"స్ఫూర్తిమంతులు....!"
మొన్న తగులబెట్టబడిన "రత్నాచల్" ఎక్స్ ప్రెస్ డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ లకి, "అవార్డు" ఇచ్చారట.....రైల్వే వాళ్లు! "సమయస్పూర్తి తో" ఫోను చేసి మరీ కరెంటు సప్లై ఆపి, ఇంజను మీదకెక్కిన వాళ్ల ప్రాణాలు కాపాడినందుకు. (నా బొందలో సమయస్ఫూర్తి.....నేనైతే, వాళ్ల వుద్యోగాలు పీకేసి వుండేవాడిని--కొన్ని కోట్ల క్రొత్త ఇంజనూ, ఒక్కోటీ కొన్ని లక్షల ఖరీదు చేసే 23 బోగీలూ తగులబెట్టడానికి దోహదం చేసినందుకు).
100 కీలోమీటర్ల వేగంతో వస్తూ.....ఓ కిలోమీటరు దూరం నుంచి జనాలని చూసి, సడెన్ బ్రేక్ వేస్తూ, జనాలకి కేవలం "5 మీటర్ల" దూరం లో రైలు ఆపగలిగినందుకు......యెగబడి వాణ్ని చితక్కొట్టేశారు....! (నేనైతే, వాడిని వెంటనే కంటిచూపు పరీక్షకి పంపించేవాణ్ని! రైల్వేలో అదో ఘోరమైన శిక్ష.....ఆ వంకతో డిస్ మిస్ చేసేస్తారు(ట)......ఆ తరువాత.....రిపోర్టులో కంటిచూపు 100% ఖచ్చితంగాలేదు అని వస్తుంది కాబట్టి!).
ఆ డ్రైవర్ ని నేనే అయితే, స్పీడుని తగ్గించుకుంటూ......"నా రైలు" కి ప్రమాదం జరగని స్టేజి వరకూ చూసుకుని, అదే స్పీడులో ముందుకి నడిపించేసేవాడిని.......తరువాత స్టేషన్ వరకూ......యెవరు బ్రతికారో, చచ్చారో లెఖ్ఖ చెయ్యకుండా!
యేమో.....తరువాత అన్ని కోట్ల రైలుని కాపాడినందుకు నాకు ఎవార్డ్ ఇచ్చేవారేమో......!
మహా అయితే, "నిర్లక్ష్యంగా" నడిపి, కొన్ని పదుల మంది ప్రాణాలు తీశానని, పనిష్మెంటు ఇచ్చేవారేమో! (తరువాత ఇంకెవడైనా 'రైల్ రోకో' అంటే చాలు, ఆమడదూరం పరిగెత్తేవారు!)
పాపం....."క్లియరెన్స్" ఉందికదా అని బండి నడిపి, ట్రాక్ పై పని చేస్తున్న గాంగ్ మెన్ లనీ, కూలీలనీ పొరపాటున రైలు గుద్దేస్తే, బాధ్యులందరితో పాటు డ్రైవర్ లకి కూడా పనిష్మెంట్ ఇవ్వడం లేదూ......అనేక కేసుల్లో? అలాంటి పనిష్మెంట్ నాకొచ్చినా సంతోషంగా స్వీకరించేవాడిని......భవిష్యత్తులో యెవరూ రైలుకి అడ్డంగా రాకుండా వుండేలా చేసినందుకు!
ఇప్పటికైనా, రైల్వే అధికారులు......ఇలాంటి సంఘటనల్లో....."రైలు ఆపడానికి ప్రయత్నించద్దు"......అని డ్రైవర్లకి ఆదేశాలివ్వాలి. రైల్వేల, "మన" ఆస్థుల్ని కాపాడాలి!
(నిజానికి......"అంబులెన్స్" గానీ, "ఫైర్ ట్రక్" గానీ యెవరినైనా గుద్దేసినా, కేసు లేదంటారు.....యెంతవరకూ నిజమో నాకు తెలీదు. ఇది అలాంటి వాటిని మించిన......కొన్ని వేలమంది......పెద్దా, చిన్నా, ముసలీ, ముతకా, వికలాంగ, రోగగ్రస్త వగైరా ప్రజల ప్రాణాలకీ, కొన్ని కోట్ల విలువైన "మన" ఆస్థులకీ సంబంధించిన వ్యవహారం! అందుకే ఇందులో యేమీ తప్పు లేదు!)
యేమంటారు.....?
(ఇది నేను ఆ "అవార్డు" గురించి వార్త చదివిన రోజున వ్రాసిన టపా. అందరూ 'వేడిలో' వుండగా ప్రచురించడం యెందుకులే అని ఆపాను. ఇప్పుడు ప్రచురించాను. నిర్మొగమాటం గా మీ అభిప్రాయాలని వ్రాయండి).