"భ్రష్ట భయంకర" సంగీతం-5
.......ఇంక ముగింపు.....
సామాన్యులకి ఈ హింస నుంచి విముక్తి యెలా?
1. అవేవో "అల్ట్రా సౌండ్" పరికరాలంటారు.....సినిమా పాటలని (ఆ మాటకొస్తే, యే సంగీతం, పాటలూ, ఉపన్యసాలూ, చివరికి యెలక్షన్ సమయం లో ప్రచారాలూ కూడా) అలా రికార్డు చేసి, అవి వినాలనుకునే వాళ్లకి ప్రత్యేక ఇయర్ ఫోన్ల ద్వారా మాత్రమే వినేలా యేర్పాటు చెయ్యాలి.
......ఇది జరిగే పని కాదు.
2. సినీ పాటల రచయితలు.....ముఖ్యంగా అనంత శ్రీరాం లాంటి యువకులైన వాళ్లు.....ఇంగ్లీషు పదాలని పాటల్లో, పల్లవుల్లో చొప్పించడం మానెయ్యాలి. ర్యాప్ అవసరమనుకొంటే, అదీ తెలుగు లోనే వ్రాయాలి. చాలా మంది, యేదేదో అర్థం లేని మాటలు వరుసలకోసం వ్రాసేసి, ఇంత బాగా వ్రాశాం, అంత బాగా వ్రాశాం, అంటూ డబ్బా కొట్టుకొంటారు. అలాంటివి మానెయ్యాలి.
......ఇదీ సాధ్యం కాదు. "జనాలు అడిగే విధంగానే వ్రాస్తున్నాం"....అంటారు!
3. సంగీత దర్శకులు.....ఆ వూళలనీ, డప్పులనీ అంతంత యెక్కువ శబ్దంతో రికార్డు చేయడం మానెయ్యాలి. ఆ కేకలు మానెయ్యాలి.
......ఇదీ పై సూచన లాగే..... "జనాలు అడిగే....." అనే అంటారు!
4. ఇంక ప్రభుత్వాలు......వీటి చేతుల్లో అంతా వుంటుంది కానీ, యేమీ లేదు అన్నట్టే వుంటాయి.
యే పండుగ అయినా, ఇంకో ఫంక్షన్ అయినా, స్పీకర్లకి అనుమతులు ఇవ్వకూడదు. ఆ ఆవరణలో వున్నవాళ్లకు వినపడడానికి మాత్రమే సరిపోయే అంత సౌండ్ పెట్టుకోడానికే అనుమతులు ఇవ్వాలి. అదికూడా, నిర్ణీత సమయాలకే పరిమితం చేయాలి.
ఇలాంటి వాటికి ప్రభుత్వం భద్రత పేరుతో ప్రజల ధనాన్ని ఇలా దుబారా చెయ్యడం మానెయ్యాలి.
అనుమతుల షరతులని ఉల్లంఘించేవాళ్లని నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి.
అందుకని, మనం చెయ్యవలసిందేమిటీ?
వచ్చే యే యెలక్షన్ లోనైనా, నిలబడే వాళ్లని, ఇలాంటి హామీ ఇవ్వాలి అనీ, వాటిని అమలు చెయ్యాలి అనీ, నిలదీసి, అలాంటివాళ్లకే వోట్లు వెయ్యాలి.
ఈ విషయాల్లో, యే మతానికీ, యే కులానికీ, యే వర్గానికీ మినహాయింపు వుండకూడదు!
అలా వాగ్దానం చేసేవాళ్లని, అన్ని మతాల, కులాల, వర్గాల వాళ్లూ అంగీకరించి, వాళ్లకే ఓట్లూ వేసేలాగ కృషి చేస్తాము అని హామీ ఇవ్వాలి మనం!
అలాగే, మీడియా పాత్ర చాలా ముఖ్యం.....పోటీలు పడి పేపర్లలోనూ, టీవీల్లోనూ, ఇలాంటివాటిని ప్రచురించడం మానెయ్యాలి. కనీసం వార్తల ఛానెళ్లలోనైనా, "వార్తలకి మాత్రమే" పరిమితమైతే అందరికీ మంచిది!అదీ పరిష్కారం.....ఇలాంటి జాడ్యాలన్నింటికీ!
(ఇప్పటికి ఇంతే)