ఆరొకట్లు
11.11.11--మళ్లీ వందేళ్ల వరకూ రాదట. అదియొక వింత!
మొన్నోరోజున, ప్రపంచంలో 700 కోట్లవ శిశువు జన్మించిందన్నారు మన దేశంలోనే! అది నిజంగా ప్రపంచమంతా తెలుసుకోవలసిన అద్భుతమైన వింత.
మరి ఈ ఆరొకట్ల మాటో?
మామూలుగా మూడొకట్లని "పంగనామాలు"గా వ్యవహరిస్తారు. మోసపోయినవాడిని "ఇంకేముంది! నీకు మిగిలింది......" అంటూ చేతి బొటన, చిటికెన వ్రేళ్లు మడిచి, నుదుటిమీద పైజుంచి క్రిందకి గీస్తున్నట్టుగా అభినయిస్తారు!
ఆరొకట్లు కాబట్టి, రెండు పంగనామాలు. ఆ మాటలు కలిస్తే "ఆమ్రేడిత సంధి" అవుతుందోలేదో నాకు తెలీదు. కానీ, మా మేష్టారు--కవిశేఖర, కవిభూషణ, కవితావతంస శిష్ట్లా వెంకట సుబ్బయ్యగారు, "అందరూ మిట్ట మధ్యాహ్నం అంటారు. అది తప్పు. మధ్య+మధ్యాహ్నము=మట్ట మధ్యాహ్నము అవుతుంది"--అని చెప్పేవారు.
అదే సూత్రాన్ని వుపయోగించి, "పం పంగ నామాలు" 'కాయిన్' చేశానన్నమాట! (ఇంగ్లీషులో క్రొత్త పదాలని, ప్రయోగాలని కనిపెడితే, దాన్ని కాయిన్ చెయ్యడం అంటారు. తెలుగులో అలాంటి మాట గుర్తుకురాక ఇలాగే వ్రాసేశాను.)
ఈ వేవె యెక్కడివరకూ వెళ్ళిందంటే, పేపర్లనిండా అవే వార్తలు--ఆరోజున 11గంటల 11 నిమిషాలకి, ఇంకా 11సెకన్లకి 'పుట్టిన శిశువులు' అంటూ ఫోటోలూ, వార్తలూ.
కొంతమంది ఆ అంకెలు వ్రాసిన అట్టనో, కాయితాన్నో నిలువుగా వుంచి చూస్తే, "శివనామాలు" కనిపిస్తాయంటున్నారు.
మా జిల్లా కలెక్టరైతే, అదేదో ట్రస్టుని ఆ రోజు, 11.11.11 (గం. ని. సె) కే "రిజిస్టరు" చేయించారట! (ఇలాంటి వాటిగురించి మరోసారి వ్రాస్తాను.)
ఇంకా వింతేమిటంటే, స్కూలు పిల్లలు, వీపుమీద ఆరు అంకెలూ కనిపించేలా, ఆరు జడలు అల్లుకొని స్కూళ్లకి వెళ్లడం! (మధ్యలో చుక్కలకి కుర్తాలమీద ఆ రెండేసి జడల మధ్యలో యే నల్లింకుతోనూ చుక్కలు పెట్టుకోలేదు!)
ఇప్పటికి ఈ వేవె లు పరాకాష్టకి చేరాయంటారా? ఒక వేళ చేరితే, "పెరుగుట విరుగుటకొరకే" అనే సూత్రమ్మీద తగ్గుతాయంటారా?
యేమో.......మన ఆహార, తదితర ద్రవ్యోల్బణాలమీద కూడా అలాంటి పిచ్చి ఆశతోనే బ్రతుకుతున్నాం ఇప్పుడు.
చూద్దాం.
No comments:
Post a Comment