haaram logo

Friday, February 24, 2012

తెలుగుకే యెందుకు......



........తెగులు?

మొన్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా "మళ్లీ" పెద్దలు తెగబాధపడిపోయారు--తెలుగు భాషాభివృధ్ధి జరగడం లేదు--అంటూ.

క్రితంతో పోలిస్తే, 30% మంది తెలుగుకు దూరమయ్యారని నిన్న జరిగిన ఇంకో సభలో వారెవరో ప్రకటించారు.

చంద్రబాబుతోసహా, 'తెలుగులో మాట్లాడినందుకు శిక్ష పొందా'నని చెప్పిన కి కు రె తో సహా, అనేకమంది నాయకులూ, పండితులూ, పాత్రికేయులూ ఇలాంటి వేదికలమీద తెలుగు గురించి బాధపడడం మనకి మంచి స్పూర్తినిస్తుంది. సహజమే కదా? చాలా సంతోషం.

అభివృధ్ధి సంగతి ఆ పైవాడెరుగు. అసలు మన భాష మృత భాషల్లో చేరకుండా వుండడానికి యెవరెలా దోహదం చెయ్యాలి?

టీవీల్లో "ఒక నిమిషంపాటు ఇంగ్లీషు మాట లేకుండా యేదైనా మాట్లాడండి" అని జనాలని అడగడం ద్వారానా?
ఫైళ్లని దస్త్రాలు అనీ, కాంట్రాక్టర్లని గుత్తేదారులు అనీ, ఇలా మార్చుకోవడం ద్వారానా?
స్కూళ్లలో ముందు వుపాధ్యాయులకీ, తరవాత విద్యార్థులకీ, వేయ్యేళ్ళ తెలుగు సాహిత్యం తో తలంటడం ద్వారానా? ఓ శాఖ యేర్పరచి, ఓ మంత్రిని నియమించడం ద్వారానా?
అభాసం (అధికార భాషా సంఘం), అకాడమీ వగైరాలని పునరుధ్ధరించడం ద్వారానా?
అసెంబ్లీలో స్పీకరూ, సభ్యులూ తెలుగులో మాట్లాడడం ద్వారానా? (ఇప్పుడదే చేస్తున్నార్లెండి--నువ్వు వెధవ, నువ్వు నాకంటే వెధవ--అంటూ)
క్రొత్త క్రొత్త "ఫాంట్"లూ, సాఫ్ట్ వేరూ కనిపెట్టడం ద్వారానా?
అనేక తీర్మానాలు "యేకగ్రీవంగా" ఆమోదించడం ద్వారానా? 

ఇలా చాలా చాలా మార్గాలున్నాయి.

అన్నింటికన్నా ముఖ్యమైనది--నాతో యేకీభవించిన (ఆయనతో నేనే యేకీభవించానేమో) సి నా రె చెప్పినట్టు--"సాంకేతిక పదాలైన" బస్సు, రైలు, రోడ్డు ల జోలికి పోకుండా మిగతా మాటలైనా తెలుగులో మాట్లాడాలని చేసిన సూచన!

(ఇవి సాంకేతిక పదాలు కాదుగానీ, ఆయన అలా అనకపోయినా, ఆ విలేఖరి అలా వ్రాసి వుంటాడు--అది కూడా మన తెలుగు దౌర్భాగ్యమే!). సరే.

ముందు మన విద్యార్థుల దగ్గరకీ, తరవాత వుద్యోగులూ వగైరాల దగ్గరకీ వెళదాం.

ఎస్ ఎస్ కే భగవాన్ అనే ఆయన రూపొందించి, ఈనాడు పత్రికలో ప్రచురించబడ్డ, పదో తరగతి "మోడల్" ప్రశ్నా పత్రం గమనిస్తే--పేపర్ - I లో పార్ట్స్ ఏ & బీ ల్లో ఒకదాంట్లో పదీ, ఇంకోదాంట్లో 19 (మొత్తం 29) "జవాబులు" వ్రాయాలి విద్యార్థులు. సమయం 2.30 గంటలు, మొత్తం మార్కులు 50.

పేపర్ - II లో మళ్లీ పార్ట్స్ ఏ & బీ ల్లో, ఒకదాంట్లో 11, ఇంకోదాంట్లో 19 (మొత్తం 30) "జవాబులు" వ్రాయాలి వారే. సమయం 2.30 గంటలు, మొత్తం మార్కులు 50.

రెండు తెలుగు పేపర్లకీ కలిపి 100 మార్కులు తెచ్చుకోడానికి, 59 జవాబులివ్వాలి. (ఇదేమి లెఖ్ఖ అని నన్నడగకండి!)

ఇంక, ప్రశ్నలు--ఒక పద్యానికి "ప్రతిపదార్థం" వ్రాయడం, ఒక పద్యానికి "పద్యభావం" వ్రాయడం, ఓ రెండు  వాక్యాలకి "అర్థ, సందర్భం" వ్రాయడం, ఓ పద్యాన్ని "పాదభంగం" లేకుండా వ్రాయడం, ఓ నాలుగు టాపిక్కులమీద వాక్యాలకి, పదివాక్యాలు మించకుండా సమాధానం వ్రాయడం, ఓ సాహిత్య "ప్రక్రియ" గురించి "తెలపడం" తో పార్ట్ ఏ ముగుస్తుంది.

పార్ట్ బీ లో, భాషగురించీ, వ్యాకరణం--సంధులూ, సమాసాలూ, అలంకారాలూ వగైరా.

ఇంక పేపర్ 2 లో, పార్ట్ ఏ అంతా-- నాన్‌డిటెయిల్డ్ అనుకుంటా (బారిష్టర్ పార్వతీశం) గురించి. రెండోభాగంలో వ్యాస రచన, లేఖలు, జాతీయాలని సొంతవాక్యాల్లో ప్రయోగించడం.

పార్ట్ బీ లో మొదటి భాగం పాసేజ్ చదివి ప్రశ్నలకి జవాబులు వ్రాయడం, పద్యాన్ని చదివి, ప్రశ్నలకి జవాబు వ్రాయడం, రెండో భాగం లో ఆధునిక వాక్యంలోకి మార్చి వ్రాయడం, క్రియనుమార్చి, వ్యతిరేకార్థం వచ్చేలా వ్రాయడం, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ లూ, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ లూ, జాతీయాల వివరణా.

దాంతో పరీక్ష ముగుస్తుంది.

ఇక్కడొక విషయం. చిన్నప్పణ్నించీ వాళ్లకి తెలుగు సరిగ్గా నేర్పకుండా, పదో తరగతిలో ఇంత పరీక్ష అవసరమా?

ఓ ప్రక్క హెడ్ మేష్టర్లూ, టీచర్లూ గోల పెట్టేస్తున్నారు--రిజల్టు శాతం పెరగకపోతే, మీ పీకలు కోస్తాం అన్నంతగా బెదిరిస్తున్నారు అని. (అందుకే చాలా స్కూళ్లలో పుస్తకాలూ, గైడ్లూ  పెట్టేసుకొనో, సమాధానాలు వాళ్లే చెప్పేసో మమ అనిపిస్తున్నారు!)

ఇంక పరీక్షల్లోని ప్రశ్నలు చూస్తే, పేపరు ఇచ్చేవాళ్ల పాండిత్యం అంతా ప్రదర్శిస్తాయిగానీ, వాటివల్ల విద్యార్థికో, అభ్యర్థికో యేమైనా వుపయోగం వుంటుందా అని ఆలోచించరు.

విద్యార్థుల పరిస్థితి ఇలా వుంటే, అధ్యాపకుల బీ ఎడ్, డీ ఎడ్ లాంటివాటిలో, తెలుగుభాషాధ్యాపకులకి ఇచ్చే ప్రశ్నలలో, కనీసం 25% కి కూడా--తెలుగుమీద మంచి ఆధిపత్యం వున్నవాళ్లుకూడా--ఇదీ సరైన సమాధానం అని ఖచ్చితంగా చెప్పలేరు! దీనికితోడు, చిత్ర విచిత్రమైన సమాధానాలు ఇచ్చి, వాటిలో సరైనది గుర్తించండి అంటారు!

"ఉపమా కాళిదాసస్య...." అంటే, కాళిదాసుకు ఉప్మా చాలా ఇష్టమట అనో, ఉప్మా చాలా బాగా వండుతాడు అనో చెపుతున్న అధ్యాపకులున్న రోజులు ఇవి! (వీళ్లకన్నా, గణపతి చెప్పిన "శ్రీరామ చారు....." భావం ప్రకారం ఆయనే మెరుగేమో!)

"ఉపమా పూర్వక రూపకాలంకారం", "అర్థాంతరన్యాస పూర్వక ఉపమాలంకారం" లాంటివి కూడా వింటున్నాము.

వుద్యోగులకి--ఉదాహరణకి--వీ ఆర్ వో/వీ ఆర్ ఏ లకి సూచిస్తున్నవాటిలో, చరిత్రలో చాలా ఘోరమైన సిలబస్ వుంది(ట).

"త్రిసముద్రతోయ పీతవాహనుడు" అంటే యెవరో మీకు తెలుసా? ఆ పదాలకి అర్థం అయినా తెలుసా? (మూడుసముద్రాల్లోని నీళ్లలో వుండే పీతలన్నీ వాహనాలుగా కలవాడు....ద్విగు సహిత, షష్టీ తత్పురుష పూర్వక బహువ్రీహి సమాసం అనిమాత్రం చెప్పెయ్యకండి! అది గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదుట.)

మరి, తెలుగు పేరు చెపితేనే జనాలు పారిపోరూ?

ఆలోచించండి.

No comments:

Post a Comment