haaram logo

Monday, February 27, 2012

ప్రభుత్వ 'క్రీడలూ'.......



......వాటి 'ఉధ్ధరణా'

"ఆలూలేదు, చూలూ లేదు......" అని సామెత. 

ఇప్పుడు "కర్రాలేదు, బిళ్లాలేదు, గూటేబిళ్లాట ప్రోత్సాహం కొసం ఔట్ డోర్ స్టేడియం కట్టిస్తానన్నారట" అని కొత్త సామెత.

"పంచాయతీ యువ క్రీడా అభ్యుదయం" అనో యేదో పేరుని "పైకా" గా వ్యవహరిస్తూ, అన్ని పంచాయతీల్లోనూ అనేక 'భవనాలు' నిర్మించేస్తున్నారు--లక్షల ఖర్చుతో!

భవనం అంటే యెంతా? ఓ 6 X 6 అడుగుల గదికి పైన స్లాబూ, ఓ గుమ్మం, దానికో తలుపూ, ముందు రెండు మెట్లూ!

మా నరసాపురం మండలం లోని సీతారాంపురం జిల్లా పరిషత్ పాఠశాలలో, ఈ పైకా భవనం లో, మధ్యాహ్న భోజన పథకానికి వంటలు చేసే సామాగ్రిని భద్రపరుస్తున్నారట!

ఆ ప్రథానోపాధ్యాయుణ్నడిగితే, "నా బొంద! భద్రపరచడానికి 'క్రీడా సామాగ్రి' అంటూ వుంటేగా! యెలాగూ మధ్యాహ్న భోజనాలకి వంటలకి ఓ షెడ్డూలేదు, సామానుకోసం ఓ స్టోర్ రూమూ లేదు. అందుకని ఈ భవనాన్ని 'ఇలా' వాడుకుంటున్నాము!" అని నిజాలని కక్కేశాడట. పాపం ఆయన మాత్రం యేం చెయ్యగలడు?

ఖో ఖో లాంటి ఆట కోసం ఓ రెండు చెక్క స్థంభాలని పాతించే దిక్కులేదు. తరతరాలుగా అవే బంతులతో మన యువ క్రీడాకారులు, కాళ్లకి బూట్లు కూడా లేకుండా, ఫుట్ బాలూ, వాలీబాలూ ఆడుకుంటున్నారు. హాకీ, క్రికెట్ ల సంగతి చెప్పనక్కరలేదు--రాళ్లనే వికెట్లుగా.......ఇలా! (యెన్నికలముందు మాత్రం రహస్యమార్గాల్లో ఈ కిట్లు తరలి వస్తూంటాయి--యువ వోటర్ల కోసం)

ఈ తతంగాలు ఇలా సాగుతుంటే, మొన్న మన రాష్ట్ర బడ్జెట్లో, ఇదివరకెన్నడూ లేనివిధంగా క్రీడలకోసం 200 కోట్లు కేటాయించి, "ప్రతి నియోజక వర్గం లోనూ కనీసం ఒక స్టేడియం నిర్మిస్తాము. అదీ మా ఘనత" అని డబ్బా కొట్టుకున్న మంత్రినేమనాలి? 

ఇలాంటి మూర్ఖ పథకాలతో ముందుకు సాగుతున్న ప్రభుత్వాలని మళ్లీ నెత్తికెత్తుకోవాలా? (వాళ్లు మూర్ఖులు అనుకుంటే, మనమే మూర్ఖులం. యెందుకంటే, వాళ్ల కార్యకర్తలకీ, ప్రభుత్వాలకీ జరగవలసిన మేళ్లు వీటిద్వారానేకదా జరుగుతున్నది!)

ఆలోచించండి.

No comments:

Post a Comment