Friday, May 18, 2012

".......ఆచమానాలూ..............అవస్థలూ"

"కలలు బాగా కనండి......వాటిని సాకారం చేసుకోడానికి ప్రయత్నించండి" అని మన కలామ్ గారు తరచూ ఇచ్చే ప్రవచనం. (ఈయన మరోసారి మన రాష్ట్రపతి కావడంలేదు అని ఈపాటికి రూఢీ అయిపోయినట్టే!) 

(కానీ కలలు కనాలంటే నిద్రపోవాలనీ, నిద్రపట్టాలంటే కడుపు నిండుగా వుండాలి అనీ, "రోజుకి" 22/26 రూపాయలు "తిండీ, బట్టా, ఇతర అవసరాలకోసం" ఖర్చుపెట్టి, సుష్టుగా తిని పడుకొనే "ఆమ్ అద్మీ"కి ఇదెంతవరకూ సాధ్యం అనీ అడక్కండి!)

ఇలా వో సామాన్యుడు అద్భుతమైన కలకన్నాడు. విమానాల్లో "అద్భుతమైన" టాయిలెట్లు యేర్పాటుచేస్తారు. విమానం క్రిందికి దిగాక, ఆ వేస్ట్ ని టాంకు పళంగా తీసుకెళ్లి, ఇంకో టాంకులో పారబోస్తారు. (తరవాత దాన్ని రీసైకిలో యేదో చేస్తారట. ఈ సదుపాయం లేకపోతే అదేదో--పెద్దపులీ, గారెలూ కథలోలా--ప్రజలందరూ దాన్ని భరించే అగత్యం వచ్చుండేది!)

"ఇలాంటి" పర్యావరణ టాయిలెట్లనే మన రైల్వేలు అనుసరిస్తున్నాయట. (ఇన్ ఇండియా ఎవ్విరితింగ్ ఈజ్ ఓపెన్! అని మరిచి, కొన్ని కోట్లు ఖర్చుపెట్టేస్తున్నారు). ఇదో అద్భుతమైన వ్యాపార ఆలోచన!

ఇంక బస్సుల సంగతికి వస్తే, ఆర్ టీ సీ వారికి "బస్ స్టాండ్లూ"; "కాంప్లెక్స్ లూ" వున్నాయి. కొంతవరకూ సరే.

మరి, ప్రైవేటు బస్సులున్నాయి--కేశినేని, దివాకర్, కాళేశ్వరి.......ఇలా.....అన్నీ "లగ్జరీ; సెమీ లగ్జరీ; స్లీపర్; ఏసీ, నాన్ ఏసీ" వగైరా బస్సులని వేల సంఖ్యలో, కొన్ని రెట్ల సొమ్ము టిక్కెట్లగా వసూలు చేస్తూ, లాభాలు దండుకుంటున్నాయి. 

గతిలేక వీటిలో ప్రయాణాలు చేస్తున్నారుగానీ, ప్రయాణీకులు "కట్టు" కట్టగలిగితే......?

"వీటిల్లో ఆ పర్యావరణ టాయిలెట్లని యేర్పాటు చేస్తే వారిమీద పడే భారం యెంత"?

అక్కడిదాకా అఖ్ఖర్లేదు. బస్సులో అందరికీ "అరలీటరు" మినరల్ వాటర్ బాటిళ్లని "వుచితంగా" (టిక్కెట్టులోనే వాటి ధర కలిపేసుకొని) అందిస్తున్నారు. అలా ఇవ్వకపోతే యెవడేడిచాడు? కానీ "ప్రభుత్వ నిబంధన" అలా యేడిచిందట. 

తెల్లవార్లూ టీవీలో డీవీడీలు వెయ్యమని, నిద్రాభంగం చెయ్యమని, యెవడేడిచాడు? (డిటో). 

స్లీపర్లలో కొంచెం నయం. అవసరమైనవాళ్లే చూసేలా, ఇయర్ ఫోన్లతో యేర్పాటు చేస్తున్నారు.

రాత్రి భోజనాలకి అదేదో ముష్టి ధాబా దగ్గర ఆపుతాడు. ఓ పది నిమిషాల వ్యవధిలో ఓ ఐదారు బస్సులు అక్కడే ఆగుతాయి! మనం ముష్టివాళ్లలా, ప్లేట్లు చేత్తో పట్టుకొని, అంతకుముందే కవుంటర్లో డబ్బులిచ్చేసి, టోకెన్లు తీసుకొని, ఆ టిఫిన్ మాస్టర్ ముందు నిల్చుంటే, వాడి దయ కలిగినప్పుడు మనకి ఓ ప్లేటు ఇడ్లీయో, ఓ దోశో, ఓ చపాతీనో అనుగ్రహిస్తాడు (అవీ వుంటేనే!). మళ్లీ కాఫీ కావాలంటే, మళ్లీ టోకెన్, కాఫీ మాస్టర్ ముందు క్యూ! ఈలోగా బస్సు టైము అయిపోయిందని హారన్ లు! వేడితోనూ, కారం తోనూ కాలుతున్న మూతులతో అందరూ బస్సులోకి!

ఇంక ఈ బస్సుల్లో యెవరికైనా టాయిలెట్ అవసరం వస్తే, వాళ్ల అవస్థ వర్ణనాతీతం. స్పీడుగా వెళుతున్న ఆ బస్సులో, పడుతూలేస్తూ, డ్రైవర్ దగ్గరకి వచ్చి ఆపమని అడిగితే, వాడి షెడ్యూల్ ప్రకారం అప్పటికే కొంత లేటుగా నడుస్తూండడంతో (దారిలో లగేజీల లోడింగుకి కొన్ని పావుగంటలు గడిచిపోతాయి మరి!) "అలాగలాగే.....ఆగండి మరి......" అంటూ ఇంకో పది కిలోలు లాగించి, యెప్పుడో ఆపుతాడు!

ఇంక ప్రొద్దున్నే, అందరూ కాలకృత్యాలు తీర్చుకొనే వేళకి, వాడికి యెక్కడ "అనిపిస్తే" అక్కడ బస్సు ఆపేసి, అక్కడి ధాబాలో ఓ ఖాళీ వాటర్ బాటిల్ నింపుకొని, ఓపెన్ ఎయిర్ లోకి వెళ్లిపోతాడు. (అందరినీ అలాగే చెయ్యమంటాడు! తప్పనివాళ్లు యేమి చేస్తారు?) ఆ ధాబాలో టాయిలెట్లుంటాయి.....కానీ అన్నీ తాళం వేసి వుంటాయి!  యెలాగోలా బ్రష్ వగైరాలు చేసి, కాస్త కాఫీయో యేదో తాగుదామంటే, అక్కడ అవేవీ వుండవు. 

మళ్లీ బస్సెక్కి, యెప్పటికో గమ్యస్థానం!

వీటికి పరిష్కారమే--ఓ అద్భుతమైన వ్యాపార సూచన!

వేచి చూడండి మరి.  

2 comments:

 1. ఏ మొబైల్ టాయిలెట్‌ల లాంటివో చెబుతారా?

  ReplyDelete
  Replies
  1. డియర్ puranapandaphani!

   మీరన్నదీ ఓ అద్భుతమైన బిజినెస్ ఐడియానే. కానీ మన వెధవలు పర్యావరణం పేరుతో యే వూరిబయటో గానీ అవి నిలపకూడదంటే?

   ధన్యవాదాలు.

   Delete