మొదలు పెట్టిన కొన్ని సమ్‌వత్సరాల వరకూ ప్రాజెక్టు పూర్తి కావడం లేదు!
మరి ఇదంతా అక్రమం కాదూ?
ఈ కుంభకోణం లో యే పెద్ద తలకాయలు రాల్తాయో?
ప్రభుత్వం సత్వర చర్య తీసుకోవాలి!